శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన పూల మొక్కల కుండీలపై ఉన్న దేవస్థాన లోగోలను దేవస్థాన ఈఓ ఆదేశాల మేరకు సోమవారం సిబ్బంది తొలగించారు. ఆదివారం ‘సాక్షి’లో ‘శివ..శివా..అపచారం..!’ అనే శీర్షికతో దేవస్థాన పరిపాలన భవనంలోని పలు విభాగాల చాంబర్ల వద్ద ఏర్పాటు చేసిన మొక్కల కుండీలకు శ్రీశైల దేవస్థాన అధికారిక లోగో ఏర్పాటు చేయడం, అక్కడే కుప్పలుగా చెప్పులు ఉండంతో వార్త ప్రచురితమైంది. ఈ వార్తపై స్పందించిన దేవస్థాన ఈఓ అధికారులను పిలిపించి తక్షణమే మొక్కల కుండీలపై ఉన్న దేవస్థాన లోగోను తొలగించాలని ఆదేశించారు. దీంతో సిబ్బంది ఈఓ ఆఫీసులో ఉన్న అన్ని చాంబర్ల వద్ద కుండీలకు శ్రీశైల దేవస్థాన లోగో తొలగించారు.
రోడ్డు ప్రమాదంలో
12 జీవాలు మృతి
కల్లూరు: నగర శివారులోని రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 జీవాలు మృతి చెందాయి. ఉలిందకొండ ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. సోమవారం మధ్యాహ్నం కిమ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వద్ద పెద్దటేకూరు గ్రామానికి చెందిన బీచుపల్లి, మరో ఇద్దరు వ్యక్తులకు చెందిన జీవాలు రింగ్ రోడ్డు దాటుతున్నాయి. గమనించిన ఐచర్ వాహనాన్ని డ్రైవర్ ఆపాడు. వెనక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ఐచర్ వాహనాని ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలు రోడ్డు దాటుతున్న జీవాలపైకి దూసు కెళ్లడంతో 8 గొర్రెలు, 4 మేకలు మృతి చెందాయి. మరో 29 గొర్రెలు, 6 మేకలు గాయపడ్డాయి. ఈ ప్రమాద సంఘటనపై గొర్రెల యాజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల, మేకల పెంపకం దారుల చైర్మన్ శ్రీనివాసులు, కల్లూరు సింగిల్ విండో చైర్మన్ శేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన జీవాల పెంపకం దారులను ఆదుకుంటామన్నారు. కల్లూరు పశువైద్యాశాల సహాయ సంచాలకులు పార్థసారధి, చిన్నటేకూరు, ఉలిందకొండ పశువైద్యులు డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, డాక్టర్ దీప్తి, ఇతర సిబ్బంది సకాలంలో ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన జీవాలకు వైద్యం అందించారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
కర్నూలు: కర్నూలు పాతబస్తీలోని జమ్మి చెట్టు వద్ద హిందూ శ్మశాన వాటిక సమీపంలో జోరుగా పేకాట జరుగుతున్నట్లు సమాచారం అందడంతో వన్‌టౌన్ సీఐ మారుతి శంకర్ తన సిబ్బందితో దాడి చేసి కటిక వీధికి చెందిన షేక్ ఇస్మాయిల్‌తో పాటు మరో 8 మందిని అరెస్టు చేశారు. నిందితులు అందర్ బాహర్ అనే ఆటను నగదు పందెం పెట్టి ఆడుతుండగా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.58,200తో పాటు 9 సెల్‌ఫోన్లు, 4 బైక్‌లు స్వాధీనం చేసుకు న్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచినట్లు సీఐ మారుతి శంకర్ తెలిపారు.


