
వలంటీర్లను పెట్టడమూ వృథానే
ఉద్యోగుల వ్యయాన్ని గత ప్రభుత్వం బాగా పెంచేసింది..
ఆప్కాస్, ఆర్టీసీతో కలిపి 65 వేల మందిని ప్రభుత్వంలో కలిపింది
దేశంలో ఎక్కడా లేని సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది..
డీబీటీ అనో.. ఇంకోటి అనో.. క్యాపిటల్ వ్యయం పెంచేశారు.
4 డీఏల్లో దీపావళి కానుకగా ఒకటి ఇస్తున్నాం: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను గత ప్రభుత్వం ప్రవేశపెట్టడం వల్ల ఉద్యోగుల వ్యయం పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. చివరి లైన్‌లో పంచాయతీరాజ్, లైన్ డిపార్ట్‌మెంట్లుగా స్కూళ్లు, వ్యవసాయం, వెటర్నరీ ఉద్యోగులుంటారని, కానీ సచివాలయ వ్యవస్థలో 1.26 లక్షల మంది వచ్చారని తెలిపారు. ఇంతమందికి ఉద్యోగాలు అనవసరమని అన్నారు. వీరుకాకుండా వాలంటీర్లను పెట్టారని, ఆప్కాస్, ఆర్టీసీతో కలిపి 65 వేలమంది ఇంకా కలిశారని పేర్కొన్నారు. వీటన్నింటితో రూ.10 వేల కోట్ల వ్యయం పెరిగిందని చెప్పారు.
ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం ఉద్యోగుల అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం తర్వాత ఈ విషయాన్ని చంద్రబాబు మీడియాకు వెల్లడించారు. ‘‘అన్ని రాష్ట్రాలు నిర్వహణ ఖర్చులు తగ్గించుకుని క్యాపిటల్ వ్యయంపై ఎక్కువగా దృష్టి పెడుతుంటే ఏపీలో మాత్రం రివర్స్ చేశారు. తెలంగాణ 53 శాతం ఉన్న క్యాపిటల్ వ్యయాన్ని 38 శాతానికి తగ్గించుకుంది. ఏపీలో మాత్రం డీబీటీ అనో, ఇంకోటనో క్యాపిటల్ వ్యయం పెంచేశారు. రాష్ట్ర ఓన్ రిసోర్సెస్‌లో 99.53 శాతం నిర్వహణకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా 34,184 కోట్ల బకాయిలున్నాయి. రాష్ట్ర ఆరి్థక పరిస్థితి ఎలా ఉందో ఉద్యోగులకు తెలియాలి. ఈ పరిస్థితుల్లో వారికి పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల్లో (కరువు భత్యం) ఒకదాన్ని (3.64 శాతం) దీపావళి కానుకగా ఇస్తున్నాం’’ అని చెప్పారు. నవంబరు 1 నుంచి ఇది అమలయ్యేలా చూస్తామన్నారు.
ఒక డీఏ చెల్లింపునకు రూ.160 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. పీఆర్సీ విషయం తనకు వదిలేయాలని, కొంత వెసులుబాటు చూసుకుని దాన్ని ఎలా చేయాలో చేస్తామన్నారు. సీపీఎస్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని దానిపై చర్చిస్తామని తెలిపారు. పోలీసులకు ఒక సరెండర్ లీవులను రెండు విడతల్లో క్లియర్ చేస్తామని చంద్రబాబు అన్నారు. ఇందుకు సంబంధించి రూ.210 కోట్లలో నవంబరులో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105 కోట్లు చెల్లిస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల వ్యయానికి సంబంధించిన అంశాలను 60 రోజుల్లో సరిచేస్తామని వివరించారు.
180 రోజుల చైల్డ్ కేర్ లీవులను రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు ఇస్తామన్నారు. ఉద్యోగ సంఘాలకు చెందిన భవనాలకు ఆస్తి పన్ను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగో తరగతి ఉద్యోగులకు ఉన్న పేర్లను గౌరవంగా మారుస్తామన్నారు. తొలుత మంత్రుల సబ్ కమిటీ సభ్యులైన పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సీఎస్ విజయానంద్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత సీఎం వారిని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడిన తర్వాత డీఏ ఇస్తున్నట్లు తెలిపారు.