
సాక్షి, విజయవాడ: ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్‌సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.
‘‘ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది’’ అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి 16 నెలలు సమయం పట్టింది. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి’’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా