breaking news
MIS
-
మామిడి రైతుల నోట్లో మట్టి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మామిడిలో కేవలం 25 శాతానికే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం(ఎంఐఎస్) కింద ఆర్థిక మద్దతు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అందులోని వివరాలు.. ‘2025–26 మార్కెటింగ్ సీజన్‌కు ఎంఐఎస్ కింద తోతాపురి మామిడి ధర లోటు చెల్లింపునకు గరిష్ట పరిమితిని 1,62,500 టన్నులు(మొత్తం ఉత్పత్తిలో 25 శాతం)గా నిర్ధారించాం. క్వింటాకు కనీస మద్దతు ధరను రూ.1,490.73గా నిర్ణయించాం. తోతాపురి మామిడి రోజు వారీ అమ్మకం ధరను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ/హార్టీకల్చర్/ సహకార విభాగాల ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుంది. కనీస మద్దతు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసం గరిష్టంగా 25 శాతం ఎంఐపీ(క్వింటాకు రూ.372.68) ఉంటుంది. ఈ భారాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 50-50 నిష్పత్తిలో పంచుకోవాలి. లోటు ధర చెల్లింపు ప్రయోజనాలు పొందేందుకు రైతులు తమ ఉత్పత్తి చెల్లుబాటయ్యే డాక్యుమెంట్లతో ఏపీఎంసీలు, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు, ర్యాంప్‌లలో విక్రయించాలి. వీటిని జిల్లా కలెక్టర్లు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు, పశువుల మార్కెటింగ్ చట్టం–1966 ప్రకారం ప్రకటిస్తారు’ అని లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. కర్ణాటకలోనే మేలు..రాష్ట్రంలో 6.50 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కాగా.. ఇందులో 1.62 లక్షల టన్నుల కొనుగోలుకే ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందులో కూడా కనీస మద్దతు ధర, అమ్మకపు ధర మధ్య వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం చెరి సగం భరించాలని స్పష్టంగా పేర్కొంది. అంటే క్వింటాకు రూ.372.68ల్లో కేంద్రం రూ.186.34 మాత్రమే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర రైతులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారనడానికి ఇదే నిదర్శనం. తమ రాష్ట్ర మామిడి రైతులను ఆదుకోవాలని కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి లేఖ రాయగా.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే స్పందించి.. ఎలాంటి ఆంక్షలు లేకుండా క్వింటా మామిడికి రూ.1,616 ధర నిర్ణయించారు. అలాగే కర్ణాటకలో 2.50 లక్షల టన్నుల మామిడిని కొనుగోలుకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్న కేంద్రం.. ఏపీలో కేవలం 1.62 లక్షల టన్నులకే అనుమతి ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా సీజన్ ముగింపు దశలో ఈ నిర్ణయం తీసుకోవడంపై మండిపడుతున్నారు. నెల రోజుల్లోపు అమ్ముకున్న రైతులకే వర్తింపు..‘రైతులు తమ మామిడి ఉత్పత్తులను ప్రభుత్వ గుర్తింపు పొందిన వ్యాపారులకే విక్రయించాలి. విక్రయం జరిగిన ప్రామాణికతను నోటిఫైడ్ మార్కెట్, మండీ లేదా ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద నమోదు చేయాలి. వ్యాపారి పేరు కేంద్రం, రాష్ట్రం నోటిఫై చేసిన జాబితాలో ఉండాలి. వీటిని సంబంధిత జిల్లా కలెక్టర్ ధ్రువీకరించాలి. ఉద్యాన శాఖ అధికారుల వద్ద రైతులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలి’ అని నిబంధనలు విధించారు. అంటే రైతు మార్కెట్లో విక్రయించడమే కాదు.. సరైన వ్యాపారి ద్వారా, సరైన కేంద్రంలో అమ్మాలి. లేదంటే పథకం వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. పైగా ఈ నెల 21 నుంచి నెల రోజుల్లోపు అమ్ముకున్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని మెలిక పెట్టింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మంది రైతులు పంటను అయినకాడికి తెగనమ్ముకొని తీవ్ర నష్టాల పాలయ్యారు. ఇక వందలాది మంది రైతులు గిటు్టబాటు ధర లేక వేలాది టన్నుల కాయలను రోడ్లపై పారబోశారు. మరికొందరు చెట్లకే కాయల్ని వదిలేయగా.. ఇంకొందరైతే చంద్రబాబు ప్రభుత్వ తీరుతో విసిగి వేసారి ఏకంగా తోటలనే నరికేశారు. -
నిధుల సమీకరణకు ఫ్యాషన్ షో..
గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా వేడుకలను ఈ నెల 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సోమాజీగూడలోని ది పార్కు హోటల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్‌లో సోమవారం సన్నాహక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఫౌండర్ అండ్ డైరెక్టర్స్ స్నేహల్‌తో పాటు క్రాంతి, సబీనా, రిని, చతుర్వేది హాజరై వివరాలను వెల్లడించారు. జేసీఐ సికింద్రాబాద్ ప్యారడైజ్ మద్దతులో ఎస్ఎస్కే క్రియేషన్స్ ఆధ్వర్యంలో గ్లోరియస్ మిస్ అండ్ మిసెస్ ఇండియా, రాయల్ మిస్టర్ ఇండియా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఇది ఒక లక్ష్యంతో ఏర్పడిన మిషన్ అని పేర్కొన్నారు. ఉమంగ్ ఫౌండేషన్, భారత సైన్యంతో కలిసి దేశ సరిహద్దు ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు నిర్మించేందుకు నిధులు సమీకరిస్తున్నామన్నారు. పది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తెలంగాణ జేసీఐ తరపున పాఠశాలల అభివృద్ధికి నిధుల సమీకరణ చేపడుతున్నామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అందాల భామలు ర్యాంప్‌వ్యాక్ చేసి ఆకట్టుకున్నారు. (చదవండి: ఆభరణాల క్రియేటివిటీ వెనుక ఇంట్రస్టింట్ స్టోరీ ఇదే..!) -
కశ్మీర్ : ఆపిల్ రైతులపై దాడులు; సంబంధాలే ముఖ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో నిత్యం జరిగే ఉగ్రదాడులతో ప్రజలు భయంభయంగా బతుకున్నారు. ఇక రైతుల కష్టాలు సరేసరి. తాము పండించిన పంటను మార్కెట్‌కు తరలించి అమ్మకునేందుకు ఆపిల్ రైతులు, సరఫరాదారులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆపిల్ పంట ట్రాన్స్‌పోర్టు చేస్తున్న ఓ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడిచేసి ఇద్దరు కాశ్మీరీయేతర ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. మరో రెండు ట్రక్కులను ఉగ్రవాదులు తగులబెట్టారు. అక్టోబర్ 14న రాజస్తాన్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్లను కాల్చి చంపారు. దీంతో కశ్మీర్‌కు వాహనాల్ని పంపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి రాష్ట్రాలకు ఆపిల్ పంటను రవాణా చేసే క్రమంలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ పరిపాలన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (ఎంఐఎస్) ఆపిల్ రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. బయటి రాష్ట్రాల్లో అమ్ముకుంటే వచ్చేదానికన్నా ఎక్కువ ధర చెల్లించిమరీ కొనుగోలు చేస్తామని అన్నారు. అయితే, ఈ విధానంపై రైతులు, వ్యాపారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యక్తులతో సంవత్సరాల నుంచి ఉన్న తమ వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు. ఎంఐఎస్ స్కీమ్‌పైగులాంనబీ అనే రైతు మాట్లాడుతూ.. ‘సంప్రదాయ మార్కెటింగ్ విధానంలోనే ఇటీవల 15 కిలోల ఆపిల్ పెట్టెను కశ్మీర్ నుంచి ఢిల్లీకి సరఫరా చేశాను. దాదాపు రూ.700 నుంచి రూ. 800 వరకు లాభం వచ్చింది. కానీ ఎంఐఎస్ స్కీమ్ ద్వారా సరఫరా చేస్తే రూ.1000 వచ్చేవి. అయితే, నాకది ఇష్టం లేదు. బయటి రాష్ట్రాల ప్రజలు, వ్యాపారులతో చాలా ఏళ్లుగా ఉన్న సంబంధాలే మాకు ముఖ్యం. డబ్బులు ప్రధానం కాదు. పంజాబ్ లేదా దక్షిణ భారతదేశంలోని వ్యాపారులతో కశ్మీర్ వ్యాపారుల సంబంధాలను విచ్ఛిన్నం చేయడం మాకు ఇష్టం లేదు’అన్నాడు. -
ఆయిల్ పామ్ కు ఎంఐఎస్ భేష్
స్వాగతించిన ఓపీడీపీఏ హైదరాబాద్: పామాయిల్ రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్(ఎంఐఎస్)ను వర్తింపజేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ద ఆయిల్ పామ్ డెవలపర్స్ అండ్ ప్రాసెసర్స్ అసోసియేషన్(ఓపీడీపీఏ) పేర్కొంది. ఆయిల్ పామ్ ఫ్రెచ్ ఫ్రూట్ బంచెస్(ఎఫ్‌ఎఫ్‌బీ)కి టన్నుకు ఎంఐఎస్‌గా రూ.7,888ను కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది కాలంలో ముడి చమురు ధరలు బాగా తగ్గాయని, ఇది ఆయిల్ పామ్ పరిశ్రమ, రైతులపై తీవ్రమైన ప్రభావం చూపించిందని ఓపీడీపీఏ అధ్యక్షుడు సంజయ్ గోయెంకా చెప్పారు. సమస్యల నుంచి గట్టెక్కెందుకు కనీస మద్దతు ధర(ఎంఐఎస్) లేదా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్(ఎంఐఎస్) కావాలని కోరామని పేర్కొన్నారు. కేంద్రం ఎంఐఎస్‌ను ప్రకటించడం రైతులకు, పరిశ్రమకు పెద్ద ఊరట అని వివరించారు. భారత్‌లో ఉత్పత్తయ్యే పామాయిల్లో 90 శాతం వాటా తెలంగాణ, ఏపీలదేనని, ఈ చర్య ఈ రెండు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు.