కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి.

కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నెంబర్ డీడీ01ఎన్9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్‌తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.

‘‘బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్‌ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్‌ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డ్రైవర్, స్పేర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.



