
రాష్ట్రంలో 25 శాతం మామిడికే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం వర్తింపు
చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మామిడిలో కేవలం 25 శాతానికే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం(ఎంఐఎస్) కింద ఆర్థిక మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులోని వివరాలు.. ‘2025–26 మార్కెటింగ్ సీజన్‌కు ఎంఐఎస్ కింద తోతాపురి మామిడి ధర లోటు చెల్లింపునకు గరిష్ట పరిమితిని 1,62,500 టన్నులు(మొత్తం ఉత్పత్తిలో 25 శాతం)గా నిర్ధారించాం.
క్వింటాకు కనీస మద్దతు ధరను రూ.1,490.73గా నిర్ణయించాం. తోతాపురి మామిడి రోజు వారీ అమ్మకం ధరను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ/హార్టీకల్చర్/ సహకార విభాగాల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుంది. కనీస మద్దతు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసం గరిష్టంగా 25 శాతం ఎంఐపీ(క్వింటాకు రూ.372.68) ఉంటుంది.
ఈ భారాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 50-50 నిష్పత్తిలో పంచుకోవాలి. లోటు ధర చెల్లింపు ప్రయోజనాలు పొందేందుకు రైతులు తమ ఉత్పత్తి చెల్లుబాటయ్యే డాక్యుమెంట్లతో ఏపీఎంసీలు, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు, ర్యాంప్‌లలో విక్రయించాలి. వీటిని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మార్కెటింగ్ చట్టం–1966 ప్రకారం ప్రకటిస్తారు’ అని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది.
కర్ణాటకలోనే మేలు..
రాష్ట్రంలో 6.50 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కాగా.. ఇందులో 1.62 లక్షల టన్నుల కొనుగోలుకే ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో కూడా కనీస మద్దతు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెరి సగం భరించాలని స్పష్టంగా పేర్కొంది. అంటే క్వింటాకు రూ.372.68ల్లో కేంద్రం రూ.186.34 మాత్రమే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర రైతులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారనడానికి ఇదే నిదర్శనం.
తమ రాష్ట్ర మామిడి రైతులను ఆదుకోవాలని కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి లేఖ రాయగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి.. ఎలాంటి ఆంక్షలు లేకుండా క్వింటా మామిడికి రూ.1,616 ధర నిర్ణయించారు. అలాగే కర్ణాటకలో 2.50 లక్షల టన్నుల మామిడిని కొనుగోలుకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్న కేంద్రం.. ఏపీలో కేవలం 1.62 లక్షల టన్నులకే అనుమతి ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా సీజన్ ముగింపు దశలో ఈ నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు.
నెల రోజుల్లోపు అమ్ముకున్న రైతులకే వర్తింపు..
‘రైతులు తమ మామిడి ఉత్పత్తులను ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యాపారులకే విక్రయించాలి. విక్రయం జరిగిన ప్రామాణికతను నోటిఫైడ్ మార్కెట్, మండీ లేదా ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద నమోదు చేయాలి. వ్యాపారి పేరు కేంద్రం, రాష్ట్రం నోటిఫై చేసిన జాబితాలో ఉండాలి. వీటిని సంబంధిత జిల్లా కలెక్టర్ ధ్రువీకరించాలి. ఉద్యాన శాఖ అధికారుల వద్ద రైతులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలి’ అని నిబంధనలు విధించారు. అంటే రైతు మార్కెట్‌లో విక్రయించడమే కాదు.. సరైన వ్యాపారి ద్వారా, సరైన కేంద్రంలో అమ్మాలి. లేదంటే పథకం వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది.
పైగా ఈ నెల 21 నుంచి నెల రోజుల్లోపు అమ్ముకున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని మెలిక పెట్టింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మంది రైతులు పంటను అయినకాడికి తెగనమ్ముకొని తీవ్ర నష్టాల పాలయ్యారు. ఇక వందలాది మంది రైతులు గిటు్టబాటు ధర లేక వేలాది టన్నుల కాయలను రోడ్లపై పారబోశారు. మరికొందరు చెట్లకే కాయల్ని వదిలేయగా.. ఇంకొందరైతే చంద్రబాబు ప్రభుత్వ తీరుతో విసిగి వేసారి ఏకంగా తోటలనే నరికేశారు.