అన్నదాతకు వాయు‘గండం’
పలు జిల్లాల్లో వరికి పొట్ట దశలో తీరని నష్టం
పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు..
దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా
సాక్షి, అమరావతి: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలు అన్నదాతల పొట్ట కొడుతున్నాయి. పొట్ట దశలో ఉన్న వరికి సంకటంగా మారాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో లక్షలాది ఎకరాలు నీటమునిగాయి. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, అపరాల పంటలకు అపార నష్టం వాటిల్లింది.
ప.గో., గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వరితోపాటు వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో వరి చేలు పడిపోయాయి. నంద్యాలలో మొక్కజొన్న రైతును దెబ్బతీసింది. భారీ వర్షాల ధాటికి ఇప్పటి వరకు దాదాపు లక్షన్నర ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వాస్తవానికి రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు.
రైతుల కష్టాలు
కుండపోత వర్షాలకు పొట్ట దశకు చేరుకున్న వరి పంట నేలకొరగడంతో రైతులు పడరాని పాట్లు పడుతన్నారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తేమ శాతం అధికంగా ఉండడంతో పాటు గింజలు రంగుమారే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే నూర్పిడి పనులు మొదలు పెట్టిన ప్రాంతాల్లో ధాన్యం రాశులు తడిసిపోతుండడంతో వాటిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు.
అన్ని పంటలకూ నష్టం
రబీ సీజన్‌లో మినుము, జొన్న, వేరుశనగ, మొక్కజొన్నతోపాటు ఆరుతడి పంటలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో భారీ వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. చాలా చోట్ల మళ్లీ విత్తుకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వరి, కూరగాయలు, చెరకు, ఆరుతడి పంటలకు అధిక నష్టం వాటిల్లగా, రాయలసీమ జిల్లాల్లో అపరాలు, మొక్కజొన్న పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పత్తి రైతును తేమ ముప్పు వణికిస్తోంది. పత్తి తీసి అమ్మకాలకు సిద్ధపడుతున్న తరుణంలో భారీ వాన రైతుల ఆశలను చిదిమేసింది.
వరిపైనే అధిక ప్రభావం
వరిపై అధిక వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. గింజల్లో మొలకలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీపీటీ 5204, పీఎల్ 1100 వంటి రకాలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆకు మచ్చ, పాముపొడ, కాటుక తెగుళ్లు వ్యాపించే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ వర్షాల వల్ల వరి దిగుబడులు 15–25 శాతం తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అపరాలకు 10–20 శాతం, కూరగాయలకు 20–30 శాతం,మిరపకు 15–30 శాతం, మొక్కజొన్నలో 10–18 శాతం, చెరకులో 8–15 శాతం మేర దిగుబడులపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
వరిలో...యాజమాన్య పద్ధతులిలా..
వరి పొలాల్లో ఉన్న నీటిని వెంటనే బయటకు పంపాలి. చిన్న కమతాలలో పంటను నిలబెట్టవచ్చు. పెద్ద కమతాలలో డ్రెయినేజీ మురుగు నీరు పోయే సదుపాయం చేయాలి.గింజ రంగు మారడాన్ని నివారించడానికి, పాము పొడ ,కాటుక తెగులు వ్యాప్తిని అరికట్టడానికి ఎకరానికి 200 ఎంఎల్ ప్రాపికోనజోల్ పిచికారి చేయాలి
» ధాన్యం గట్టిపడే నుంచి కోత దశలో ఉన్న పంట పొలాల్లోని నీటిని లోపలి కాలువల ద్వారా తొలగించాలి. కంకుల గింజలపై మొలకలు కనిపిస్తే (వాలిన లేదా నిలిచిన పంటలో) 5% ఉప్పు ద్రావణం (50 గ్రాముల గళ్ళ ఉప్పు / లీటరు నీరు) పిచికారీ చేయాలి.
» ఆలస్యంగా నాటిన పంట (పిలకలు తొడిగే దశ) వర్షపు నీరు పొలాల్లో సాధారణ రకాలలో 7 రోజుల్లో తగ్గితే ఎకరాకు యూరియా 20 కేజీలు + పొటాష్ 20 కేజీలు/ బూస్టర్ డోసుగా వేయాలి.
» నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో నర్సరీ దశలో ఉన్న పంట పొలాలకు నీరు తగ్గిపోయిన తర్వాత ప్రతి 5 సెంట్ల నారుమడికి యూరియా 1 కిలో + పొటాష్ 1 కిలో కలిపి బూస్టర్ డోసుగా వేయాలి. నారుమడులు కుళ్లిపోకుండా ఉండేందుకు కార్బెండాజిం 1 గ్రాము లేదా కార్బెండాజిం + మాంకోజెబ్ 2 గ్రాములు/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
పత్తి, వేరుశనగలో యాజమాన్య పద్ధతులిలా..
ఈ వర్షాలకు ఆకుమచ్చ తెగులు నివారణకు హెక్సా కొనజోల్ 2 మి.లీ లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రామ్ లీటరు నీటికి కలిపి15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయ్యాలి
» పత్తిలో పూత, గూడ రాలే అవకాశం ఉంది కాబట్టి నివారణకు బోరాక్స్‌ను లీటర్ నీటికి 1.5 గ్రాములు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
» 2 శాతం యూరియ లేదా నీటిలో కరిగే ఎరువులైన 19–19–19 లేదా 17–17–17 లేదా పొటాషియం నైట్రేట్‌ను పిచికారి చేయాలి.
» కాయ దశలో కాయ కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 30 గ్రాములు మరియు 2 గ్రాముల ప్లాంటో మైసిన్ 10లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
సజ్జ పంట: కోత దశలో గింజ మొలక రాకుండా కంకులపై గళ్ళ ఉప్పు 50 గ్రాములను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మెట్ట ప్రాంతాల్లో అయితే... అన్ని పంటలకు ఒకే రీతిలో పొలం నుంచి నీళ్లను పూర్తిగా దిగిపోయిన తర్వాత బూస్టర్ డోస్ గా 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్‌ను మొక్కల మొదట్లో వేయాలి. ఆకుమచ్చ, పొడ తదితర శిలీంద్ర తెగుళ్లకు హెక్సాకొనజోల్ 2 గ్రాములు లీటరు నీటికి లేదా కార్బన్ డిజిమ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.


