
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్థాన న్యాయ కోవిదుడు సిద్దార్థ లూథ్రాకు ఫీజుల చెల్లింపుల జాతర కొనసాగుతోంది. రాజకీయ కేసుల్లో వాదనలు వినిపించినందుకు ఇప్పటికే కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూథ్రాకు కట్టబెట్టిన కూటమి ప్రభుత్వం.. శుక్రవారం మరో 2.03 కోట్లను ఫీజుల రూపంలో చెల్లించింది.
ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ రెండు జీవోలు జారీ చేశారు. రూ.22 లక్షలు చెల్లిస్తూ ఒక జీవో, రూ.1.81 కోట్లు చెల్లిస్తూ మరో జీవో విడుదల చేశారు. ఇటీవలే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు లూథ్రాకు రూ.38.50 లక్షల ఫీజు చెల్లించింది. దీంతో లూథ్రాకు కేవలం రాజకీయ కేసుల్లో వాదనలు వినిపించినందుకు చెల్లించిన ప్రజాధనం రూ.5.11 కోట్లకు చేరింది. తాజాగా చెల్లించిన రూ.2.03 కోట్లతో కలిపితే ఇప్పటి వరకు లూథ్రాకు చెల్లించిన ఫీజుల మొత్తం రూ.7.14 కోట్లకు చేరడంతో రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: లోకేష్ ట్వీట్‌పై భగ్గుమంటున్న కర్ణాటకవాసులు