
విజయవాడలో లులుకు కట్టబెట్టిన ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలం
అలాంటి కంపెనీకి ఏపీలో రాయితీలిచ్చి రెడ్ కార్పెట్
మలేషియా నుంచి జూన్‌లోనే బిచాణ ఎత్తేసింది
ఇండోనేషియాలోనూ పెట్టే బేడా సర్దుకుంటున్న వైనం
2013లో కొ చ్చి న్‌లో తొలి షాపింగ్ మాల్.. ఇంకా లాభాల బాట పట్టని వ్యాపారం
2023లో రూ.206 కోట్లు, 2024లో రూ.130 కోట్ల నష్టాలు
ఇలాంటి సంస్థ చేతికి రూ.వేల కోట్ల విలువైన స్థలాలు కట్టబెట్టిన చంద్రబాబు సర్కారు
భూములు తీసుకున్నాక వ్యాపార కార్యకలాపాలు ఎత్తివేస్తే పరిస్థితి ఏంటి?
ప్రభుత్వ తీరును ఎండగడుతున్న మేధావులు
డీమార్ట్, రిలయన్స్, ఇన్‌ఆర్బిట్ మాల్‌లు ప్రైవేట్ స్థలాల్లోనే వ్యాపారం
ఒక్క లులుకు మాత్రమే ప్రభుత్వ భూములు ఎందుకు ఇస్తున్నారని నిలదీత
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఆప్త మిత్రుడు యూసఫ్ ఆలీకి చెందిన లులు గ్రూపు (Lulu Group) రిటైల్ వ్యాపారంలో అనేక దేశాల్లో ఇప్పటికే బిచాణ ఎత్తేసింది. మలేషియా, ఇండోనేషియాల్లో రిటైల్ వ్యాపారం నుంచి వైదొలిగిన లులు.. మిగిలిన దేశాల్లో కూడా వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉండటంతో సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటూ పెట్టే బేడా సర్దుకుంటోంది. అలాంటి కంపెనీకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక రాయితీలిచ్చి రెడ్ కార్పెట్ పరుస్తోంది. విశాఖలో, విజయవాడలో రూ.వేల కోట్ల విలువైన స్థలాలను అప్పనంగా కట్టబెడుతూ ఉత్తర్వులిచ్చేయడం విస్తుగొలుపుతోంది.
రిటైల్ వ్యాపార పరంగా ఎక్కడా చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకోలేని లులు గ్రూపు.. మలేషియాలో రిటైల్ వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు జూన్‌లో ప్రకటించింది. మలేషియా రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించి పదేళ్లు దాటినా, లాభాల బాట పట్టకపోగా, నష్టాలు కొండలా పెరిగి పోతుండటంతో పెట్టే బేడా సర్దేసుకొని గుడ్ బై చెప్పేసింది. 2016లో మలేషియా రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఐదేళ్లలో 10 హైపర్ మార్కెట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2022 వచ్చేసరికి కేవలం ఆరు స్టోర్లను మాత్రమే ప్రారంభించగలిగింది.
2025 నాటికి ఈ షాపుల ద్వారా నష్టం రూ.2,061 కోట్లు దాటి పోవడంతో ఇప్పట్లో రిటైల్ వ్యాపారంపుంజుకునే అవకాశం లేదంటూ వైదొలిగింది. మలేషియాలో క్యాప్‌స్క్వేర్, జకేల్ కేఎల్, అమెరికన్ మాల్, వన్ షామెలిన్ మాల్ వంటి చోట్ల లులు తన హైపర్ మార్కెట్లు ప్రారంభించినా, స్థానిక హైపర్ మార్కెట్ల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేక చేతులెత్తేసింది.
అంతకు ముందు ఇండోనేషియా నుంచి కూడా ఇదే విధంగా లులు గ్రూపు వైదొలిగింది. ఇండోనేషియా మార్కెట్లోకి 2016లో అడుగుపెట్టింది. ఇండోనేషియాలోని బానెటెన్ క్యూబిగ్ బీఎస్‌డీ సిటీలో ఉన్న హైపర్ మార్కెట్‌ను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మూసివేసింది. మిగిలిన హైపర్ మార్కెట్లను మూసి వేయడానికి క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్లు స్థానిక పత్రికా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
నష్టాల్లోనే కొచ్చిన్ మాల్
2013 మార్చిలో దేశంలోనే అతిపెద్ద మాల్ కొ చ్చి న్‌లో ఏర్పాటు చేసిన లులు గ్రూపు.. ఇప్పటి వరకు లాభాల బాట పట్టలేకపోయింది. కొ చ్చి న్ మాల్ ఏర్పాటు చేసి 12 ఏళ్లు దాటినా, ఏటా భారీ నష్టాలను మూటకట్టుకుంటున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన నివేదికలో పేర్కొంది. 2023 డిసెంబర్‌లో కొ చ్చి న్ మాల్ రూ.205.8 కోట్లు, 2024లో రూ.130.2 కోట్ల నష్టాలను మూటకట్టుకుంది.
2024లో కొ చ్చి న్ మాల్ వ్యాపారం రూ.4,384.8 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు ఈ మాల్‌పై రూ.1,600 కోట్లు వ్యయం చేసింది. అదే విధంగా 2021లో ప్రారంభించిన బెంగళూరు, 2023లో హైదరాబాద్‌లో ప్రారంభించిన లూలు మార్కెట్లు కూడా లాభాల బాట పట్టడానికి సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. ప్రసుత్తం ఇండియాలో లులు 12 మాల్స్‌ను నిర్వహిస్తోంది.
ఏపీలో పరిస్థితి ఏంటి?
హైపర్ రిటైల్ వ్యాపారం చేసే లులు, డీమార్ట్, రిలయన్స్, ఇన్ ఆర్బిట్ మాల్స్ వంటి సంస్థలు దేశ వ్యాప్తంగా సొంతంగా లేదా ప్రైవేటు స్థలాలను లీజుకు తీసుకొని తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇందుకు విరుద్ధంగా రాష్ట్రంలో ఒక్క లులుకే రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన ప్రభుత్వ స్థలాలను అత్యంత కారుచౌకగా కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మలేషియా, ఇండోనేషియాల్లో లాగా వ్యాపారం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత బిచాణా ఎత్తివేస్తే ఈ ప్రభుత్వ స్థలాల పరిస్థితి ఏంటని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ఒకసారి దీర్ఘకాలిక లీజుకు ఇ చ్చి న తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది న్యాయపరంగా చాలా సంక్లిష్టమంటున్నారు. కార్పొరేట్ సంస్థలు ఒకసారి భూమి తీసుకున్న తర్వాత వెనక్కి తిరిగిచ్చిన దాఖలాలు లేవని.. ఇప్పుడు తొలుత లీజు పేరిట తీసుకొని, కొన్ని సంవత్సరాల తర్వాత పూర్తిగా యాజమాన్య హక్కులను దక్కించుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మాల్‌కు ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తారని, ఈ కంపెనీకి నష్టం వస్తే అదే గ్రూపునకు చెందిన ఇతర కంపెనీల నుంచి నయా పైసా కూడా రాదంటున్నారు. రిలయన్స్, డీమార్ట్‌లకు భూములు ఇవ్వనప్పుడు, ఒక్క లులుకే ఎందుకు ఇస్తున్నారని, దీని వెనుక ఉన్న కుంభకోణం ఏమిటని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.