దేశవ్యాప్తంగా ఏఐసీటీఈ ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్
ప్రముఖ కంపెనీల్లో విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ
డిప్లొమా నుంచి పీజీ వరకు అన్ని బ్రాంచ్‌ల వారికి అవకాశం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షణ, అనుభవాన్ని అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్–2026ను ప్రకటించింది. దాదాపు లక్ష మంది విద్యార్థులకు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ఉచిత ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇంజినీరింగ్‌తోపాటు మేనేజ్‌మెంట్, ఆర్ట్స్, వాణిజ్యం, డిప్లొమా విద్యార్థులకు బోధన కాలంలోనే ఆచరణాత్మక వృత్తినైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఏఐసీటీఈ ప్రవేశపెట్టింది. తద్వారా అభ్యాసం, పరిశ్రమలకు మధ్య అంతరాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా విద్యార్థులను రెడీ టూ వర్క్‌కు సిద్ధం చేస్తోంది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో..
లక్ష మందికి పైగా ఉచితంగా అందించే ఇంటర్న్‌షిప్‌లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలోఏఐసీటీఈ అందిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ–ఎథికల్ హ్యాకింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, స్పేస్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్–డేవ్ ఆప్స్, ప్రభుత్వంలోని నీతి ఆయోగ్, భారత ప్రభుత్వ విధానాలు, ఎంఎస్‌ఎంఈ కార్యక్రమాలు, మహిళా సాధికారత, స్మార్ట్ విలేజ్, ఏఐసీటీఈ గ్రామీణ ఆవిష్కరణ మిషన్ల కార్యక్రమాలు వంటి ప్రభుత్వ, నూతన సాంకేతిక అంశాల్లో వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ కల్పిస్తుంది.
తద్వారా విద్యార్థికి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు బాటలు వేస్తోంది. ఈ ఇంటర్న్‌షిప్‌లో డిప్లొమా, యూజీ, పీజీలలో ఏ విభాగానికి చెందిన విద్యార్థులైనా ఉచితంగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ (జీn్ట్ఛటnటజిజీp.్చజీఛ్ట్ఛిజీnఛీజ్చీ.ౌటజ) చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఐబీఎం, సిస్కో, మైక్రోసాఫ్ట్, నాస్కాం, ఇస్రో, డీఆర్‌డీవో, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య సంస్థలో భారీ ఇంటర్న్‌షిప్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది.
ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి 4 నుంచి 12 వారాలు కాగా, కొన్ని సంస్థలు రూ.5వేల నుంచి రూ.15వేల వరకు స్టయిఫండ్ ఇస్తాయి. ఇంటర్న్‌షిప్ ముగిసిన తర్వాత ఏఐసీటీఈ పోర్టల్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్ అందిస్తారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపికల్లో తొలి ప్రాధాన్యం దక్కుతుంది.


