వరి విత్తనాలు వేసే డ్రోన్‌ వచ్చేసింది! | Research By Marut Drones With The Support Of PJTSAU And NABARD On The Use Of Drones In Agriculture | Sakshi
Sakshi News home page

వరి విత్తనాలు వేసే డ్రోన్‌ వచ్చేసింది!

Published Tue, Jun 18 2024 9:00 AM | Last Updated on Tue, Jun 18 2024 9:00 AM

పొలంలో వరి విత్తనాలు వేస్తున్న డ్రోన్‌

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై పిజెటిఎస్‌ఎయు, నాబార్డ్‌ తోడ్పాటుతో మారుత్‌ డ్రోన్స్‌ పరిశోధనలు

వరి రైతులకు పంట అన్ని దశల్లోనూ డ్రోన్ల తోడ్పాటు

ఒకే డ్రోన్‌తోనే ఎరువులు, విత్తనాలు, ఆ తర్వాత పురుగుమందులు కూడా చల్లుకోవచ్చు..

ఇప్పటికే 700 మంది రైతులు, డ్వాక్రా మహిళలకు డ్రోన్‌ పైలట్‌ శిక్షణ

డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగుమందులు, ఎరువులు చల్లటం ద్వారా కూలీల ఖర్చును, సమయాన్ని రైతులు ఆదా చేసుకుంటూ ఉండటం మనకు తెలుసు. వరి విత్తనాలను వెద పెట్టడానికి ఉపయోగపడే డ్రోన్‌ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ సంస్థ మారుత్‌ డ్రోన్స్‌ ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంతో పాటు వ్యవసాయంలో డ్రోన్‌ సేవలపైనా విశేషమైన ప్రగతి సాధించింది.

తాజాగా వరి విత్తనాలు వేసే డ్రోన్‌ను రూపొందించింది. పేటెంట్‌ హక్కులు కూడా పొందింది. పిజెటిఎస్‌ఎయు, నాబార్డ్‌ తోడ్పాటుతో క్షేత్రస్థాయి ప్రయోగాలను పూర్తి చేసుకొని వెద పద్ధతిలో వరి విత్తనాలను వరుసల్లో విత్తే డ్రోన్లను ఇఫ్కో తోడ్పాటుతో రైతులకు అందుబాటులోకి తెస్తోంది. డిజిసిఎ ధృవీకరణ పొందిన ఈ డ్రోన్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ ఉండటం విశేషం.

గాలిలో ఎగిరే చిన్న యంత్రం డ్రోన్‌. అన్‌మాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌. అంటే, మనిషి పొలంలోకి దిగకుండా గట్టుమీదే ఉండి వ్యవసాయ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడే అధునాతన యంత్రం. ఇప్పుడు వ్యవసాయంలోని అనేక పంటల సాగులో, ముఖ్యంగా వరి సాగులో, కీలకమైన అనేక పనులకు డ్రోన్‌ ఉపయోగపడుతోంది. రైతులకు ఖర్చులు తగ్గించటం, కూలీల అవసరాన్ని తగ్గించటం వంటి పనుల ద్వారా ఉత్పాదకతను, నికరాదాయాన్ని పెంపొందించేందుకు డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి.

దోమల నిర్మూలన, ఔషధాల రవాణా వంటి అనేక ఇతర రంగాలతో పాటు వ్యవసాయంలో ఉపయోగపడే ప్రత్యేక డ్రోన్లను అభివృద్ధి చేయటంలో మారుత్‌ డ్రోన్స్‌  విశేష కృషి చేస్తోంది. ప్రేమ్‌ కుమార్‌ విస్లావత్, సాయి కుమార్‌ చింతల, ఐఐటి గౌహతి పూర్వవిద్యార్థి సూరజ్‌ పెద్ది అనే ముగ్గురు తెలుగు యువకులు 2019లో మారుత్‌ డ్రోన్స్‌ స్టార్టప్‌ను ్రపారంభించారు. డేటా ఎనలిటిక్స్, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్, కృత్రిమ మేథ, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి అధునాతన సాంకేతికతలతో వ్యవసాయ డ్రోన్లను రూపొందించటంపై ఈ కంపెనీ దృష్టి సారించింది.

ప్రొ. జయశకంర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్‌ఎయు), అగ్రిహబ్, నాబార్డ్‌ తోడ్పాటుతో రైతుల కోసం ప్రత్యేక డ్రోన్లను రూపుకల్పన  చేస్తోంది. నల్గొండ జిల్లా కంపసాగర్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో 50 ఎకరాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో గత రెండున్నరేళ్లుగా మారుత్‌ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. స్థానిక రైతులు పండించే పంటలకు అనువైన రీతిలో ఉండేలా ఈ డ్రోన్లను అభివృద్ధి చేశారు. వరి పంటపై డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లటానికి సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొటోకాల్స్‌(ఎస్‌.ఓ.పి.ల)ను గతంలోనే ఖరారు చేశారు.

వరి పంటపై పురుగుల మందు పిచికారీ..

ప్రస్తుతం వెద వరి పద్ధతిలో ఆరుతడి పంటగా వరి విత్తనాలను నేరుగా బురద పదును నేలలో విత్తుకోవడానికి ఉపయోగపడేలా డ్రోన్‌ను రూపొందించారు. ఇప్పటికే నాలుగైదు డ్రోన్‌ ప్రొటోటైప్‌ల ద్వారా వరి విత్తనాలను వరుసల్లో వెద పెట్టడానికి సంబంధించిన ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఒకటి, రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఎస్‌.ఓ.పి.లు పూర్తవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

డ్రోన్ల సేద్యానిదే భవిష్యత్తు!
తక్కువ నీరు ఖర్చయ్యే వెద పద్ధతిలోనే భవిష్యత్తులో వరి సాగు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వెద వరిలో విత్తనాలు వేయటం, ఎరువులు చల్లటం, చీడపీడలను ముందుగానే గుర్తించటం, పురుగుమందులు చల్లటం వంటి అనేక పనులకు డ్రోన్లు ఉపయోగపడతాయి. డ్రోన్‌ ధర రూ. పది లక్షలు. ఒక్క డ్రోన్‌తోనే పంట వివిధ దశల్లో ఈ పనులన్నీ చేసుకోవచ్చు.

డిజిసిఎ ధృవీకరణ ఉండటం వల్ల డ్రోన్‌ కొనుగోలుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద 6% వడ్డీకే అనేక పథకాల కింద బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రైతుకు 50% సబ్సిడీ వస్తుంది. ఎఫ్‌పిఓ లేదా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లకైతే 75% వరకు సబ్సిడీ వస్తుంది. పది డ్రోన్లు కొని అద్దె సేవలందించే వ్యాపారవేత్తలకైతే రూ. 2 కోట్ల వరకు రుణం కూడా దొరుకుతోంది. గ్రామీణ యువతకు డ్రోన్‌ సేవలు ఏడాది పొడవునా మంచి ఉపాధి మార్గం చూపనున్నాయి.

– ప్రేమ్‌ కుమార్‌ విస్లావత్, వ్యవస్థాపకుడు, సీఈఓ, మారుత్‌ డ్రోన్స్‌

డ్రోన్‌ విత్తనాలు వెద పెట్టేది ఇలా..
వరి నారు పోసి, నాట్లు వేసే సంప్రదాయ పద్ధతితో పోల్చితే విత్తనాలు వెదజల్లే పద్ధతి అనేక విధాలుగా మెరుగైన ఫలితాలను ఇస్తున్న విషయం తెలిసిందే. వెద వరిలో అనేక పద్ధతులు ఉన్నాయి. పొలాన్ని దుక్కి చేసిన తర్వాత పొడి దుక్కిలోనే ట్రాక్టర్‌ సహాయంతో సీడ్‌ డ్రిల్‌తో విత్తనాలు వేసుకోవటం ఒక పద్ధతి.

బురద పదును నేలలో ఎక్కువ నీరు లేకుండా డ్రమ్‌ సీడర్‌ను లాగుతూ మండ కట్టిన వరి విత్తనాలను చేనంతా వేసుకోవటం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతుల కన్నా.. బురద పదును నేలలో డ్రోన్‌ ద్వారా వరి విత్తనాలను జారవిడవటం మరింత మేలైన పద్ధతి. తక్కువ శ్రమ, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందని మారుత్‌ డ్రోన్స్‌ వ్యవస్థాపకులు చెబుతున్నారు.

ఎకరంలో వరి విత్తటానికి 20 నిమిషాలు..
ఈ విధానంలో వరి నారుకు బదులు దమ్ము చేసిన పొలంలో డ్రోన్‌ సాయంతో వరి విత్తనాలను క్రమ పద్ధతిలో జారవిడుస్తారు. ఇందుకోసం ఆ డ్రోన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన పైప్‌లాంటి సీడ్‌ డిస్పెన్సింగ్‌ డివైస్‌ను అమర్చుతారు. ఆ డివైస్‌కు డ్రోన్‌కు నడుమ వరి విత్తనాలు నిల్వ వుండేలా బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా 5 వరుసల్లో వరి విత్తనాలు బురద పదునుగా దమ్ము చేసిన పొలంలో విత్తుతారు. వరి మొక్కల మధ్య 10 సెం.మీ.లు, వరుసల మధ్య 15 సెం.మీ.ల దూరంలో విత్తుతారు.

సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలో విత్తనం అవసరమైతే ఈ పద్ధతిలో 8–12 కిలోల విత్తనం సరిపోతుంది. సన్న రకాలైతే 10–11 కిలోల విత్తనం చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 నిమిషాలకు ఒక ఎకరం చొప్పున రోజుకు ఒక డ్రోన్‌ ద్వారా 20 ఎకరాల్లో విత్తనాలు వెదపెట్టవచ్చు. సాళ్లు వంకర్లు లేకుండా ఉండటం వల్ల కలుపు నివారణ సులువు అవుతుందని, గాలి బాగా సోకటం వల్ల చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వెదపద్ధతి వల్ల తక్కువ నీటితోనే వరి సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

హెక్టారుకు రూ.5 వేలు ఆదా..
వెద వరి (డైరెక్ట్‌ సీడిండ్‌ రైస్‌– డిఎస్‌ఆర్‌) సాగు పద్ధతిలో డ్రోన్లను వాడటం ద్వారా కూలీల బాధ లేకుండా చప్పున పని పూర్తవ్వటమే కాకుండా సాగు ఖర్చు సీజన్‌కు హెక్టారుకు రూ. 5 వేలు తగ్గుతుందని మారుత్‌ డ్రోన్స్‌ సీఈవో ప్రేమ్‌ కుమార్‌ విస్లావత్‌ అంచనా. డ్రోన్‌ సాయంతో సకాలంలో పురుగుమందులు సకాలంలో చల్లటం వల్ల చీడపీడల నియంత్రణ జరిగి హెక్టారుకు 880 కిలోల ధాన్యం అధిక దిగుబడి వస్తుందన్నారు. రైతుకు హెక్టారుకు రూ.21,720 ఆదనపు ఆదాయం వస్తుందని ఆయన చెబుతున్నారు.

700 మందికి డ్రోన్‌ పైలట్‌ శిక్షణ..
మారుత్‌ డ్రోన్స్‌ పిజెటిఎస్‌ఎయుతో కలసి ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తోంది. రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలకు, ఎఫ్‌పిఓ సభ్యులకు, వ్యవసాయ పట్టభద్రులకు, పదో తరగతి పాసైన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటికే 700 మంది శిక్షణ పొందారు. అందులో 150 మంది స్వయం సహాయక బృందాల మహిళలు కూడా ఉన్నారు.

డిజిసిఎ ఆమోదం వున్న ఈ వారం రోజుల శిక్షణ పొందిన వారికి పదేళ్ల పైలట్‌ లైసెన్స్‌ వస్తుంది. వ్యవసాయ సీజన్‌లో డ్రోన్‌ పైలట్‌కు కనీసం రూ. 60–70 వేల ఆదాయం వస్తుందని ప్రేమ్‌ వివరించారు. ఈ డ్రోన్‌ పైలట్‌ శిక్షణ పొందిన వారు వ్యవసాయంతో పాటు మరో 9 రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చు. ఏడాది పొడవునా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది.
– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement