ప్రతిభకు ప్రోత్సాహం.. ఆవిష్కరణలకు ఆహ్వానం! | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు ప్రోత్సాహం.. ఆవిష్కరణలకు ఆహ్వానం!

Jul 21 2026 1:30 AM | Updated on Jul 21 2026 1:30 AM

సుస్థిరత కోసం విజ్ఞానం

ఆదోని: బాలల్లో శాసీ్త్రయ దృక్పథం పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించే ‘జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌’కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ముఖ్యంగా శాసీ్త్రయ ఆలోచనలను చిన్న వయస్సు నుంచే పెంపొందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో ఏటా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రయోగశాలలకే మాత్రమే కాకుండా గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, కుటుంబాల చుట్టూ కనిపించే సమస్యలనే పరిశోధన అంశాలుగా ఎంచుకొని విద్యార్థులు స్వయంగా పరిశీలనలు, సర్వేలు, ప్రయోగాలు నిర్వహించి నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. కార్యక్రమంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే 10 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులు పాల్గొనవచ్చు. సాధారణంగా ఇద్దరు విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి, ఒక గైడ్‌ ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో ప్రాజెక్టును సిద్ధం చేయాలి. విద్యార్థులు ఎంపిక చేసుకున్న అంశంపై క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించడం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, పరిశీలనలు చేయడం, గణాంకాలను విశ్లేషించడం, శాసీ్త్రయ ఆధారాలతో పరిష్కారాలను ప్రతిపాదించాల్సి ఉంటుంది.

ప్రాజెక్టు ఇలా ఉండాలి

ప్రతి ప్రాజెక్టు వినూత్నంగా ఉండటంతో పాటు స్థానిక సమస్యకు ఉపయోగపడే విధంగా ఉండాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. కేవలం నమూనాలు (మోడళ్లు) తయారు చేయడం కాకుండా, పరిశోధన ఆధారిత అధ్యయనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంపికై న ప్రాజెక్టులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ప్రతిభ కనపరచిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో తమ పరిశోధనలను ప్రదర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది.

ఇలా నమోదు చేసుకోవాలి

ఆసక్తి ఉన్న విద్యార్థులు, గైడ్‌ ఉపాధ్యాయులు అధికారిక ఎన్‌సీఎస్‌సీ పోర్టలోలో ఆన్‌లైన్‌ ద్వారా ఈనెలాఖరులోపు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శాసీ్త్రయ పరిశోధనలో తమ ప్రతిభ చాటుకోవచ్చు.

2026–2027 సంవత్సరానికి ‘సుస్థిరత కోసం విజ్ఞానం – ఆవిష్కరణలు’ అనే ప్రధాన అంశాన్ని నిర్ణయించారు. వ్యర్థాల నిర్వహణ శక్తి, పొదుపు, పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి సంరక్షణ, ఆహార భద్రత, వ్యవసాయం, ప్రజారోగ్యం, జీవవైవిధ్య పరిరక్షణ, భారతీయ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థల వినియోగం వంటి అంశాలపై విద్యార్థులు తమ పరిశోధనలు చేపట్టవచ్చు.

– బి.చిరంజీవి, సైన్స్‌ టీచర్‌, పెద్దహరివాణం

జాతీయ స్థాయికి పెద్దహరివాణం విద్యార్థినులు

2023లో గుజరాత్‌ రాష్ట్రంలో జరిగిన 30వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యక్రమంలో ఆదోని మండలం పెద్దహరివాణంకు చెందిన 8వ తరగతి విద్యార్థినులు ప్రతిభ కనపరిచారు. ‘ఎలక్ట్రిసిటీ ఫ్రం వర్టికల్‌ కర్వ్‌ బ్లేడ్స్‌’ అనే అంశంపై చేసిన ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికై ంది. ఆదోని మండలం పెద్దహరివాణం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సైన్స్‌ టీచర్‌ చిరంజీవి పర్యవేక్షణలో విద్యార్థినులు రహనా, మేఘన ఈ ప్రాజెక్టును ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను తీర్చిదిద్దిన బి. చిరంజీవిని తిరుపతి జిల్లా గూడూరులో ఏపీఎస్‌ఈఆర్‌టీ డైరక్టర్‌ ప్రతాప్‌ రెడ్డి సత్కరించారు.

జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు

దరఖాస్తుల ఆహ్వానం

ఈనెలాఖరు వరకు గడువు

బాల శాస్త్రవేత్తలకు

అరుదైన అవకాశం

సమస్యలపై పరిశోధనలకు ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement