కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం
వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం
19 మంది సజీవ దహనం
బస్సు ఢీకొన్న బైకర్‌తో పాటు మొత్తం 20 మంది మృత్యువాత
తెల్లవారుజామున 2.45 గంటలకు బైక్‌ను ఢీకొట్టిన బస్సు
అక్కడికక్కడే మరణించిన బైకర్.. ఆపకుండా నిర్లక్ష్యంతో వేగంగా వెళ్లిన బస్సు డ్రైవర్
బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్.. 300 మీటర్ల మేర లాక్కెళ్లిన బస్సు
తీవ్ర రాపిడితో పగిలిన బైక్ పెట్రోల్ ట్యాంకు.. చెలరేగిన మంటలు
చుట్టుముట్టిన మంటలు, దట్టమైన పొగతో దిక్కుతెలియక ప్రయాణికుల ఆర్తనాదాలు
ప్రమాదంతో వైర్లు తెగి తెరుచుకోని బస్సు డోర్లు.. కిందకు దూకేసిన ఇద్దరు డ్రైవర్లు
అద్దాలు ధ్వంసం చేసి అతి కష్టంగా బయటపడ్డ మరో 25 మంది
పూర్తిగా కాలిపోయి బొగ్గులా మారిన మృతదేహాలు.. అక్కడే పోస్టుమార్టం
డీఎన్‌ఏ పరీక్షలు చేసి కుటుంబసభ్యులకు అప్పగించనున్న అధికారులు
మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులు.. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు
బస్సు డ్రైవర్ చేసిన తప్పు 19 మంది సజీవ దహనానికి కారణమైంది! నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది. కొన్ని కుటుంబాలను చిదిమేసి శాశ్వత చీకట్లు నింపింది. ఘటనా స్థలిని చూసిన వారి కంట నీరు తెప్పించింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది.
నిమిషాల వ్యవధిలో కొన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల పెద్ద దిక్కులు, భవిష్యత్ ఆశలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు,చావు కేకలతో ఎన్‌హెచ్‌ృ44 భీతిల్లింది. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా బొగ్గు, మసిగా మారాయి. ఈ భీతావహ ఘటన స్లీపర్ బస్సు ప్రయాణాలపై మరోమారు పెద్ద చర్చనే లేవనెత్తింది.
సాక్షి ప్రతినిధి కర్నూలు/ కర్నూలు (హాస్పిటల్): హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ (స్కానియా) బస్సు (డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... మొత్తం 44 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో హైదరాబాద్‌లో బయలుదేరిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2.14 గంటలకు కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా దాటింది.
2.30 గంటలకు టాయిలెట్ కోసం కర్నూలులో ఆపారు. కొంత మంది మాత్రమే బస్సు దిగారు. మిగిలిన వారంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ తర్వాత బయలుదేరిన బస్సు చిన్నటేకూరు దాటగానే 2.45 గంటలకు ఓ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ప్రమాదం తర్వాత కూడా ఆపకుండా డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. ఇదే పెను ప్రమాదానికి కారణమైంది. ఆ సమయంలో బస్సు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత ముందుకు వెళ్లిపోతే ప్రమాదం తమపైకి రాదని భావించిన డ్రైవర్ బస్సును వేగంగా నడిపారు.
శివశంకర్ రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో బస్సు బైక్‌ను 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఆ రాపిడికి మంటలు రేగాయి. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి మంటలు చెలరేగాయి. బస్సు ఎడమ వైపు డోర్ల భాగంలో మంటలు కనిపించాయి. అప్పుడు డ్రైవర్ బస్సును ఆపాడు. డ్రైవర్ లక్ష్మయ్యతో పాటు మరో డ్రైవర్ వాటర్ బాటిళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు ముందు భాగంతోపాటు బస్సు మధ్య భాగంలో కూడా మంటలు వ్యాపించాయి.

బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు డోర్‌లోని సెన్సార్ వైర్లు తెగిపోయాయి. దీంతో డోర్ పూర్తిగా లాక్ అయి తెరుచుకోలేదు. దీంతో డ్రైవర్లు భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులోంచి దూకేశారు. మంటల ధాటికి దట్టమైన పొగ బస్సు మొత్తం కమ్ముకుంది. ఒకరి ముఖం మరొకరికి కన్పించని పరిస్థితి. పొగ, మంటల ధాటికి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక ఆర్తనాదాలు పెట్టారు. క్షణాల్లో మంటలు డోర్ కర్టన్లు, బెడ్షీట్లు, బెడ్లకు అంటుకుని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
కొందరు మాత్రం బస్సు అద్దాలు పగులగొట్టి కిందకు దూకి గాయాలతో బయటపడ్డారు. తక్కిన వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక అగ్నికి ఆహుతయ్యారు. బస్సు మొత్తం నిమిషాల వ్యవధిలో పూర్తిగా దగ్ధమైంది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ప్రమాద ఘటనను వీడియో, ఫొటోలు తీసి పోలీసు అధికారులకు పంపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపు చేశారు.
డ్రైవర్లు సహా 27 మంది ప్రయాణికులు సురక్షితం
హైదరాబాద్‌లో బస్సు ఎక్కడానికి 40 మంది టికెట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఒకరు వ్యక్తిగత కారణాలతో ప్రయాణం రద్దు చేసుకోవడంతో బస్సు ఎక్కలేదు. మిగతా 39 మందితోపాటు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ లెక్కన 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆపై హైదరాబాద్ శివారు ప్రాంతం ఆరంఘర్‌లో టికెట్ ముందుగా బుక్ చేసుకోని ఒకరు బస్సు ఎక్కారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి బస్సులో 46 మంది ఉన్నారు.
వీరిలో ఒకరు మాత్రమే కర్ణాటకలోని బాగేపల్లిలో బస్సు దిగాల్సి ఉంది. మిగతా వారంతా బెంగళూరుకు వెళ్లాల్సిన వారే. వీరిలో ప్రమాదం తర్వాత 27 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో అద్దాలు ధ్వంసం చేసి దూకడంతో పాదాలు, కాళ్లకు గాయాలయ్యాయి. కొంత మందికి తలపై కూడా చిన్నచిన్న గాయాలయ్యాయి. వీరిలో 23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు కాగా.. మరో ఇద్దరు డ్రైవర్లు. తక్కిన 19 మంది చనిపోయారు.
మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు 108లో కర్నూలు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇంకొందరు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.
బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు
కర్నూలు సమీపంలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు యాజమాన్యంపై 125 (ఎ), 106 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉలిందకొండ పీఎస్ ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, మిరియాల లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని ప్రమాద ఘటనకు దారితీసిన కారణాలపై విచారిస్తున్నారు.
పనికి వెళ్లొస్తానని అటే వెళ్లిపోయాడు..
అమ్మా డోన్ వద్ద పని ఉందంట. మాట్లాడుకుని మళ్లీ వస్తానని రాత్రి పోయినోడు మళ్లీ రాకుండానే పోయినాడు...అంటూ ఆ తల్లి గంటల తరబడి మార్చురీ వద్ద విలపిస్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి.తాండ్రపాడుకు గ్రామానికి చెందిన నాగన్న కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆయన భార్య యశోదమ్మ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది.

ఇందులో పెద్దవాడైన శ్రీహరి గౌండా పనిచేస్తుండగా చిన్నవాడైన శివశంకర్ గ్రానైట్ పనులకు వెళ్లేవాడు. శివశంకర్ ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా డోన్ వద్ద పని ఉందని మాట్లాడుకుని వస్తానని వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తల్లికి ఫోన్ చేయలేదు. ఉదయం లేచే సరికి బైక్‌పై వెళుతూ బస్సు కింద పడి శివశంకర్ మృతిచెందాడని పోలీసులు చెప్పడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది.
అద్దాలు పగలగొట్టినా బయటకు రాలేని పరిస్థితి
స్లీపర్ కోచ్ బస్సులో లోయర్, అప్పర్ బెర్త్‌లు ఉన్నాయి. అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు అద్దాలు పగలగొట్టి సులభంగా బయటకు దూకారు. గాయాలతో బయటపడ్డారు. అప్పర్ బెర్త్ అద్దాలు ధ్వంసం చేస్తే బయటకు దూకేయొచ్చు. కానీ లోయర్ బెర్త్‌లో అద్దాలు ధ్వంసం చేసినా, ఐరన్ యాంగ్లర్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో మనిషి దూరలేని పరిస్థితి! అప్పర్ బెర్త్ లాగే, లోయర్ బెర్త్‌లు కూడా ఉండి ఉంటే అద్దాలు ధ్వంసం చేసి ఇంకొందరు కిందకు దూకి ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండేది.

గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు
తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర పోలీసులు బస్సును పరిశీలించారు. ఇనుప కడ్డీలు మినహా బస్సులో ఏమీ మిగల్లేదు. నల్లటి మసి దిబ్బలు మాత్రమే కన్పించాయి. తెల్లవారిన తర్వాత కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్లా, డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు వైద్యాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. వీరి సమక్షంలో బూడిదను తొలగించి.. నల్లగా బొగ్గులా మారిన మాంసపు ముద్దలను అతి కష్టం మీద వెలికి తీశారు.
మొత్తం 19 మృతదేహాలను ప్రత్యేక టెంట్‌లో ఉంచారు. వాటి నుంచి ఫోరెన్సిక్ అధికారులు డీఎన్‌ఏ పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. మృతదేహాలకు వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 14 మంది మృతుల కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ శాంపుల్స్ కూడా వైద్యులు సేకరించారు.

బస్సు ఆపి ఉంటే ప్రమాదం తప్పేది
బస్సు బైక్‌ను ఢీకొట్టిన వెంటనే నిలిపేసి ఉంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు. బైక్‌పై ప్రయాణించే శివశంకర్ మాత్రమే చనిపోయేవాడు. అయితే, ప్రమాదం తమపైకి రాకుండా ఉండేందుకు డ్రైవర్ లక్ష్మయ్య బస్సును అదే వేగంతోనే నడిపాడు. దీంతో బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం, 300 మీటర్ల మేర రోడ్డుకు రాపిడికి గురై పెట్రోలు ట్యాంకు పగలడం, మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించడంతో పెను ప్రమాదం సంభవించింది.
కాగా, బస్సు ప్రమాద ఘటన అధికారులతో పాటు అందరినీ తీవ్రంగా కలచి వేసింది. నేషనల్ హైవేపై అటు, ఇటు వెళ్లే వాహనదారులు బస్సును, అందులో బూడిదైన మృతదేహాలను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు మృతదేహాలను వెలికి తీసి మాంసం ముద్దలను పక్కనే టెంట్‌లోకి తీసుకెళుతున్న దృశ్యాలను చూసి ఘటనాస్థలిలోని వ్యక్తులు చలించిపోయారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఓ మహిళ మృతదేహంపై మంగళసూత్రం దండ కనిపించింది.
బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ వారి వివరాలు
1. అశ్విన్‌రెడ్డి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స
2. ఎం.సత్యనారాయణ, ఖమ్మం– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స
3. జి.సుబ్రహ్మణ్యం, కాకినాడ– కర్నూలు అశ్విని హాస్పిటల్‌లో చికిత్స
4. గుణసాయి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స
5. ఆండోజు నవీన్‌కుమార్, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స
6. నేలకుర్తి రమేష్, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస
7. శ్రీలక్ష్మి, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస
8. వేణు గుండ, ప్రకాశం జిల్లా– బెంగళూరు వెళ్లిపోయారు
9. శ్రీహర్ష, నెల్లూరు– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్
10. శివ, బళ్లారి–బెంగళూరు వెళ్లిపోయారు
11. గ్లోరియా ఎల్సాశామ్ కేరళ– బెంగళూరు వెళ్లిపోయారు
12. ఎంజి. రామరెడ్డి, తూర్పుగోదావరి– హైదరాబాద్ వెళ్లిపోయారు
13. జయసూర్య, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స
14. ఉమాపతి, హైదరాబాద్–బెంగళూరు వెళ్లిపోయారు
15. పంకజ్, బీదర్– పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు
16. చరిత్, హైదరాబాద్– బెంగళూరు వెళ్లారు
17. హారిక, బెంగళూరు– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స
18. కీర్తి, హైదరాబాద్– హైదరాబాద్ వెళ్లారు
19. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా– హిందుపురం వెళ్లారు
20. ఆకాష్, బీదర్– కర్నూలులో ఉన్నారు
21. మహమ్మద్ ఖైజర్, బెంగళూరు– బెంగళూరు వెళ్లారు
22. జయంత్ కుశ్వల, హైదరాబాద్– కర్నూలులో ఉన్నారు
23. కె.అశోక్, రంగారెడ్డి జిల్లా– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్
24. జశ్విత, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస
25. అఖీర, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస
26. మిర్యాల లక్ష్మయ్య (డ్రైవర్)– పల్నాడు జిల్లా
27. శివనారాయణ (డ్రైవర్)– ప్రకాశం జిల్లా
కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతోపాటు సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
కర్నూల్ కలెక్టరేట్ 08518277305
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి 9121101059, 9494609814, 9052951010
ఘటనాస్థలం 9121101061
పోలీసు కంట్రోల్ రూమ్ 9121101075
మృతుల వివరాలు
పేరు రాష్ట్రం
1. జి.ధాత్రి (27) పూనూరు, బాపట్ల, ఏపీ
2. జి.రమేష్ (31)
3. అనూష (28)
4.శశాంక్ (7)
5.మన్విత (4)
6. కె. శ్రీనివాసరెడ్డి (39) రావులపాలెం ,ఆంధ్రప్రదేశ్
7. చందన (23) తెలంగాణ
8.సంధ్యారాణి (43) తెలంగాణ
9. అనూష (22) తెలంగాణ
10. గిరిరావు (48) తెలంగాణ
11.ఆర్గా బండోపాధ్యాయ(32) తెలంగాణ
12. మేఘనాథ్ (25) తెలంగాణ
13. ఫిలోమన్ బేబీ(64) కర్ణాటక
14. కిషోర్‌కుమార్(41) కర్ణాటక
15. ప్రశాంత్(32) తమిళనాడు
16.యువన్ శంకర్‌రాజ్(22) తమిళనాడు
17. కె.దీపక్‌కుమార్ (24) ఒడిశా
18.అమృత్‌కుమార్ (18) బిహార్
19.గుర్తు తెలియని వ్యక్తి (50) (ఆరంఘర్ వద్ద బస్ ఎక్కాడు)
20 శివశంకర్ (23, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి) బి.తాండ్రపాడు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాల వారీగా మృతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ 7
తెలంగాణ 6
కర్ణాటక 2
తమిళనాడు 2
బిహార్ 1
ఒడిశా 1
గుర్తుతెలియని వ్యక్తి 1


