ఉద్యోగులకు బాబు దగా | Chandrababu coalition govt Fraud to Government employees in AP | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు బాబు దగా

Oct 19 2025 5:21 AM | Updated on Oct 19 2025 5:21 AM

Chandrababu coalition govt Fraud to Government employees in AP

దీపావళి పండుగ పూట వంచన ఐఆర్‌ ఊసే లేదు.. పీఆర్సీకి పంగనామాలు

4 డీఏలకు గాను ఒక్క డీఏతోనే నిలువునా ముంచిన సర్కార్‌

16 నెలలు ఎగ్గొట్టి ఆ తర్వాత చర్చల పేరుతో ఇంత హంగామానా! 

రూ.31 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలు, సీపీఎస్‌ ఊసే లేదు 

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై నిందలు 

జగన్‌ 1.26 లక్షల ఉద్యోగాలిచ్చి వ్యయం పెంచేశారని అక్కసు 

ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేశారని గగ్గోలు 

మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తానంటూ గుబులు రేపిన సీఎం

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్‌  

కరోనాతో ఆర్థిక వ్యవస్థ తలకిందులైనా హామీల అమలు    

నేను రాగానే మంచి పీఆర్సీ ఇస్తాను.. ఇంటీరియం రిలీఫ్‌ (ఐఆర్‌) ఇస్తాను.. మీకు రావాల్సిన డబ్బులన్నీ వెంటనే ఇచ్చేస్తాను.. తక్కువ ధరకే ఇంటి జాగాలు ఇస్తాను.. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ సమస్య లేకుండా చేస్తాను.. ఎర్న్‌డ్‌ లీవ్‌లు, సరెండర్‌ లీవ్‌లు, ఇతరత్రా బకాయిలన్నీ ఇచ్చేస్తాను.. పోలీసులకు కూడా శని, ఆదివారాలు సెలవు ఇస్తాను.. హోం గార్డుల జీతాలు పెంచుతాను. 
– ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు

ఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయి.. ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉద్యోగుల జీతాల ఖర్చు ఎక్కువగా ఉంది.. పైగా ఆర్టీసీ ఉద్యోగులను తీసుకొచ్చి ప్రభుత్వంలో కలిపేశారు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వల్ల అదనపు ఖర్చు వస్తోంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాగోలేదు.. ఖర్చులు పెరిగిపోతున్నాయి.. సీపీఎస్‌ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.. పీఆర్సీకి మరింత వెసులుబాటు కావాలి.. ఉద్యోగులు రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అయినా దీపావళి కానుకగా ఒక్క డీఏను ఇస్తున్నాం.   
– అధికారంలోకి వచ్చిన 16 నెలల తర్వాత సీఎం చంద్రబాబు  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన దీపావళి కానుక తుస్సుమంది. అప్పుడు కాదు ఇప్పుడు అంటూ ఎన్నికలకు ముందు ఊరించి, లెక్కలేనన్ని హామీలు గుప్పించి.. వారితో ఓట్లు వేయించుకుని.. తీరా గద్దెనెక్కాక హామీల సంగతే మరిచారు. నెల కాదు.. రెండు నెలలు కాదు.. ఏకంగా 16 నెలలైనా ఇచ్చిన హామీలకు దిక్కులేదని ఉద్యోగులు రోడ్డెక్కుతుంటే నాలుగు డీఏలకు గాను ఒకే ఒక్క డీఏ ఇస్తామని.. ఇంతకంటే ఎక్కువగా ఆశించవద్దన్నట్లు చెప్పుకొచ్చారు. ఎప్పటిలాగే ఓ వైపు గత ప్రభుత్వంపై నిందలేస్తూ.. మరో వైపు ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తానంటూ షాక్‌ ఇస్తున్నారు. 

అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలన్నీ వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు పూర్తి స్థాయిలో వారిని దగా చేశారు. నమ్మించి ఓట్లు వేయించుకుని నిండా ముంచారు. 16 నెలలుగా ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయకుండా కాలం గడుపుతూ చెవిలో పువ్వు పెట్టారు. రూ.31 వేల కోట్ల బకాయిల మాటే ఎత్తక పోవడం పట్ల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీల్లో కొన్నయినా అమలు చేస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తుంటే ఒకే ఒక్క డీఏతో సరిపెట్టారు. 

పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతుంటే ఒక్కటి మాత్రమే ఇస్తానని చెబుతూ ఆ ఖర్చు కూడా దండగేనని ఉద్యోగ సంఘాల సమావేశంలోనే చెప్పడం గమనార్హం. ఇతర రాష్ట్రాలు ఉద్యోగుల ఖర్చును భారీగా తగ్గించుకుంటున్నాయని, తాను కూడా అదే పని చేస్తానని చెప్పడంతో డీఏ ఏమో గానీ, మున్ముందు తమ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 27 శాతం ఐఆర్‌ ప్రకటించారు. 

కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ తల్లకిందులైనా పీఆర్సీ అమలు చేశారు. కానీ చంద్రబాబు తాను వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తానని చెప్పి ఆ మాటే మరచిపోయారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి గురించి ఆలోచన కూడా చేయలేదు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నిసార్లు అడిగినా వారికి అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. వారి ఆందోళన రోజురోజుకూ పెరిగిపోతుండడం, వేలాది మంది టీచర్లు రోడ్డెక్కి భారీగా ధర్నా చేయడంతో ఉలిక్కిపడ్డారు. 

ఎలాగోలా వారి ఆందోళనను తగ్గించడానికి తనకు అలవాటైన రీతిలో మభ్యపెట్టే ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే శనివారం ఉద్యోగ సంఘాల నాయకులతో గంటల తరబడి సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లోనే తమకు అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి చెందిన బాకా నాయకుడితో ఈ సమావేశంలో రెండు డీఏలు ఇస్తే చాలని, ఇంకేమీ వద్దని చెప్పించారు. చివరికి కంటి తుడుపుగా ఒక డీఏ ఇస్తానని, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదంటూ సూక్తులు చెప్పి తప్పించుకున్నారు.   


అధికారంలోకి వస్తూనే పీఆర్సీ ఇస్తానన్నారుగా.. 
నిజానికి ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వచ్చీ రావడంతోనే మంచి పీఆర్సీ ఇస్తానని చెప్పి, ఇప్పుడు దాని గురించి తనకు వదిలేయాలని, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తానని చెప్ప­డంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. నిజానికి ఉద్యోగులు పీఆర్సీ సంగతి దేవుడెరుగు కనీసం రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్‌ స్థానంలో కొత్త కమిషనర్‌ను నియమించాలని కోరుతుంటే ఆ విషయాన్నే పట్టించుకోలేదు. అధికారంలోకి రాగానే చేస్తానని చెప్పిన మాటను ఆయన నీటి మీద రాతగా మార్చేశారు. 

ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లిస్తామని చెప్పి దానిపైనా నోరు మెదపలేదు. ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ను తాను వచ్చిన 6 నెలల్లో పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని 16 నెలలుగా పట్టించుకోకుండా ఇప్పుడు మరో 6 నెలల్లో చేస్తానని చెప్పడంతో అది జరిగేది కాదేమోనని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ విషయం సుప్రీంకోర్టులో ఉందని అబద్ధం చెబుతూ తప్పించుకుంటున్నారు. చైల్డ్‌ కేర్‌ లీవులు 180 వాడుకోవచ్చని చంద్రబాబు చెప్పినా, నిజానికి అది జగన్‌ హయాంలోనే అమల్లోకి వచ్చింది. తక్కువ రేటుకు ఇంటి స్థలం ఇస్తామని ఇచ్చిన హామీ ఊసే లేకుండా పోయింది.   

అన్ని ఉద్యోగాలిస్తే ఎలా! 
తన ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలిస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకపోగా, జగన్‌ హయాంలో 1.26 లక్షల శాశ్వత ఉద్యోగాలివ్వడాన్ని చంద్రబాబు తప్పు పట్టడం గమనార్హం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా అంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను ఒకేసారి ఇవ్వడాన్ని ఆయన అనవసరమని చెప్పడం చూసి ఉద్యోగులు విస్తుపోతున్నారు. తద్వారా ఉద్యోగుల పట్ల తనకున్న చులకన భావాన్ని సీఎం బయట పెట్టుకున్నారు. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతగా మేలు జరిగిందో చంద్రబాబు మరచిపోయారని, లేదా ఉద్దేశ పూర్వకంగా ఆ వ్యవస్థను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని, ప్రైవేటు ఏజెన్సీల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వ్యవస్థ స్థానంలో ఆప్కాస్‌ను ప్రవేశ పెట్టడాన్ని కూడా చంద్రబాబు తప్పు పట్టడం పట్ల ఆయా ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వారి వల్ల వేల కోట్ల రూపాయల వ్యయం పెరిగిపోయిందని చెప్పి వారిని కించపరిచారు. ఇంతా చేసి.. ఇప్పుడు మొక్కుబడిగా ఒక డీఎతో దీపావళి కానుక అంటున్న సీఎం మాటలు, వ్యాఖ్యలను బట్టి తమ పరిస్థితి మున్ముందు మరింత దారుణంగా ఉంటుందనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.  

వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వ హయాంలో..
చంద్రబాబు 2018 జూలై నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేదు. ⁠కనీసం ఐఆర్‌ కూడా ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లారు. 2019 మేలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే (10 జూన్‌ 2019) వైఎస్‌ జగన్‌  27 శాతం ఐఆర్‌ ప్రకటించారు. 2019 జూలై నుంచి వర్తింపచేసి ఆగస్ట్‌ ఒకటిన కొత్త జీతాలు ఇచ్చారు. తద్వారా 2019 జూలై నాటికి 30 ఏళ్లు సర్వీస్‌ ఉన్న ఒక ఉద్యోగికి సుమారుగా రూ.64 వేల బేసిక్‌ ఉంటే 27 శాతం.. అంటే రూ.17,280 అదనంగా జీతంలో కలిసింది. 

మరో వైపు కరోనా వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారినా, జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులకు 2022లో పీఆర్సీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తరహాలో వెంటనే ఐఆర్‌ ప్రకటించి ఉంటే.. 2024 జూలై నాటికి బేసిక్‌ సుమారు రూ.72 వేలుగా ఉన్న ఉద్యోగికి.. కనీసం 27 శాతం ఐఆర్‌ ఇచ్చినా ప్రతి నెల రూ.19,440 అదనంగా జీతం వచ్చి ఉండేది. అలా చేయకపోవడంతో ఆ ఉద్యోగి రూ.3 లక్షలకు పైగా నష్టపోయారు.

16 నెలలుగా మోసం, దగా..  
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్‌ ఇస్తామని.. మంచి పీఆర్సీ ఇస్తామని.. పెండింగ్‌ బకాయిలన్నీ ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయింది. ఐఆర్‌ ప్రకటించలేదు.. ఉన్న పీఆర్సీ కమిషన్‌ను రద్దుచేసింది.. కొత్త పీఆర్సీ కమిషన్‌ను ప్రకటించలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులను ప్రభుత్వం శనివారం చర్చలకు పిలిస్తే.. ఐఆర్‌ ప్రకటిస్తారని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు ఇస్తారని.. కొత్త పీఆర్సీ కమిషన్‌ను ప్రకటిస్తారని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆశించారు. కానీ, ఒక్క డీఏను మాత్రమే ప్రకటించింది. ఇది ఉద్యోగులను మోసం చేయడమే. తక్షణమే ఐఆర్‌ ప్రకటించాలి.. నాలుగు డీఏలు ఇవ్వాలి.. పెండింగ్‌లో ఉన్న బకాయిలు రూ.32 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి. 
    – కాకర్ల వెంకటరామిరెడ్డి, చైర్మన్, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌  

దాటవేత వైఖరి దారుణం 
అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తవుతున్నా ఒక్కరోజు కూడా ఉద్యోగ సంఘాలను పట్టించుకోని ప్రభుత్వం శనివారం రోజంతా వారితో చర్చలు జరిపి ఒక్క డీఏ మాత్రమే ప్రకటించి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఒక్క డీఏ ఇవ్వడానికి ఇంత హంగామా ఎందుకు? ఐఆర్‌ ఊసేలేదు. పీఆర్సీపై ప్రభుత్వం దాటవేత వైఖరిని అవలంబించడం దారుణం. 
– లెక్కల జమాల్రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కో–చైర్మన్, ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  

ఉసూరుమనిపించారు
ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో ప్రభుత్వం తీవ్ర నిరాశ నింపింది. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినప్పటికీ నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించారు. 30 శాతం ఐఆర్‌ ఊసేలేదు. పీఆర్సీ కమిటీ ప్రస్తావన లేదు. కేవలం రూ.160 కోట్లు మాత్రమే విడుదల చేసి ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి ఉసూరుమనిపించారు. దీనిని ప్రభుత్వం దీపావళి కానుక అని గొప్పలు చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. వైఎస్సార్‌టీఏ పక్షాన 
తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం.      
– పి.అశోక్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్‌టీఏ

ఉద్యోగవర్గం జీర్ణించుకోలేకపోతోంది
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. ఈరోజు ఉద్యోగ, పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాలు జరిపి ఒక్క విడత డీఏ మాత్రమే ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, నాలుగు విడతల డీఏ పెండింగ్‌ ఉంటే ఒకటి మాత్రమే మంజూరు చేయడం, బకాయిలు ఊసే ఎత్తకపోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీపావళి పండగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురుచూశారు. కానీ, ఒక్క డీఏతో తుస్సుమనిపించారు. 
    – నలమారు చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉద్యోగ–పెన్షనర్స్‌ విభాగం అధ్యక్షుడు

హామీలిచ్చి అన్యాయం 
అధికారంలోకి రాగానే డీఏ, ఐఆర్, మంచి పీఆర్పీ ఇస్తామని హామీలిచ్చి ఇప్పుడు ఒక్క డీఏ ఇవ్వడం అన్యాయం. సాధారణంగా అయితే ఆరు నెలలకు ఒకసారి డీఏ ఇవ్వాలి. నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక్క డీఏ ఇవ్వడానికి సీఎం స్థాయిలో చర్చలు ఆశ్చర్యం కలిగించాయి.  
  – వి.రెడ్డి శేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి  

ఎందుకింత మోసం 
ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎందుకింత మోసం చేయడం? పీఆర్‌సీ  వేస్తారని ఆశించాం. ప్రభుత్వం దీనిపై నోరు మెదపకపోవడం అన్యాయం. కనీసం రెండు డీఏలైనా ఇస్తారని అనుకున్నాం. కానీ, ఒక్క డీఏ ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఒక్క డీఏ కోసం రెండ్రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో కాలయాపన చేయడం సమంజసం కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేయడం దారుణం. మిగిలిన పెండింగ్‌ 
ఎరియర్స్‌ వెంటనే విడుదల చేయాలి.    
– జీవీ రమణ, రాష్ట్ర కార్యదర్శి. యూటీఎఫ్‌

పీఆర్సీ, ఐఆర్‌ ఇవ్వకపోవడంతో తీవ్ర నిరాశ 
పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని సమావేశంలో గట్టిగా పట్టుబట్టాం. రెండు డీఏలైనా ఇవ్వాలని అడిగాం. అయితే, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులవల్ల ఒక్క డీఏ మాత్రమే ఇస్తున్నామని, సర్దుకోవాలని సీఎం చెప్పారు. పీఆర్‌సీ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశాం. అందుకు కాస్త సమయం పడుతుందని, త్వరలో చర్యలు చేపడతామన్నారు. ఒక్క డీఏ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు చిరు సంతోషమే మిగిలింది. పీఆర్‌సీ, ఐఆర్‌పై ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది.  
    – బాలాజీ, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం

బకాయిల గురించీ పట్టదా? 
2023 జూలై నుంచి పీఆర్సీ ప్రకటించాల్సి ఉంది. 30 శాతం మధ్యంతర భృతి అందించి ఉద్యోగులను ఆదుకోవాల్సింది పోయి కంటితుడుపు చర్యగా డీఏ ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పెండింగ్‌ బకాయిలు కూడా సత్వరమే చెల్లించాలని ఏడాదిన్నరగా చేస్తున్న డిమాండ్‌ పట్టించుకోకపోవడం బాధాకరం.  
       – పిసిని వసంతరావు, అధ్యక్షుడు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ

ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశ 
దీపావళి సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు తీపికబురు అందిస్తారని అనుకున్నాం. చివరికి ఒక్క డీఏ ప్రకటించి తీవ్ర నిరాశ కలిగించారు. 11వ పీఆర్‌సీ బకాయిలు చెల్లించి 12వ పీఆర్‌సీ కమిషన్‌ వేసి ఐఆర్‌ ప్రకటించి ఉంటే అందరూ ఆనందించే వారు. కానీ ప్రభుత్వం తీవ్రంగా నిరాశపరిచింది.  
– తమ్మినేని చందనరావు, స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, శ్రీకాకుళం

అందరిలోనూ అసంతృప్తి 
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ప్రభుత్వ వాగ్దానాల అమలు కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే, 4 డీఏలకు బదులు కేవలం ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై అందరిలోనూ అసంతృప్తి ఉంది. పండుగకు కనీసం రెండు డీఏలైనా ఇస్తే బాగుండేది. ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పండగ వేళ సర్కారు ఉసూరుమనిపించింది.    
          – ఏ సుందరయ్య, ఫ్యోప్టో ఛైర్మన్, విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లా  

ప్రభుత్వ వైఖరి దారుణం 
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలుపర్చడంలో విఫలమైన ప్రభుత్వం నాలుగు డీఏ బకాయిల్లో కేవలం ఒక్కటి మంజూరుచేసి చేతులు దులుపుకోవడం దారుణం. పీఆర్‌సీ కమిషన్‌ను నియమించి, ఐఆర్‌ ప్రకటించాలని చేసిన డిమాండ్లను పట్టించుకోకపోవడం సరికాదు. ఒక్క డీఏ మంజూరు ద్వారా ఒనగూరే ప్రయోజనమేమీ లేదు. 
– కె. నరసింహారావు, గుంటూరు జిల్లా ఫ్యాప్టో చైర్మన్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement