
కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడిన నేతలు, అధికారులు
ఎట్టకేలకు విజయవాడ నుంచి 980 మంది దరఖాస్తు
హజ్–2026కు మొత్తం 2,620 మంది రాష్ట్ర యాత్రికుల దరఖాస్తు
దేశవ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు ఉన్న పదివేల మందికి 20 రోజుల యాత్రకు హజ్ కమిటీ అనుమతి
41 రోజులకు బదులు 20 రోజుల యాత్రకు అనుమతివ్వడం ఇదే తొలిసారి
20 రోజుల యాత్రకు రాష్ట్రం నుంచి 290 మంది దరఖాస్తు
ముగిసిన హజ్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు
సాక్షి, అమరావతి: హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ విషయమై అభాసుపాలైన కూటమి పాలకులు చివరకు పరువు దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో సాధించిన ఎంబార్కేషన్ పాయింట్‌ను నిలబెట్టుకోవడంలో గతేడాది కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా చివరివరకు విజయవాడ ఎంబార్కేషన్‌కు అనుమతి రాలేదు. ఆఖరి నిమిషంలో అనుమతి రావడంతో తామే కొత్తగా సాధించినట్టు కూటమి పాలకులు బడాయి పోయారు. అయితే ఆఖరి నిమిషం వరకు అనుమతి లేకపోవడంతో రాష్ట్రం నుంచి హజ్‌కు వెళ్లాలనుకునే చాలామంది యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు నుంచి దరఖాస్తులు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ దరఖాస్తులను జూలై 31 నుంచి కేంద్ర హజ్ కమిటీ మరో వారం రోజులు పొడిగించడంతో అప్పటికే అభాసుపాలైన కూటమి పాలకులు మేల్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి దరఖాస్తు చేసుకునేలా హజ్ యాత్రికులను కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడ్డారు.
ప్లీజ్.. విజయవాడ ఆప్షన్ పెట్టుకోండి..
రాష్ట్రప్రభుత్వ పెద్దలు, ముఖ్యనేతల ఆదేశాల మేరకు హజ్‌కమిటీ ప్రతినిధులు సీఎం చంద్రబాబు, మంత్రి ఫరూక్‌ను కలిసి యాత్రను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు హైప్ తీసుకొచ్చారు. అయితే యాత్రికులకు ప్రభుత్వం రూ.లక్ష ఇస్తామన్నా.. విజయవాడ నుంచి వెళ్లే వారిపై విమాన చార్జీల భారం పడుతుండడంతో యాత్రికులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికితోడు గతంలో వెళ్లిన హాజీలకు ఇస్తామన్న రూ.లక్ష ఇవ్వకపోవడంతో ఈసారి కూడా ఇస్తారో? లేదో? అనే అనుమానాలు పెరగడం కూడా కారణం.
ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల ముందు హజ్ ప్రతినిధులు ఉంచడంతో పాలకులు ఆగమేఘాలపై స్పందించారు. హజ్–2025లో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకుని ఇక్కడ ఎంబార్కేషన్ రద్దుతో హైదరాబాద్ నుంచి వెళ్లిన 72 మందికి కొద్ది రోజుల క్రితమే రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని మంజూరు చేశారు.
కొత్తగా వెళ్లేవారికి కూడా ఇస్తామని, ప్లీజ్ ఈసారి విజయవాడ ఆప్షన్ పెట్టుకోవాలని ప్రాధేయపడ్డారు. అప్పటికే హైదరాబాద్,, బెంగళూరు నుంచి దరఖాస్తు పెట్టుకున్న 1700 మందికిపైగా యాత్రికులు విజయవాడ ఆప్షన్ మార్చుకునేలా వెసులుబాటు కల్పించారు. చివరకు ప్రభుత్వ యంత్రాంగం పడిన పాట్లతో 980 మంది విజయవాడ ఆప్షన్ పెట్టుకున్నట్టు సమాచారం.
ముగిసిన గడువు..
హజ్–2026 యాత్ర కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 7తో ముగిసినట్టు హజ్ కమిటీ అధికారులు ధ్రువీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2,,500 మందికి కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇచ్చింది. కాగా, రాష్ట్రం నుంచి 2,620 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో కొంత మంది విరమించుకునే అవకాశం ఉందని, దీంతో కేంద్ర హజ్ కమిటీ ఇచ్చిన అనుమతికి అనుగుణంగానే యాత్రికులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 980 మంది విజయవాడ ఎంబార్కేషన్ ఆప్షన్ పెట్టుకున్నారు. మిగిలిన 1,640 మంది హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లనున్నారు.
తొలిసారిగా 20 రోజుల యాత్ర..
హజ్ యాత్ర ప్రారంభమైన నాటి నుంచి దాదాపు 40 నుంచి 41రోజులపాటు యాత్ర సాగేలా అనుమతిస్తున్నారు. దేశంలో తొలిసారిగా హజ్–2026కు 20 రోజుల యాత్ర కోసం ప్రత్యేకంగా 10వేల మందికి కేంద్ర హజ్ కమిటీ అనుమతి ఇచ్చింది. ఎన్‌ఆర్‌ఐలు, ఉద్యోగులతోపాటు ప్రత్యేక పరిస్థితులు ఉన్న వారికి 40 రోజులపాటు యాత్రకు సెలవులు, ఇతర ఇబ్బందులు ఉండటంతో కేంద్ర హజ్ కమిటీ ప్రత్యేక అవకాశం కల్పించింది. దీంతో 20 రోజుల యాత్రకు ఏపీ నుంచి 290 మంది దరఖాస్తు చేసుకున్నారు.