
బెల్టు షాపుల దగ్గరకు నిరసన ర్యాలీగా వెళ్తున్న గ్రామ ప్రజలు
ప్రకాశం జిల్లా మంచికలపాడులో బెల్ట్ షాపులపై మహిళల దాడి
బెల్ట్ షాపులు తొలగించాలని గ్రామ సభలో డిమాండ్
కలెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోలేదని ఆగ్రహం
రోడ్డుపై మద్యం బాటిళ్లు పగులగొట్టి నిరసన
చీమకుర్తి రూరల్: కూటమి ప్రభుత్వంలో మద్యం బెల్ట్ షాపుల వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మంచికలపాడు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం సీసాలు పగులగొట్టారు. మూడు వేల జనాభా ఉన్న తమ గ్రామంలో ఏకంగా 8 బెల్ట్ షాపులు పెట్టారని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినా స్పందన లేకపోవడంతో శుక్రవారం వారే ఏకంగా రంగంలోకి దిగారు.
గ్రామస్తుల కథనం మేరకు.. మంచికలపాడు గ్రామంలో అధికార టీడీపీకి చెందిన వారు 8 బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. దీంతో తమ కుటుంబాలు గుల్లవుతున్నాయని మహిళలు కొద్ది నెలలుగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా గ్రామంలోంచి బెల్టుషాపులు తీసేయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శుక్రవారం పార్టీలకు అతీతంగా గ్రామ సభ నిర్వహించారు.
పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గ్రామంలో ఎక్కడా మద్యం విక్రయించకూడదని గ్రామ నాయకులు, పంచాయతీ అధికారుల సమక్షంలో తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే ఎక్సైజ్ అధికారులకు పట్టిస్తామని హెచ్చరించారు. మాజీ సర్పంచ్ పొన్నపల్లి సుబ్బారావు మాట్లాడుతూ తమ గ్రామంలో 8 మద్యం బెల్టుషాపులు పెట్టారని, వాటిని తొలగించాలని కోరుతూ స్పందనలో కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినా అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు.
స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్‌కు కూడా ఈ సమస్యపై అర్జీ ఇచ్చామని చెప్పారు. గ్రామసభ అనంతరం.. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు బెల్టుషాపుల వద్దకు వెళ్లి అక్కడ మద్యం సీసాలను పగులగొట్టి, మద్యాన్ని పారబోశారు. మద్యం దుకాణం చుట్టూ ఉన్న గ్రీన్ మ్యాట్లను ధ్వంసం చేశారు. నిరసనలోమహిళలతో పాటు సర్పంచ్ పెరికల నాగేశ్వరరావు, ఎంపీటీసీ అత్యాల అంకయ్య, మాజీ సర్పంచులు చలువాది శేషమ్మ, శ్రీను, అచ్చాల ఏసోబుతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.