స్తంభించిన రిజిస్ట్రేషన్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

స్తంభించిన రిజిస్ట్రేషన్‌ సేవలు

Jul 21 2026 1:30 AM | Updated on Jul 21 2026 1:30 AM

కర్నూలు(సెంట్రల్‌): డాక్యుమెంట్‌ రైటర్ల నిరవధిక సమ్మెతో రిజిస్ట్రేషన్‌ సేవలు స్తంభించాయి. ఉమ్మడి జిల్లాలోని 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో సమ్మె ఎఫెక్ట్‌ స్పష్టంగా కనిపించింది. రైటర్లు అందుబాటులోకి రాకపోవడంతో ఒక్క డాక్యుమెంట్‌ కాడా సిద్ధం కాలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్‌ కూడా జరగకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి దాదాపు రూ. 2.5 కోట్ల మేర గండి పడింది. రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంట్ల తయారీ కోసం రైటర్ల స్థానంలో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జీఓ నంబర్‌ 396ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పోలవరం, అల్లూరి జిల్లాలు మినహా మిగతా 26 జిల్లా కేంద్రాల్లో తొలి విడతగా రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తరువాత మునిసిపాలిటీలు, మేజర్‌ గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను ప్రైవేట్‌ వ్యక్తుల ద్వారా నడిపిపించి అందులో ప్రస్తుతం డాక్యుమెంట్‌ రైటర్లు చేసే పనిని అంటే డాక్యుమెంట్‌ను రాయించడం, చలానాలు కట్టించడం, టైమ్‌ స్లాట్‌లను బుక్‌ చేయడం వంటి పనులను చేస్తారు. ఈ నేపథ్యంలో తాము చేసే పనులను రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల్లో చేయిస్తే ఏళ్లుగా డాక్యుమెంటర్‌ తయారీ విధానాన్నే నమ్ముకొని జీవనం చేస్తున్న తమ బతుకులు ఏమి కావాలని రైటర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు ఇవ్వడం, నిరసన, ప్రదర్శనలు చేశారు. అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు ఈ సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు.

డాక్యుమెంట్‌ల తయారీకి

హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు..

డాక్యుమెంట్‌ రైటర్లు నిరవధిక సమ్మెకు వెళ్లడంతో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ నివారణ చర్యలు చేపట్టింది. అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌లను తయారు చేయడానికి హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు డీఐజీ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

డాక్యుమెంట్‌ రైటర్ల నిరవధిక సమ్మె

ఉమ్మడి జిల్లాలో

ఒక్క రిజిస్ట్రేషన్‌ కాని వైనం

ఇబ్బంది పడిన ప్రజలు

ప్రభుత్వ ఆదాయానికి

రూ.2.5 కోట్ల గండి

రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ఎస్‌ఏ రెహమాన్‌, జిల్లా అధ్యక్షుడు సీఎస్‌ మహహ్మద్‌ రఫీ ప్రకటించారు. డాక్యుమెంట్‌ రైటర్ల నిరవధిక సమ్మె జూన్‌ 31వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో సమ్మె కొనసాగుతున్నట్లు చెప్పారు. ఏపీ దస్తావేజులేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు కర్నూలు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్‌ రైటర్లు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా డాక్యుమెంట్‌ తయారీని ఉపాధి మలుచుకొని జీవిస్తున్నామని, అయితే రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తే తమ ఉపాధికి గండి పడుతుందన్నారు. అనంతరం కర్నూలు, కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్లకు వినతిపత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రెసిడెంట్‌ మస్తాన్‌ సాహెబ్‌, నాయకులు నాగేశ్వరరావు, హనుంతరావు, చంద్రశేఖర్‌, ఇస్మాయిల్‌, రామకృష్ణ, రామచంద్రారెడ్డి, బాషా, భాస్కర్‌, హుద్దూస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement