రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 10,084  | Nabard report On Average Income of Farmer Families | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 10,084 

Jun 25 2023 12:59 AM | Updated on Jun 25 2023 10:39 AM

Nabard report On Average Income of Farmer Families - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.10,084 అని నాబార్డు తేల్చింది. 2012–13లో ఇది రూ.6,426 కాగా, 2018–19 నాటికి రూ.10,084కు పెరిగిందని తెలిపింది. అయితే సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతుల ఆదాయం మాత్రం అంతగా లేదని పేర్కొంది. ఈ మేరకు పరిశోధనాత్మక అధ్యయన నివేదికను తాజాగా విడుదల చేసింది. పంటలు, పశు సంపద, వ్యవసాయేతర వ్యాపారం వంటి అంశాలను కూడా అధ్యయనంలో పరిశీలించారు. ‘మొత్తంగా పంటల సాగు ద్వారా వచ్చే ఆదా­యం వాటా 38 శాతం కాగా, పశు సంపద ద్వారా వచ్చే ఆదాయం వాటా 16 శాతంగా ఉంది.

వ్యవసాయేతర రంగాల ద్వారా కూడా ఆదాయం సమ­కూరుతోంది. కాగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన పంజాబ్, హరియాణాతో పాటు జార్ఖండ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో రైతుల నెలవారీ ఆదాయం అత్యధికంగా ఉంది. భూ పరిమాణం పెరిగినప్పుడు, వ్యవసాయ కార్యకలాపాల (పంటల ఉత్పత్తి, జంతువుల పెంపకం) ద్వారా రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతోంది.

పెద్ద రైతులకు అంటే 25 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 91 శాతం, కాగా చిన్న సన్నకారు రైతులకు ఇలా వచ్చే ఆదా­యం కేవలం 28 శాతమే. ఈ విధంగా రైతు భూ పరిమాణాన్ని బట్టి ఆదాయంలో వ్యత్యాసాలు ఉన్నా­యి. ఓబీసీ, ఇతర వర్గాల ఆదాయంతో పోలి­స్తే, ఎస్సీ, ఎస్టీ రైతు కుటుంబాల ఆదాయం తక్కువగా ఉంది..’అని నాబార్డు నివేదిక వెల్లడించింది.  

భవిష్యత్‌ తరాలు వ్యవసాయానికి దూరం 
‘భవిష్యత్‌ తరాలు వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదు. 63 శాతం మంది రైతులు తమ భవిష్యత్‌ తరం వ్యవసాయంలో ఉండాలని కోరుకో­వడం లేదు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదని భావిస్తున్నారు. అందుకే కొత్త తరం వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయం చేయడం రిస్‌్కగా వారు భావిస్తున్నారు. వ్యవసాయ భూపరిమాణం తగ్గడం, పెట్టుబడి ఖర్చులు పెరగ డం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నా­యి. అలాగే వ్యవసాయానికి కీలకమైన కూలీల కొరత కూడా అనాసక్తికి కారణంగా ఉంది. 

మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి కూడా భవిష్యత్‌ తరం వ్యవసాయానికి దూరంగా ఉండటానికి కారణంగా కన్పిస్తోంది. వ్యవసాయంలో సరైన ఆదాయం రాకపోవడంతో, మెరుగైన భవిష్యత్తు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల­కు వలసలు పెరుగుతున్నాయి. అంతేకాదు గౌరవం, సామాజిక హోదా కూడా ఉండటం లేదు..’అని పేర్కొంది.  

లాభదాయకం కాదనే భావన.. 
‘వ్యవసాయం లాభదాయకం కాదని రైతులు భావిస్తున్నారు. మార్కెటింగ్‌ సహా పటిష్టమైన సేకరణ వ్యవస్థ లేకపోవడం, మద్దతు ధరలు సరిగా లేకపోవడంతో వ్యవసాయంపై అనాసక్తి చూపిస్తున్నారు. 62 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరకు స్థానిక విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు.

50 ఏళ్ల వయస్సున్న రైతుల్లో 70 శాతం మంది వరి సాగును కొనసాగిస్తున్నందున పంటల సాగులో వైవిధ్యం ఉండటం లేదు. కూరగాయలు, పండ్ల సాగు ద్వారా రైతుల్లో ఆదాయ ఉత్పత్తి గత 30 సంవత్సరాలలో తక్కువగా ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది..’అని నాబార్డు తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement