‘అన్నదాత సుఖీభవ’ కోసం 19 నెలలుగా ఎదురు చూపులు
చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయమూ అందక విలవిల
రైతులకు పెట్టుబడి సాయం మొదటి ఏడాది రూ.20 వేలు పూర్తిగా ఎగవేత.. రెండో ఏడాది రూ. 10 వేలుతో సరిపుచ్చిన వైనం.. మొత్తంగా రూ. 30 వేలు ఎగవేత
కౌలు రైతుల విషయంలో ఆ రూ.10 వేలు కూడా ఇవ్వకుండా మొండిచేయి
పంట నష్ట పరిహారం, పంటల బీమా పరిహారం హుళక్కే.. మద్దతు ధర దక్కక తీవ్రంగా నష్టపోతున్న వైనం
సీసీఆర్సీ కార్డుల ఊసేలేదు..
బ్యాంకు రుణాలకు కూడా నోచుకోక ఉక్కిరిబిక్కిరి
వ్యాపారుల వద్ద అధిక వడ్డీతో అప్పులు చేయక తప్పని పరిస్థితి.. ఎరువులు, పురుగు మందులు దొరక్క సతమతం
ఏ రీతినా సాయం అందక బలవన్మరణాలకు పాల్పడుతున్న దుస్థితి
19 నెలల బాబు పాలనలో ఆత్మహత్య చేసుకున్న 300 మంది రైతుల్లో 90 శాతం కౌలు రైతులే
గత వైఎస్సార్‌సీపీ పాలన స్వర్ణ యుగమని గుర్తు చేసుకుంటున్న రైతులు
భూ యజమానుల హక్కులకు భంగం కలగని రీతిలో సీసీఆర్సీ చట్టం
ఏటా సీసీఆర్సీ మేళాలు నిర్వహించి లక్ష్యం మేరకు కార్డుల జారీ
భూ యజమానులను ఒప్పించి మరీ కౌలుదారులకు గుర్తింపు కార్డులు
వీటి ఆధారంగా పంట రుణాలు, రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్ట పరిహారం
పంట ఉత్పత్తులను కల్లాల నుంచే మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు
సాక్షి, అమరావతి: కౌలు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటినా ఏ ఒక్క కౌలు రైతునూ ఆదుకున్న పాపాన పోలేదు. కనీసం గుర్తింపు కార్డులు లేవు. పంటల బీమా లేదు. నష్టపరిహారం అసలే లేదు. ఉచిత బీమాకు మంగళం పాడారు. పంట రుణాల నుంచి పెట్టుబడి సాయం వరకు ఏదీ అందక సాగు వేళ వారు పడరాని పాట్లు పడుతున్నారు. చివరికి వారు పండించిన పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనే వారూ లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పంట కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలుదారులున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వారికి ఏ ఒక్క సంక్షేమ ఫలాలు అందడం లేదు. కనీసం గుర్తింపు కార్డులకు కూడా నోచుకోని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీలో సైతం కౌలు రైతులకు చోటు లేకుండా పోయింది. ఇటీవల ‘పీపుల్స్ పల్స్’ సంస్థతో కలిసి కౌలు రైతు సంఘాలు నిర్వహించిన ఓ సర్వే ఫలితాలు.. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత కౌలు రైతులు పడుతున్న కష్టాలకు అద్దం పట్టాయి. 87.7 శాతం మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులకు నోచుకోలేదని వెల్లడైంది. 92.7 శాతం మందికి పంట రుణాలు, 91.4 శాతం మందికి మద్దతు ధర లభించడం లేదని సర్వేలో తేలింది. కనీసం 14 శాతం మంది కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తమ పంట ఉత్పత్తులను అమ్ముకోలేక పోయారని స్పష్టమైంది. పైగా ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేయడం వల్ల నూరు శాతం కౌలు రైతులకు రక్షణ లేకుండా పోయిందని సర్వేలో వెల్లడైంది. ఈ రెండేళ్లలో ఎరువులు.. ప్రధానంగా యూరియా కొరత, పురుగు మందుల కొరత వేధించిందని తేటతెల్లమైంది. యూరియా కోసమైతే రైతులు ఊరూరా ఆందోళనకు దిగారని స్పష్టమైంది.
పెట్టుబడి సాయం రూపాయి కూడా లేదు
భూ యజమానుల ప్రమేయం లేకుండా గుర్తింపు కార్డులు జారీ చేసేలా తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త కౌలు చట్టాన్ని తెస్తామని నమ్మబలికి.. కౌలు రైతుల ఓట్లు దండుకున్న చంద్రబాబు.. గద్దెనెక్కిన తర్వాత కొత్త చట్టం కోసం కొద్దిరోజులు హంగామా చేశారు. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. ఉన్న సీసీఆర్సీ (క్రాప్ కల్టివేటెడ్ రైట్స్ కార్డ్) చట్టానికి తూట్లు పొడుస్తూ.. వారికి ఏ ఒక్క సంక్షేమ పథకం అందకుండా మోకాలొడ్డారు. భూ యజమానులతో పాటే ప్రతి కౌలు రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చారు. తొలి ఏడాదిలో దీన్ని పూర్తిగా అటకెక్కించిన ప్రభుత్వం.. రెండో ఏడాది రూ.10 వేలతో సరిపెడుతూ.. రూ.30 వేలు ఎగ్గొట్టింది. కౌలు రైతుల విషయానికి వస్తే ఆ రూ.10 వేలు కూడా ఇవ్వకుండా సాంకేతిక కారణాలంటూ మొండి చేయి చూపుతోంది. ఇప్పటి దాకా రెండేళ్లకు సంబంధించి ఏ ఒక్క కౌలు రైతుకు కూడా రూపాయి పెట్టుబడి సాయం అందించలేదు. 
పంట రుణాల కోసం ఎదురు చూపు
చంద్రబాబు ప్రభుత్వం 2024–25, 2025–26 సీజన్‌లలో కౌలు రైతులకు కనీసం సీసీఆర్సీ కార్డులు కూడా ఇవ్వడం లేదు. 2024–25లో 30 లక్షల మంది కౌలు రైతుల్లో కనీసం 2.58 లక్షల మందికి వ్యక్తిగతంగా రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా ఇచ్చింది కేవలం 41,205 మందికి మాత్రమే. 2025–26 సీజన్‌లో కనీసం 5 లక్షల మంది కౌలు రైతులకు రూ.8 వేల కోట్ల పంట రుణాలిస్తామని ఆర్భాటంగా ప్రకటించినా, ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. లక్ష్యం మేరకు కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేక పోయామని ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీసీఎల్‌సీ సమావేశంలో బ్యాంకర్లే అధికారికంగా ప్రకటించారు. దీంతో రుణాల కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. అధిక వడ్డీలు కట్టలేక, ప్రభుత్వ ఆసరా లేకపోవడంతో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత 19 నెలల్లో 300 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టగా, వారిలో 90 శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారంటే పరిస్థితి ఎంత దనీయంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
ఆ ఐదేళ్లూ అన్నదాతలకు అన్ని విధాలా భరోసా
భూ యజమానుల హక్కులకు భంగం కలగని రీతిలో కౌలుదారుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019లో సీసీఆర్సీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో గ్రామ స్థాయిలో సీసీఆర్సీ మేళాలు నిర్వహించి, నిర్ధేశించిన లక్ష్యం మేరకు కార్డులు జారీ చేసేవారు. పైగా భూ యజమానులను ఒప్పించి మరీ కౌలుదారులకు గుర్తింపు కార్డులిచ్చేవారు. ఇలా ఏటా అర్హులైన కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేశారు. వీటి ప్రామాణికంగా సకాలంలో పంట రుణాలు, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రాయితీ, ఉచిత పంటల బీమా, పంట నష్ట పరిహారం వంటి సంక్షేమ ఫలాలు నేరుగా అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేసేవారు. పైగా వారు పండించిన వంట ఉత్పత్తులను కల్లాల నుంచే కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేసి అండగా నిలిచారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయం అందలేదని.. గత వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుందని.. తమ పాలిట అది స్వర్ణయుగమని కౌలు రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
ఇలాగైతే వ్యవసాయం మానేయాల్సిందే..
ఇతని పేరు గుప్తాల సూర్యనారాయణ. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం స్వగ్రామం. ఇతనికి సొంతంగా సెంటు భూమి కూడా లేదు. ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఖరీఫ్‌లో బొండాలు (స్వర్ణ రకం వరి) వేశాడు. తుపాను దెబ్బకు ఎకరాకు 15 బస్తాలు కూడా దిగుబడి రాలేదు. తేమ శాతం అధికంగా ఉండడంతో మద్దతు ధర కూడా దక్కలేదు. కనీసం పెట్టుబడి మేర కూడా చేతికందలేదు. ఇప్పుడు సీసీఆర్సీ కార్డు ఇవ్వలేదు. దీంతో పంట రుణమూ ఇవ్వడం లేదు. పంట దెబ్బతిన్నా పైసా పరిహారం అంద లేదు. 
19 నెలలైనా పైసా పెట్టుబడి సాయం అందలేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. బ్యాంకులో రుణం ఇవ్వక పోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీతో అప్పు తెచ్చుకుని పంట సాగు చేశాడు. ఉచిత పంటల బీమా ఎత్తివేయడంతో బీమా పరిహారం అందకుండా పోయింది. తనలాగే ఎంతో మంది కౌలు రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, ఇలాగైతే వ్యవసాయం మానేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు.
పెట్టుబడి సాయం పైసా అందలేదు
మాకు వ్యవసాయమే జీవనాధారం. సొంత భూమి లేదు. రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఖరీఫ్‌లో 1061 రకం వరి సాగు చేశాను. తుపాను, అధిక వర్షాల వల్ల 75 సెంట్లల్లో పంట పూర్తిగా నేలవాలింది. మిగిలిన 1.25 ఎకరాల్లో పంట నిలబడినప్పటికీ ఎకరాకు 26 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. వ్యాపారులకు క్వింటా రూ.1,600 చొప్పున అమ్ముకోవాల్సి వచ్చింది. దెబ్బతిన్న పంటకు పైసా పరిహారం రాలేదు. 19 నెలల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. కౌలు కార్డులున్న వాళ్లకు సైతం బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. ఉచిత పంటల బీమా ఎత్తివేయడంతో ఆర్థిక భారం తట్టుకోలేక బీమా కూడా చేయించుకోలేక పోతున్నాం. ఈ ప్రభుత్వంలో కౌలు రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు.
– వెంట్రప్రగడ మరియదాసు, గొడవర్రు, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా
సర్కారు సాయం కాగితాలకే పరిమితం
నా సొంత భూమి 20 సెంట్లతో పాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. షావుకార్ల దగ్గర రూ.3 వడ్డీకి అప్పు చేసి, ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టి.. ఖరీఫ్‌లో 1061 రకం వరి సాగు చేశా. తుపాను దెబ్బకు పూత పూర్తిగా రాలిపోయి పంట పాలిపోయింది. అధికారులు వచ్చినప్పుడు పంట నష్టం వివరాలు నమోదు చేయాలని ఎంతగా బతిమిలాడినా వినిపించుకోలేదు. ఎకరాకు 30 బస్తాలకు పైగా దిగుబడి వస్తాదని ఆశిస్తే, కేవలం 18 బస్తాలే వచ్చింది. 16 బస్తాలు కౌలు కింద ఇచ్చేశా. కనీసం పెట్టుబడి కూడ మిగల్లేదు. ఈ 19 నెలల్లో పెట్టుబడి సాయం కాదు కదా.. పంట నష్ట పరిహారం కూడా పైసా అందలేదు. బ్యాంకులకు వెళ్తే రుణాలు ఇచ్చే వారు కూడా లేరు. వ్యవసాయం చాలా కష్టంగా ఉంది. సాయం చేస్తామన్న ప్రభుత్వం మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి.
– బద్దా రమేష్, పాండువ గ్రామం, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
పంట రుణాలివ్వడంలో విఫలం
ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలైనా కొత్త కౌలు చట్టం కార్యరూపం దాల్చలేదు. భూ యజమానులతో పాటు కౌలు రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ సాయం కూడా లేదు. కౌలుదారులకు పంట రుణాల మంజూరు కాగితాలకే పరిమితమైంది. 2025–26 సీజన్‌లో 8 వేల కోట్ల పంట రుణాలిస్తామని ప్రకటించారు. కానీ డిసెంబర్ నాటికి రూ.1,490 కోట్లు మాత్రమే ఇచ్చారు. కౌలు రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఇంతకంటే వేరే చెప్పనవసరం లేదు. ష్యూరిటీతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకు రూ.2 లక్షల వరకు పంట రుణాలివ్వాలి. ఉచిత పంటల బీమాను అటకెక్కించడంతో పూర్తిగా నష్టపోతున్నది కౌలు రైతులే.
– పీ.జమలయ్య, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలురైతు సంఘం


