పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం
మే 15లోగా రూ.5 వేలకోట్లు చెల్లిస్తామని చెప్పిన మంత్రులు భరత్, కొండపల్లి
రూ.1,500 కోట్లు విడుదల చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు ట్వీట్
కానీ వాస్తవంగా విడుదల చేస్తున్నది రూ.1,030.95 కోట్లు మాత్రమే
ఇందులో పెద్ద కంపెనీలకు రూ.694 కోట్లు.. ఎంఎస్‌ఎంఈలకు రూ.275 కోట్లు,
మొత్తం రూ.11 వేల కోట్ల పారిశ్రామిక రాయితీలు బకాయిపడ్డ సర్కారు
నూరుశాతం ప్రోత్సాహకాలు చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల డిమాండ్
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను మరోమారు దగా చేసింది. పెద్ద కంపెనీలపై అపారమైన ప్రేమను కనబరుస్తూ బడుగు, బలహీనవర్గాల యూనిట్లకు శఠగోపం పెట్టింది. పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో అయినవారికి కంచాల్లో పెట్టి.. బడుగు బలహీనవర్గాల వారికి చేతులు విదిల్చిన చందంగా నిధులు కేటాయించింది. రూ.1,500 కోట్ల పారిశ్రామిక రాయితీలు విడుదల చేస్తున్నామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం రూ.1,030.95 కోట్లకు మాత్రమే ఉత్తర్వులు జారీచేశారు.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు చెల్లించాల్సిన సుమారు రూ.1,200 కోట్ల పారిశ్రామిక రాయితీలకు కేవలం రూ.56 కోట్లు మాత్రమే విడుదల చేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు రగిలిపోతున్నారు. వాస్తవంగా పరిశ్రమలకు రూ.11 వేలకోట్లకు పైగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉండగా అందులో 10 శాతం మాత్రమే.. అది కూడా విశాఖ పెట్టుబడుల సదస్సు ముందు తూతూమంత్రంగా ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పాత బకాయిలతోపాటు ఏ ఏడాది బకాయిలు ఆఏడాదే చెల్లిస్తామని, ఇందుకోసం ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తున్నామంటూ చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్, ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడలో సంయుక్తంగా సమావేశం పెట్టి మే 15 కల్లా రూ.5 వేలకోట్ల రాయితీలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడేమో సీఎం రూ.1,500 కోట్లు అని చెప్పి.. అందులో మళ్లీ రూ.430 కోట్లు కోత పెడితే ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా నమ్మాలంటూ చిన్న, బడుగు పారిశ్రామికవేత్తలు నిలదీస్తున్నారు.
నూరుశాతం చెల్లించకపోతే రేపటి నుంచి నిరసన
పారిశ్రామిక పాలసీల కోసం మార్గదర్శకాలు అంటూ కొత్త నిబంధనలను తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక రాయితీల్లో కోత విధించడంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదల చేస్తున్న మొత్తం పారిశ్రామిక రాయితీ రూ.1,030.95 కోట్లలో లార్జ్ అండ్ మెగా పరిశ్రమలకు రూ.694.44 కోట్లు, ఎంఎస్‌ఎంఈలకు కేవలం రూ.275.47 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.56 కోట్లు కేటాయించారంటే చిన్న పరిశ్రమలు, ఎస్సీ, ఎస్టీల పరిశ్రమలపై ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోందని మండిపడుతున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు ఉన్న బకాయిల్లో ఇప్పుడు కేవలం 20 శాతం మాత్రమే చెల్లించడాన్ని వీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు పరిశ్రమలశాఖ డైరెక్టర్ శుభమ్ బన్సాల్‌ను కలిసి రాయితీలను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. శనివారంలోగా నూరుశాతం రాయితీలను విడుదల చేయకపోతే సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలను చేపడతామని ఎస్టీ పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


