కందుల కనీస మద్దతుధర రూ.8,000
మార్కెట్‌లో రైతుకు దక్కేది రూ.6,500–రూ.7,000
అన్నదాతలను ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం
దళారులకు అయినకాడికి తెగనమ్ముకుని తీవ్రంగా నష్టపోతున్న రైతులు
సాక్షి, అమరావతి: కందిరైతు కందిపోతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటుధర లేక కుదేలవుతున్నాడు. మద్దతుధరకు కొనేవారులేక రైతులు దళారులకు అడిగినకాడికి అమ్ముకుంటున్నారు. రిటైల్ మార్కెట్‌లో కందిపప్పు నాణ్యతను బట్టి కిలో రూ.130 నుంచి రూ.150కి పైనే పలుకుతోంది. కానీ పండించే రైతుకు మాత్రం కనీస మద్దతుధర దక్కడం లేదు. గత ఖరీఫ్ సీజన్‌లో 10 లక్షల ఎకరాల్లో కంది సాగవుతుందని, 3.54 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేశారు. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లోనే కంది సాగైంది.
2023–24 సీజన్‌లో మార్కెట్ ధర గరిష్టంగా క్వింటాకు రూ.9,400–రూ.9,800 పలికింది. 2024–25 సీజన్‌లో కేంద్రం కనీస మద్దతు ధర రూ.7,550 ప్రకటించగా మార్కెట్‌లో రూ.6,500 నుంచి రూ.7,200 వరకు కొనుగోళ్లు జరిగాయి. కేంద్రం ఈ ఏడాది క్వింటాకు రూ.8,000 మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది పూత, పిందె దశలో భారీవర్షాలతో దిగుబడులు పడిపోయాయి.
ఆరేడుసార్లు మందులు పిచికారీ చేయాల్సిరావడంతో ఎకరాకు రూ.2 వేలకుపైగా అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచి్చంది. ఎకరాకు 8–9 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 3–4 క్వింటాళ్లకు మించలేదు. తీరా పంట చేతికొచ్చేసరికి ధర నేలచూపులు చూస్తుండడంతో రైతులకు దిక్కుతోచటంలేదు. మద్దతుధర క్వింటాకు రూ.8 వేలు కాగా ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6,500 నుంచి రూ.7 వేల మధ్య కొంటున్నారు. వ్యాపారులు సిండికేటై ధర పెంచడంలేదు.
కర్ణాటకలో 9.67 లక్షల టన్నుల సేకరణకు అనుమతి
కంది రైతులకు మద్దతుధర దక్కకపోయినా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదు. పక్కనున్న కర్ణాటకలో 9.67 లక్షల టన్నుల కందిని కనీస మద్దతుధరకు సేకరించేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పాలనలోని ఏపీలో మాత్రం కేవలం 1.17 లక్షల టన్నుల సేకరణకే అనుమతి ఇచి్చంది. కందులతో పాటు మొక్కుబడిగా 28,440 టన్నుల మినుములు, 903 టన్నుల పెసల సేకరణకు ఓకే చెప్పింది. మార్క్‌ఫెడ్ జనవరి రెండోవారంలో కొనుగోళ్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పంట లేనిచోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మద్దతు ధర కల్పనలో ప్రభుత్వం విఫలమవడంతో రైతులు అయినకాడకి దళారులకు అమ్ముకుంటున్నారు. పొగాకు, మామిడి, ఉల్లి రైతులకు చెల్లింపుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూసిన అన్నదాతలు పంటలను ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకోవాలంటేనే భయపడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించుకుంటూ నష్టపోతున్నారు.
కంది రైతులను ఆదుకోవాలి..
నేను 20 ఎకరాల్లో కంది సాగుచేశా. కౌలుతో సహా ఎకరాకు రూ.45 వేలు పెట్టుబడి పెట్టాను. వర్షాలతో చీడపీడలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి ఒకసారి మందు కట్టలు వేయాలి. ఆరుసార్లు నీలిమందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. సాధారణంగా 8–9 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. 3 క్వింటాళ్లు మాత్రమే వచి్చంది. ప్రభుత్వం క్వింటా రూ.8 వేలు ప్రకటించగా, మార్కెట్‌లో రూ.6,500కు మించి కొనడం లేదు. – వెంపరాల నరసింహారావు, గనిఆత్కూరు, కంచికచర్ల, ఎన్టీఆర్ జిల్లా
మద్దతు ధర కల్పనలో విఫలం
ఈ ఏడాది ఒకటి రెండు తప్ప ప్రధాన పంటల్లో ఆశించిన దిగుబడి రాలేదు. మార్కెట్‌లో ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. మద్దతుధర కల్పనలో ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. మొక్కజొన్న, సజ్జల పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే కంది రైతులూ పంటను కూడా క్వింటా రూ.6,500 నుంచి రూ.7 వేలకు అమ్ముకుని నష్టపోతున్నారు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్


