అభిప్రాయం
చంద్రబాబు దైవభక్తి ఒక నాటకం
జనక్షేమం ఒక బూటకం
అధికారం అన్నదే కీలకం
సంపాదనే ఆయనకు మూలకం
చంద్రబాబు ఒక స్వార్థ కీటకం
హైందవ ద్రోహ రూపకం
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కానేకాదు. తిరుమల లడ్డూ ప్రసాదంలో చంద్రబాబు ఆరోపించినట్టు జంతువుల కొవ్వు కలవనే లేదని సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ నిర్ధా రించిన తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనసుల్లో కలిగిన అభిప్రాయం. హిందువులు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. స్వామి వారి ప్రసా దాన్ని భక్తిశ్రద్ధలతో కళ్లకద్దుకుని స్వీకరిస్తారు.
అలాంటి ప్రసాదాన్ని చంద్రబాబు ఆరోపణల తర్వాత, స్వీకరించాలంటే ఏదో అనుమానం. మనమెంత గానో ఇష్టపడే, పూజించే స్వామి వారి ప్రసాదమేనా? లేక పంది, ఆవు, చేపల కొవ్వుతో తయారు చేసిందా? అని హిందువుల మనసులు ఆవేదనతో గింజుకున్నాయంటే అనుమానం లేదు. అందుకే చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని 2024 సెప్టెంబర్ 18న తీవ్ర వివాదాస్పద ఆరోపణలు చేసిన తర్వాత,హిందువులంతా మనసులో పరమ శివుడు గరళాన్ని దిగ మింగినట్టు క్షోభను అనుభవిస్తూ వచ్చారు.
బయటపడిన నీచత్వం
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియామకమైన సీబీఐ నేతృత్వంలోని ‘సిట్’ ఎట్టకేలకు నివేదికను న్యాయస్థానంలో సమర్పించింది. అందులోని అంశాలు కోట్లాది మంది హృదయభారాన్ని దించే సమాచారం. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కొవ్వు పదార్థాలూ లేవని ‘సిట్’ నిర్ధారించింది. ఈ నివేదిక తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను పెంచేలా ఉంది. ఇదే సందర్భంలో చంద్రబాబు నీచత్వాన్ని బయట పెట్టిందని చెప్పక తప్పదు. రాజకీయ ప్రత్యర్థుల్ని నేరుగా ఎదుర్కో లేక, ముఖ్యంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అస్త్రంగా వాడుకోవడం దిగ్భ్రమ కలిగించింది.
అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని చెప్పడానికి ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక ఉదంతాలున్నాయి. అయితే శ్రీవేంకటేశ్వరస్వామికి కూడా ద్రోహం తలపెట్టేంత దుర్మార్గం ఆయనలో ఉందని కలలో కూడా ఊహించ లేదు. కనీసం ‘సిట్’ నివేదిక వెలువడిన తర్వాతైనా ఆయనలో కాసింతైనా పశ్చాత్తాపం కలుగుతుందని సమాజం భావించింది. అలాంటిది లేకపోగా, తమ ప్రసార మాధ్యమాలు, అధికార బలంతో ఎలా పైచేయి సాధించాలని దేవుడితో రాజకీయ క్రీడ ఆడటానికే చంద్ర బాబు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.
చంద్రబాబు చేలో మేస్తే, తాను గట్టున ఎలా మేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించుకుంటున్నారు. తనను తాను ‘సనాతని’గా ప్రచారం చేసుకుంటున్న పవన్ కల్యాణ్, దేవునికి అన్యాయం జరిగితే, బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న నాయకుడిగా రక్షణ కవచంగా ఉండాల్సింది. కానీ లడ్డూ ప్రసా దంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు కలిసిందనే చంద్రబాబు ఆరోపణలు నిజమన్నట్టు దుష్ప్రచారం చేసిన ఘనతను పవన్ దక్కించుకున్నారు. చంద్రబాబు అండ్ కోకు జగన్‌పై దుష్ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. అయితే దాన్ని జనం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిట్టచివరి అస్త్రంగా లడ్డూ ప్రసాదమనే అస్త్రాన్ని ప్రయోగించారు. దేవుని భుజాల పైనుంచి జగన్‌ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది.
స్వామివారి పుణ్యమా అని...
లడ్డూ ప్రసాదంలో కల్తీపై నిక్కచ్చిగా విచారణ జరిపించాలని వైసీపీ నాయకుడు, టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఒకవేళ సుప్రీంకోర్టు తన పర్యవేక్షణలో సీబీఐ నేతృత్వంలో విచారణ చేయాలని ఆదేశించకపోయివుంటే, స్వామి వారి ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర నెరవేరేదేమో! కానీ కలి యుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చంద్రబాబు, ఆయన తాబేదా రులైన పాలకుల కుట్రల్ని గుర్తించి, సీబీఐతో విచారణ చేపట్టేలా చేయించారు. అందుకే సీబీఐ విచారణ జరిపి, చంద్రబాబు, ఆయన అనుచరులు ఆరోపణలు చేస్తున్నట్టు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.
ఇదే చంద్రబాబు నియమించిన ‘సిట్’ విచారణ జరిపి ఉంటే, తన రాజకీయ స్వార్థానికి, ఆరోపణలే నిజమని నమ్మించేందుకు నివేదిక ఇప్పించేవారు. అలాగే వైవీ సుబ్బారెడ్డిని, నన్ను, ధర్మారెడ్డిని జైలుకు కూడా పంపి ఉండేవారు. సీబీఐ విచారణతో బాబు ఆటలు సాగలేదు. బాబు కోరుకున్నట్టుగా రాజకీయ లబ్ధి చేకూరకపోగా, యావత్ హిందూ సమాజం ఆయనను అసహ్యించుకుంటోంది.
శిశుపాలుడే సిగ్గుపడేలా, కంసుడే చెవులు మూసుకునేలా, సమస్త రాక్షసులూ నోళ్లు వెళ్లబెట్టేలా... చంద్రబాబు తన మాటలతో, చేష్టలతో, వంతపాడే ప్రసార మాధ్యమాలతో లడ్డూలో వాడే నెయ్యిపై నిందారోపణలు చేయడాన్ని సమాజం గుర్తించింది. ఒక రాజకీయ నాయకుడికి, అతని దుశ్చర్యల్ని జనం పసిగట్టడం కంటే మరో శిక్ష అవసరం లేదు. పురాణ కాలంలో దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు అందులో మద్యమాంసాలు కలిపేవారని కథలు కథలుగా విన్నాం. రాక్షసుల కంటే నీచస్థాయికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిగజారారనేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంలో వారు చేసిన నానాయాగీని చూడాల్సి ఉంటుంది.
దమ్ముంటే మొదటి నుంచీ వద్దాం!
టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించిన ‘సిట్’... రాజకీయపరమైన అవినీతి లేదని స్పష్టంగా పేర్కొంది. అధి కారులు, సాంకేతిక నిపుణులు, డెయిరీ సంస్థల అధిపతులు కుమ్మక్కై పామాయిల్‌ను నెయ్యిగా భ్రమింపచేశారనేది ‘సిట్’ నివేదిక సారాంశం. ‘సిట్‘ నివేదిక వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడి నాలుక మడత పడింది. కల్తీ జరిగింది కదా అని కొత్త పల్లవి ఎత్తుకుంటున్నారు.
నిజంగా చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, భక్తి ఉంటే 2009 నుంచి 2019 వరకు టీటీడీలో నెయ్యి సరఫరాపై విచారణ చేయించాలి. ఇవాళ సీబీఐ నివేదికలో భోలేబాబా మార్గంగా వైష్ణవి, ఏఆర్ డెయిరీలకు నెయ్యి సరఫరా అయినట్టు ఉంది. అలాగే ప్రీమియం డెయిరీకి కూడా! ఈ ప్రీమియర్, ఆల్ఫా డెయిరీలే 2013 సంవ త్సరం నుంచి 90 శాతానికి పైగా నెయ్యిని సరఫరా చేశాయి. ఇందుకు సంబంధించి మా దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయి. ప్రీమియర్ డెయిరీ కూడా ఇవాళ భోలేబాబా దగ్గరి నుంచే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ తన నివేదికలో స్పష్టం చేసింది.
టెండర్ నిబంధనల్ని మా హయాంలో సరళతరం చేయడం వల్ల కల్తీ జరిగినట్టు చంద్రబాబు ఆరోపిస్తున్నారు. నిబంధనల్ని సరళ తరం చేయాలని అనుకోవడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఆలోచనే కారణం. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. అందుకే కొత్త కంపెనీలకు కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించాలని 2021లో టీటీడీ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం. అయితే పాల ఉత్పత్తులు తగిన మోతాదులో లేకపోతే వెన్న కొనుగోలు చేయొచ్చనే నిబంధన నేటికీ ఉంది. ఆ తర్వాత నిబంధనను కఠినతరం చేసింది నా హయాంలోనే! ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులపై సీబీఐ నేరారోపణ చేయలేదు. ఆ నేరంలో భాగస్వాములుగా టీటీడీ చైర్మన్లగా పని చేసిన మమ్మల్ని ఎక్కడా సీబీఐ చెప్పలేదు.
నెయ్యి ప్రామాణికతల్ని మెరుగుపరచడానికి రూ.5.50 కోట్లతో మిషనరీల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది మా హయాంలోనే! ఆ మొత్తాన్ని అందించడానికి దాత వచ్చింది కూడా మా హయాంలోనే. ఆ తర్వాత మా ప్రభుత్వం దిగిపోయింది. మీ హయాంలో చేసిందేమీ లేదు. పైగా మాపై నిందారోపణలు. ఇవాళ నిందితులుగా ‘సిట్’ పేర్కొన్న జీఎం సుబ్రమణ్యం 2016 నుంచి 18 వరకు ప్రొక్యూర్మెంట్ జీఎంగా కొనసాగారు. అది కూడా చంద్రబాబు టైమ్ లోనే! మరో నిందితుడు జగదీష్ కూడా 2018–21 వరకు అంటే చంద్రబాబు గారి సమయంలోనే ప్రొక్యూర్మెంట్ జీఎంగా నియమి తులయ్యారు. అలాగే విజయభాస్కర్ రెడ్డి, సురేంద్ర అనే సాంకేతిక నిపుణులు 2013 నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నారు. ఇవాళ వారిని నిందితులిగా సీబీఐ తేల్చింది. దీనికి మా నాయకు డైన వైఎస్ జగన్‌కు ఏంటి సంబంధం బాబు?
సరైన పాప పరిహారం
యజ్ఞం చేస్తున్న వ్యక్తి జగన్. అందులో రక్తం పోసే వ్యక్తులు చంద్రబాబు, పవవ్ కల్యాణ్. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో చేప కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందని పవనానంద స్వామి (పవన్ కల్యాణ్) ఆరోపించారు. అయోధ్యకు పంపిన లడ్డూ ప్రసాదాలకు నెయ్యి సరఫరా చేసిన టీటీడీ సభ్యుడు సౌరబ్ బోరా... నేటికీ బోర్డు సభ్యుడే! కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు ధరించి, బహిరంగ సభలో పవన్ నిస్సిగ్గుగా మాట్లాడారు. శ్రీవారి ఆలయం అపవిత్రం అయ్యిందని విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయం మెట్లు కడిగారు. ఇప్పుడు పవన్ నోటి ద్వారా వాస్తవం ఏంటో బయటికి రావాలి.
కల్తీ జరిగిందనే కారణంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపామని ఈవో శ్యామలారావు చెప్పారు. అవే ట్యాంకర్లు తిరిగి తిరుమలకు ఇదే చంద్రబాబు హయాంలో వెళ్లాయనీ, ప్రసాదంలో వినియోగించారనీ ‘సిట్’ తన నివేదికలో స్పష్టం చేసింది. జంతువుల కొవ్వు కలిపారని, పట్టుకున్నామని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వాడారని కోర్టుకు సీబీఐ సమర్పించిన నివేదికలో పేర్కొంది. కల్తీ ఎవరి హయాంలో జరిగిందో ఇప్పుడు చెప్పు బాబు?
అలాగే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, శ్రీవారి ఆలయ అర్చకులతో చంద్రబాబు సంప్రోక్షణ చేయించారు. తిరుమలలో నాలుగు అర్చక కుటుంబాలున్నాయి. స్వాములూ... మీరు మేల్కో వాలి. చంద్రబాబు నీచ కార్యక్రమాలకు తలొగ్గకండి. ఇప్పటికైనా హిందువులంతా వాస్తవాలు తెలుసుకుని, చంద్రబాబు శ్రీవారి ఆలయం కేంద్రంగా ఆడే రాజకీయ వికృత క్రీడను తిప్పి కొట్టాలి. పదవి పొందడానికి పాతాళం కన్నా కిందికి దిగజారి మాట్లాడే పాశవిక ప్రవృత్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కే చెల్లు. పాప పరిహా రానికి అమరావతి నుంచి తిరుమల ఆలయం వరకూ రోడ్లన్నీ పవన్ కడగాలి. చంద్రబాబు గుండు కొట్టించుకొని, కోట్లాదిమంది భక్తు లకు క్షమాపణ చెప్పాలి.
ఓ విష్ణు పరమాత్మా! రాజకీయ స్వార్థానికి మిమ్మల్ని వాడు కున్న పాలకుల మధ్య బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నాం. అధికారమనే పొర కళ్లకు కప్పి, అంధత్వంతో పాలిస్తున్న వారికి బుద్ధి చెప్పడానికే ‘సిట్’ నివేదిక రూపంలో మా ముందుకొచ్చావు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదనే సత్యాన్ని చెప్పి, కోట్లాది మంది హిందువుల మనసుల్ని తేలికపరిచావు. ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏదసత్యం తెలుసు కోలేని దురవస్థలో కూటమి పాలకులున్నారు. ఏడుకొండలవాడా వెంకటరమణా... మీరు తలచుకోబట్టే లడ్డూ ప్రసాదంపై ఏడాదిగా ప్రచారమవుతున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. 
భూమన కరుణాకరరెడ్డి
వ్యాసకర్త టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్


