ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్‌ జగన్‌ | CM Chandrababu YS Jagan Others Expresses Condolences On Kurnool Bus Incident | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్‌ జగన్‌

Oct 24 2025 6:46 AM | Updated on Oct 24 2025 9:46 AM

CM Chandrababu YS Jagan Others Expresses Condolences On Kurnool Bus Incident

సాక్షి, తాడేపల్లి: కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (YS Jagan On Kurnool Bus Accident). ఘటన ఎంతో కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన.. వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, అలాగే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. 

‘‘కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి’’ అని ట్వీట్‌ చేశారు. 

మరోవైపు.. ఘటనను దుబాయ్‌ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విచారం వ్యక్తం చేశారని సమాచారం(CM Chandrababu On Kurnool Accident). ఆ వెంటనే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఇటు.. కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుములు రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (CM Revanth Reddy On Kurnool Bus Accident). మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్యాసింజర్స్‌ లిస్ట్‌లో అత్యధికం హైదరాబాద్‌కు చెందిన వారే ఉండడం గమనార్హం.

కేటీఆర్‌ దిగ్భ్రాంతి.. 
కర్నూలు బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని,ప్రభుత్వo బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాను అని అన్నారు. 

మంత్రి నారా లోకేష్‌.. 
ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఘటన ఎంతో బాధించిందని.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన. 

ఏపీ హెల్త్‌ మినిస్టర్‌ సత్యకుమార్‌ యాదవ్‌..
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల పరిస్థితిని కర్నూలు జీజీహెచ్‌ సూపరిండెంట్‌ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. దీంతో.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు సూచించారు. ‘‘బస్సులోనే ఇంకా భౌతిక కాయాలున్నాయి. పరిస్థితులకనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించాం. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని ఆయన అన్నారు.  

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. 
హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన పై కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది.మృతుల కుటుంబాలకు నా ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తున్న. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్న.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విచారం.. 
కర్నూలు జిల్లాలో బస్ ఘోర ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం పట్ల ఆయన ఆందోన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి..
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఒక ప్రకటనలో తెలిపారు. 

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.

ఇదీ చదవండి: బైక్‌ను ఢీ కొట్టడం వల్లే బస్సు కాలిపోయిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement