
రాష్ట్రంలోని ఐదు కొత్త ప్రభుత్వ కళాశాలలకు 60 పీజీ సీట్లు
2023–24లో ఐదు కళాశాలలు ప్రారంభించిన జగన్ ప్రభుత్వం
ఆ కళాశాలలకు పీజీ సీట్లు మంజూరు చేసిన ఎన్‌ఎంసీ
వందకు పైగా సీట్లు రావడానికి అవకాశం
బాబు ప్రభుత్వ చిత్తశుద్ధి లేమితో 60 సీట్లే సమకూరిన వైనం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తప్ప బలోపేతంపై దృష్టి పెట్టని బాబు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగంలో వైద్య విద్య వ్యవస్థ బలోపేతానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేసిన అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యుల అందుబాటును పెంచడం కోసం వీలైనంత ఎక్కువ మంది వైద్యులను తయారు చేయడానికి వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను 750 ఎంబీబీఎస్ సీట్లతో 2023–24లో ప్రారంభించారు.
ఇప్పుడు ఈ కళాశాలల్లో మెడికల్ పీజీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఐదు కళాశాలల్లో మెడిసిన్, సర్జరీ, గైనిక్, పీడియాట్రిక్, అనస్థీషియా విభాగాల్లో 60 పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) మంజూరు చేసింది. ప్రస్తుత 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఈ సీట్లలో అడ్మిషన్లు జరుగనున్నాయి. దీంతో పీజీ చదివే డాక్టర్ల ద్వారా ఆ ఆస్పత్రుల్లో రోగుల సంరక్షణ మరింత మెరుగు పడనుంది.
వందకు పైగా సీట్లకు అవకాశం
వైద్య కళాశాలల కోసం ఐదు చోట్ల జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా గత ప్రభుత్వంలో అభివృద్ధి చేశారు. ఈ ఆస్పత్రుల్లో పీజీ సీట్లు మంజూరుకు వీలుగా ఐపీ, ఓపీ, సర్జరీలు, ఇతర వనరులు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో వందకుపైగా సీట్లు ఐదు కళాశాలల్లో సమకూరాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేటుకు కట్టబెట్టడంపై పెట్టిన శ్రద్ధ.. వైద్య విద్య బలోపేతంపై పెట్టలేదు.
కళాశాలల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన ఫ్యాకల్టీ పోస్టులను సకాలంలో భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేని కారణంగానే ఎన్‌ఎంసీ 60 సీట్లే మంజూరు చేసినట్టు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే మరో 40కి పైగా సీట్లు సమకూరేవని డీఎంఈ వర్గాలు అంటున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో పీజీ సీట్ల పంట
2019కి ముందు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కేవలం 970 పీజీ సీట్లు మాత్రమే ఉండేవి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు.. ఇలా అన్ని పోస్టులు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా చర్యలు తీసుకున్నారు.
రోగుల తాకిడికి అనుగుణంగా పలు కళాశాలల్లో కొత్తగా పోస్టులు సృష్టించారు. ఈ చర్యల ఫలితంగా కళాశాలలకు పెద్ద ఎత్తున పీజీ సీట్లను ఎన్‌ఎంసి మంజూరు చేసింది. ఈ క్రమంలో ఐదేళ్లలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల
సంఖ్య రెట్టింపు అయింది. 800 మేర పీజీ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాయి. జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త వైద్య కళాశాలల ద్వారా ఇప్పుడు మరిన్ని పీజీ సీట్లు మన మెడికోలకు అందుబాటులోకి రావడం గమనార్హం.
కొత్త వైద్య కళాశాలలకు మంజూరైన పీజీ సీట్లు
» ఏలూరు కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4
» మచిలీపట్నం కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ పీడియాట్రిక్స్ 4
» నంద్యాల కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎంఎస్ ఓబీజీ 4, ఎండీ అనస్థీషియా 4
» రాజమండ్రి కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ పీడియాట్రిక్స్ 4, ఎంఎస్ ఓబీజీ 4
» విజయనగరం కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్ 4, ఎంఎస్ జనరల్ సర్జరీ 4, ఎండీ ఓబీజీ 4