సాక్షి,కృష్ణ: ఇటీవల నందూస్ వరల్డ్ వీసా స్కామ్ మరువక ముందే తాజాగా మరో వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూకేలో ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ‘ఫ్లైయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ’మోసం తాజాగా విజయవాడలో బయటపడింది. సుమారు 700 మంది బాధితుల నుండి ఈ సంస్థ భారీగా డబ్బులు వసూలు చేసి ముంచేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు.
ఓ యూట్యూబ్ ఛానల్‌లో వచ్చిన ప్రకటనలు, ప్రమోషనల్ వీడియోలను నమ్మి తాము హైదరాబాద్ బేగంపేట, విజయవాడ పరిసరాల్లో ఉన్న ఫ్లైయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీని సంప్రదించామని బాధితులు తెలిపారు. ఈ సంస్థ నిర్వాహకులు సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ తమను నమ్మించారని పేర్కొన్నారు.
యూకేలో స్కిల్డ్ వర్క్ వీసాపై ఉద్యోగం ఇప్పిస్తామని, కుటుంబ సభ్యులను కూడా డిపెండెంట్లుగా తీసుకెళ్లొచ్చని నమ్మబలికారు. అక్కడ ఉద్యోగం, వసతితో పాటు పోస్ట్ ల్యాండింగ్ సపోర్ట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ప్రక్రియకు రూ.12 లక్షలు ఖర్చవుతుందని, ముందుగా రూ.6 లక్షలు, యూకే వెళ్లిన తర్వాత మిగిలిన రూ.6 లక్షలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మి చాలామంది అప్పులు చేసి రూ.3 లక్షల నుండి రూ.12 లక్షల వరకూ చెల్లించారు. రిక్రూట్‌మెంట్ లైసెన్స్ లేకుండానే వీరు ఈ కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు బాధితులు గుర్తించారు.
డబ్బులు కట్టించుకున్న తర్వాతే వీరు అగ్రిమెంట్లు చూపించారని, అందులో ఉద్యోగ హామీ గురించి స్పష్టంగా లేదని బాధితులు వాపోయారు. మౌఖికంగా మాత్రం 100శాతం జాబ్ వస్తుందని నమ్మించారు. తీరా డబ్బులు కట్టాక వీసాలు రాకపోవడంతో నిలదీస్తే బాధితుల ఫోన్ నెంబర్లను బ్లాక్ చేశారు. లక్ష రూపాయలు మాత్రమే తిరిగి ఇస్తామని తేల్చి చెప్పారు.
న్యాయం కోసం హైదరాబాద్ బేగంపేటలోని కార్యాలయానికి వెళ్లి వివరణ కోరగా.. నిర్వాహకులు బాధితులపైనే ఉల్టా న్యూసెన్స్ కేసులు పెట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బాధితులపై సివిల్ సూట్లు దాఖలు చేసి, డబ్బులు అడిగితే రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.
తమను నిలువునా ముంచిన ఫ్లైయింగ్ బోర్డర్స్ సంస్థ యజమాని సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని, వారి బ్యాంక్ ఖాతాలను తక్షణమే సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమడబ్బును తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు.


