ఆ ఊళ్లో రాత్రిళ్లు సూర్యుడు!

Village Total Have Solar Lights - Sakshi

సాక్షి, సిద్దిపేట: జిల్లా కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో బంజేరుపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 124 కుటుంబాలు, 632 మంది జనాభా, 368 మంది ఓటర్లు ఉన్నారు. అంతా వ్యవసాయదారులే. ఈ ఊరికి ఓ ప్రత్యేకత ఉంది. అది ప్రతి ఇంటికీ సోలార్‌ లైట్లు ఉండటం విశేషం.

విద్యుత్‌ కష్టాలతో విసిగి వేసారి..
మారుమూల గ్రామం బంజేరుపల్లి. నాలుగేళ్ల క్రితం విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి. చిన్న ఫ్యూజ్‌ పోయినా రాత్రంతా జాగారమే. ఇలా విద్యుత్‌ కష్టాలతోవిసిగివేసారినగ్రామస్తులకు నాబార్డు అధికారి రమేశ్‌.. ఒక రోజు గ్రామాన్ని పర్యటించి సౌర విద్యుత్‌ గురించి వివరించారు. నాబార్డు సబ్సిడీ, లబ్ధిదారులు చెల్లించాల్సిన డబ్బుల వివరాలు తెలియజేశారు. దీనికి గ్రామస్తులు సమ్మతించారు. ఫలితంగా 120 కుటుంబాలకు సౌర పలకలు బిగించారు. ఇంకేముంది గ్రామంలో ప్రతి ఇంట్లో సౌర వెలుగులు వచ్చాయి. 

నాబార్డు సహకారం..
ప్రభుత్వ సాయం.. సౌర విద్యుత్‌ అంటే పరికరాలు బిగించడానికి వేల రూపాయల ఖర్చుతో పాటు మరమ్మతులు చేయడం కష్టం. 500 యూనిట్ల సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు (నాలుగు ట్యూబ్‌లు, 5 ఫ్యాన్లు, కూలర్, టీవీ, ఫ్రిడ్జ్,వన్‌ హెచ్‌పీ మోటార్‌ మొదలైనవి వినియోగించేందుకు సరిపడా విద్యుత్‌) రూ.85,000 ఖర్చు అవుతుంది. అయితే, నాబార్డు చెల్లించే సబ్సిడీ 40 శాతం పోగా.. లబ్ధిదారుడు చెల్లించే వాటా కోసం స్థానిక బ్యాంకు నుంచి సులభ వాయిదాలతో రుణాలు ఇప్పించారు. మిగిలిన డిపాజిట్‌ కుటుంబానికి రూ.8,500 చొప్పున వసూలు చేశారు. వీటితో సోలార్‌ ప్యానెళ్లు, బ్యాటరీలు, వైరింగ్‌ తెచ్చి నాబార్డు అనుబంధ మెకానిక్‌లు బిగించారు. పిడుగుపాటు నుంచి రక్షణగా లైట్నింగ్‌ అరెస్టర్లు కూడా బిగించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, నీటి పారుదల, మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు గ్రామస్తులను అభినందించారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. 

నామమాత్రంగా విద్యుత్‌ బిల్లుల చెల్లింపు..
ఊరంతా సౌర విద్యుత్‌ వినియోగించడంతో విద్యుత్‌ బిల్లులు నామ మాత్రంగానే చెల్లిస్తున్నారు. గ్రామం లో 120 గృహలకు విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, గతం లో నెలకు గ్రామం మొత్తానికి కలిపి రూ.25 వేలకుపైగా బిల్లులు చెల్లించేవారు. సోలార్‌ విద్యుత్‌కు సంబంధించి 2 నెలలకోసారి మినిమం చార్జీ కింద రూ.12 వేలు చెల్లిస్తే సరిపోతుందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో వీధి దీపాల కోసం 60 యూనిట్లు బిగించారు. వీటి నిర్వహణ గ్రామ పంచా యతీ చూసుకుంటోందని గ్రామస్తులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top