
ఈ ఏడాది అన్ని పరీక్షలకు ఒకే అసెస్‌మెంట్ పుస్తకం
రూ.75 కోట్లు ఖర్చు చేసి 1.50 కోట్ల పుస్తకాల ముద్రణ
అవగాహన కల్పించకుండా విద్యార్థులకు పంపిణీ
ముగిసిన ఎఫ్‌ఏ–1 జవాబులు ఎఫ్‌ఏ–2లో రాసిన వైనం
ఉపాధ్యాయులకూ తప్పని తిప్పలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు 2025–26 విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెచ్చిన కొత్త విధానం అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది. కనీస అవగాహన కల్పించకుండా తెచ్చిన అసెస్‌మెంట్ పుస్తకాలు అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు పరీక్ష పెడుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఫార్మెటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ 1) జవాబులను విద్యార్థులు ఫార్మెటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ 2)లో రాశారు.
దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్‌ఏ–2 పరీక్షల జవాబులు ఎక్కడ రాయించాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 32 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసి 1.50 కోట్ల అసెస్‌మెంట్ పుస్తకాలను ముద్రించారు. ఈ పుస్తకాల్లో పరీక్షలు రాయడంలో విద్యార్థులు తికమక పడుతున్నా విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు.
టీచర్లకు తలకు మించిన భారం..
పాత విధానంలో సమాధానానికి తగినట్లుగా ఉపాధ్యాయులే మార్కులు వేసేవారు. కానీ కొత్త విధానంలో మార్కులను ఉపాధ్యాయులు బబ్లింగ్ చేయాలి. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులు అనుకుంటే విద్యార్థి రాసిన జవాబుకు 0 – 8 మార్కులు కేటాయిస్తారు. ఆ మార్కులను నంబర్ రూపంలో కాకుండా ఓఎంఆర్ షీట్‌పై టీచర్ బబుల్ చేయాలి. అసెస్‌మెంట్ బుక్‌లో ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడి నివేదిక రాత రూపంలో కచ్చితంగా చూపించాలి.
దీంతోపాటు విద్యార్థులు రాసిన జవాబు పత్రాల ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసి లీప్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ప్రాథమిక తరగతుల్లో నాలుగు చొప్పున, ఉన్నత తరగతుల్లో ఆరు పరీక్షలకు సంబంధించిన పత్రాలను స్కాన్ చేయాలి. ఇది ఉపాధ్యాయులకు తలకు మించిన భారమని వాపోతున్నారు. ఎఫ్‌ఏ–1 పరీక్షల జవాబులు మూల్యాంకనం చేసేందుకు ఉపాధ్యాయులు నానా కష్టాలు పడ్డారు. ఈ క్రమంలో పరీక్షలంటేనే హడలిపోతున్నారు.
రూ.75 కోట్లు వృథా ఖర్చు!
విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాల ముద్రణలో రూ.30 కోట్లు ఆదా చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం.. అసెస్‌మెంట్ పుస్తకాలకు రూ.75 కోట్లు వ్యయం చేసినట్లు తెలుస్తోంది. తమకు కావాల్సిన ప్రింటర్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి భారీగా లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి.
ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించి విఫల విధానాన్ని బలవంతంగా అమలు చేస్తోందని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఇప్పటికే ఉపాధ్యాయులు ‘యాప్ డౌన్’ విధానాన్ని ప్రకటించారు. హాజరు, మధ్యాహ్న భోజనం యాప్‌లు మినహా మిగతా ఆన్‌లైన్ సర్వీసులు నిర్వహించబోమని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల మూల్యాంకనం సైతం యాప్‌లో నమోదు చేసే పరిస్థితి కనిపించడం లేదు.
ఆరు పరీక్షలకు ఒక్కటే పుస్తకం..
గతంలో సంప్రదాయ పరీక్షా విధానంలో ప్రశ్నా పత్రం ఇచ్చి పేపర్‌పై జవాబులు రాయించేవారు. జవాబు పత్రాలను ఉపాధ్యాయులు సులభంగా మూల్యాంకనం చేసేందుకు వీలుండేది. కూటమి ప్రభుత్వం పరీక్షల కోసం ఈ ఏడాది కొత్తగా అసెస్‌మెంట్ పుస్తకం విధానాన్ని తెచ్చింది. విద్యార్థులు మొత్తం ఆరు పరీక్షలను ఇదే పుస్తకంలో రాయాలి. అయితే చాలా మంది విద్యార్థులకు దీనిపై అవగాహన లేక ముగిసిన ఎఫ్‌ఏ–1 పరీక్షల జవాబులను ఎఫ్‌ఏ–2, ఎస్‌ఏ–1 (అర్ధవార్షిక పరీక్ష)లో రాశారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఎఫ్‌ఏ–2 జవాబులు ఎక్కడ రాయాలో తెలియని పరిస్థితి నెలకొంది.