
పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం
ఇందుకోసం రూ.2వేల కోట్ల రుణం...
దానిలోనూ రూ.500 కోట్లు దారిమళ్లింపు?
ప్రభుత్వంపై భగ్గుమంటున్న పారిశ్రామికవేత్తలు
ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే.. అని ఆగ్రహం
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. ‘ఏ ఏడాది పారిశ్రామిక ప్రోత్సాహకాలు అదే ఏడాది ఇచ్చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ తెరిచి మరీ బకాయిలు లేకుండా చెల్లిస్తాం..’ అంటూ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. పారిశ్రామికవేత్తలకు రూ.10,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను బకాయిపడిన చంద్రబాబు ప్రభుత్వం... కేవలం రూ.1,500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘దీపావళి వేళ మరో తీపి కబురు అందిస్తున్నాం. పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తొలి విడతగా రూ.1,500 కోట్లు విడుదల చేస్తున్నాం’ అని సీఎం తెలిపారు.
అప్పు చేసిన మొత్తం కూడా చెల్లించరా..?
పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదల కోసం చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.2,000 కోట్లు రుణం తీసుకుంది. దీనిలో కేవలం రూ1,500 కోట్లు మాత్రమే పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా రూ. 500 కోట్లు దారి మళ్లించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బకాయి ఉన్న మొత్తంలో తొలి విడతగా 30శాతం మాత్రమే చెల్లించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు.
వైఎస్సార్ బడుగు వికాసం కింద గత ప్రభుత్వ హయాంలో యూనిట్లు ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే రూ.3,000కోట్లకుపైగా ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిసింది. తనకు ప్రోత్సాహకాల కింద రూ.20లక్షలు రావాల్సి ఉండగా, ఇప్పుడు రూ.5లక్షల నుంచి రూ.6లక్షలు మాత్రమే విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారని ఓ పారిశ్రామికవేత్త ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రోత్సాహకాల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఆ మొత్తాన్ని కూడా దారిమళ్లిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
విశాఖ సదస్సు కోసమేనా?
ప్రోత్సాహకాల విడుదలలో తీవ్ర జాప్యంపై పారిశ్రామికవేత్తలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల సదస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో కంటితుడుపు చర్యగా రూ.1,500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చిన్న పరిశ్రమలకు బకాయి ఉన్న ప్రోత్సాహకాలనే విడుదల చేయలేని ప్రభుత్వం... భారీ పరిశ్రమలకు ప్రకటిస్తున్న వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఎలా చెల్లిస్తుందని... ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ అంటే.. అని ప్రశి్నస్తున్నారు.