
పీఏసీఎస్‌లలో అనధికారిక నియామకాలకు రూ.లక్షల్లో వసూళ్లు
కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, దినసరి ఉద్యోగాల భర్తీ
ఇప్పటికే సుమారు 7వేల మందికి పైగా నియామకం.. రెగ్యులరైజేషన్ పేరిట దండుకుంటున్న టీడీపీ నేతలు..
పెండింగ్ ఆర్థిక లావాదేవీల్లోనూ చేతివాటం
సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీఎస్)ను టీడీపీ నేతలు అక్రమార్జనకు కామధేనువులా మలుచుకున్నారు. హెచ్‌ఆర్ పాలసీకి తూట్లు పొడుస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపడుతూ పచ్చ నేతలు జేబులు నింపుకుంటున్నారు. అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీ(పీఐసీ)లను గుప్పెట్లో పెట్టుకుని అడ్డగోలుగా నియామకాలు చేపడుతున్నారు.
రెగ్యులరైజేషన్ పేరిట కూడా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఉద్యోగ నియామకాల పేరిట సొంత పార్టీ కార్యకర్తలతో పాటు నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. పోస్టును బట్టి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడక్కడా కొన్నిచోట్ల జనసేన నేతలతో జట్టుకట్టి టీడీపీ పెద్దలు భారీ దోపిడీకి తెరతీశారు.
సహకార చట్టానికి తూట్లు పొడుస్తూ..
సకాలంలో ఎన్నికలు నిర్వహించలేని ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీ సహకార సంఘాల చట్టం–1964 సెక్షన్ 32 (7)(బీ) కింద సహకార శాఖలో అనుభవం ఉన్న అధికారులతో అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను ప్రభుత్వం నియమిస్తుంది. వీరు ఏపీ రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ పర్యవేక్షణకు లోబడి పనిచేయాలి. నిబంధలనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వీరిపై ఏపీ సహకార సంఘాల చట్టం ప్రకారం సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. తీవ్రతను బట్టి సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయి.
అధికారంలోకి వచ్చీ రాగానే నాన్ అఫిషియల్ కమిటీలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీల (పీఐసీ) పేరిట సొసైటీల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన, తమకు అనుకూలమైన అధికారులకు పగ్గాలు అప్పగించింది. ఇప్పటికే రెండుసార్లు వీరి పదవీ కాలాన్ని ఆరు నెలల చొప్పున పొడిగించింది. వీరి ద్వారా తాము అనుకున్న పనులను గుట్టుచప్పుడు కాకుండా స్థానిక నేతలు చక్కబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పీఐసీలు సైతం జీహుజూర్ అంటున్నారు.
నాబార్డు నిబంధనల్ని సైతం తోసిరాజని..
డీసీసీబీలకు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 2,051 పీఏసీఎస్‌లు ఉన్నాయి. కంప్యూటరైజేషన్ ఆఫ్ పాక్స్ (పీఏసీఎస్) ప్రాజెక్టులో భాగంగా 2,037 పీఏసీఎస్‌లను కంప్యూటరీకరించేందుకు 2022–23లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.81.54 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2026–27లోగా పూర్తి చేయాలని సంకల్పించారు. కంప్యూటరీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ ప్రాజెక్టును ఆసరా చేసుకుని కూటమి ప్రభుత్వం అడ్డగోలు నియామకాలకు తెరతీసింది.
ఈ కారణంతోనే నాన్ అఫిషియల్ పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను నియమించకుండా అధికారులతోనే పని కానిచ్చేస్తున్నారు. వాస్తవానికి నాబార్డు 2019లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సొసైటీల్లో నియామకాలు చేపట్టాలంటే ముందుగా జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ జారీ చేయాలి. జిల్లా కలెక్టర్ సారథ్యంలో ఏర్పాటైన జిల్లాస్థాయి సాధికార కమిటీ (డీఎల్‌ఈసీ) ద్వారా రాత పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టాలి. కానీ నాబార్డు నిబంధనలు తమకు వర్తించవన్న ధోరణితో టీడీపీ పెద్దలు పీఐసీ అధికారులతో కుమ్మక్కై అడ్డగోలుగా నియామకాలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.

కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, దిసనరి ఉద్యోగుల పేరిట టీడీపీ నేతలు ఇప్పటివరకు సుమారు ఏడువేలకు పైగా నియామకాలు చేపట్టారు. కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.15 వేలు, ఆఫీస్ అసిస్టెంట్లకు రూ.18 వేలు, దినసరి ఉద్యోగులకు రూ.10 వేల చొప్పున జీతాలు చెల్లించేలా నిర్ణయించి.. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు రూ.2 లక్షల చొప్పున, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, దినసరి ఉద్యోగుల పేరిట రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.
ఈ ఉద్యోగుల సర్వీసు భవిష్యత్‌లో రెగ్యులరైజేషన్ అవుతుందని, అనంతరం భారీ వేతనాలు లభిస్తాయని వీరందరికీ వల వేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు అధికంగా జరిగే గుంటూరు, కృష్ణా, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల డీసీసీబీ పరిధిలో ఈ నియామకాలు ఎక్కువగా చేశారని చెబుతున్నారు.
రెగ్యులరైజేషన్ పేరిట కూడా..
పీఏసీఎస్ ఉద్యోగుల సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయాలన్నా హెచ్‌ఆర్ నిబంధనలకు అనుగుణంగా జిల్లాస్థాయి కమిటీ ఆమోదంతో చేపట్టాలి. కానీ.. పాత ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయిస్తామంటూ ఒక్కొక్కరి నుంచీ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఆయా పోస్టులను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ దండుకుంటున్నట్టు సమాచారం. ఇదేకాకుండా పెండింగ్ బకాయిలు ఉన్న రైతుల ఆర్థిక లావాదేవీలను వన్‌టైన్ సెటిల్‌మెంట్, వడ్డీ రిబేటు వంటివి కల్పిస్తామంటూ పర్సంటేజీలు దండుకుంటున్నారు.