
ఆహారంలో స్పైసీ ఎలా సమతుల్యంగా ఉండాలో ఆర్థికరంగంలో అదే విధానం పాటించాలంటూ కర్ణాటక మంత్రి చురక
ఏపీ స్పైసీ దెబ్బకు పొరుగువారి కడుపులో మంట మొదలైందంటూ గురువారం వ్యంగ్యంగా లోకేశ్ పోస్టు
దీనిపై స్పందిస్తూ ఘాటుగా బదులిచ్చిన కర్ణాటక ఐటీశాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే
ఏపీ ఒక్క ఏడాదిలోనే రూ.1.61 లక్షల కోట్ల అప్పులు చేసింది
జీఎసీడీపీలో అప్పుల శాతం 2.65 శాతం నుంచి ఏకంగా 3.61 శాతానికి పెరిగింది
కూటమి సర్కారు చేస్తున్న అప్పులను ప్రపంచానికి చాటిచెప్పిన కర్ణాటక మంత్రి
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కొనసాగించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి పునర్విభజితమైన కొత్త రాష్ట్రాలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ మంత్రి లోకేశ్ చేస్తున్న వరుస ట్వీట్లపై కర్ణాటకవాసులు భగ్గుమంటున్నారు. లోకేశ్ ట్వీట్లతో జాతీయస్థాయిలో ఏపీ పరువు పోతుండటంతో పాటు కర్ణాటకలో నివసిస్తున్న తెలుగువారిపై స్థానికుల ఆగ్రహావేశాలకు దారితీస్తున్నాయి. ఇదే విషయాన్ని చాలామంది ఎక్స్ వేదికగా పంచుకుంటున్నారు.
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో చాలామంది ఏపీ ప్రజలు పని చేసుకుంటున్నారని, పోస్టు చేసేముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎక్స్‌లో ట్వీట్ చేస్తున్నారు. తాజాగా లోకేశ్ పెట్టిన పోస్టుతో కూటమి సర్కారు ఆర్థిక నిర్వహణ తీరును కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎక్స్ వేదికగా నిలదీశారు.
ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడాన్ని కర్ణాటక వాసులు తట్టుకోలేకపోతున్నారంటూ పరోక్షంగా లోకేశ్ ఎక్స్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు జాతీయస్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మారిపోయింది. ఏపీ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని, ఇప్పుడు ఇది పెట్టుబడులకు కూడా వ్యాప్తి చెందడంతో పొరుగువారి కడుపులో మంట మొదలైందంటూ లోకేశ్ గురువారం ఎక్స్‌లో చేసిన ఈ వ్యాఖ్యపై కర్ణాటక మంత్రి అంతే ఘాటుగా స్పందించారు.
గతంలోనూ ఇదే తీరు
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అనో.. లేక ఏదైనా కంపెనీ కర్ణాటకలో పెట్టుబడులపై ఆలోచిస్తున్నట్లు ఒక చిన్న వార్త వస్తే చాలు వెంటనే లోకేశ్ ఎక్స్‌లో పోస్టులు పెడుతుండటం కర్ణాటక వాసుల ఆగ్రహానికి ప్రధాన కారణంగా ఉంది. గతంలో ఇదేవిధంగా ఒకసారి లోకేశ్ పోస్టు చేస్తే ప్రియాంక్ ఖర్గే ఇదేవిధంగా ఘాటుగా స్పందించారు. బలహీనమైన ఎకో సిస్టమ్ ఉన్నవాళ్లు బలమైన వాళ్లపై ఆధారపడి జీవించడం సహజమంటూ పరాన్నజీవిగా అభివర్ణించారు.

మీ ఘనత.. ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్ల అప్పులు చేయడం
ప్రియాంక్ ఖర్గే ఏం ట్వీట్ చేశారంటే.. ప్రతి ఒక్కరు ఆహారంలో కాస్తాకూస్తో స్పైసీని ఆస్వాదిస్తారని, కానీ ఇది పోషకాహార నిపుణులు సిఫార్సు చేసిన మేరకే పరిమితం చేస్తామన్నారు. ఆర్థికవేత్తలు కూడా బడ్జెట్ నిర్వహణలో సమతుల్యతను పాటిస్తారు. ఏపీ ఏడాదిలో రూ.1.61 లక్షల కోట్లు అప్పులు తీసుకుందని, రాష్ట్ర జీఎసీడీపీలో అప్పుల వాటా 2.61 శాతం నుంచి 3.61 శాతానికి పెరగడం ద్వారా ఏపీ ఆర్థికవ్యవస్థ దిగజారిపోయిందంటూ పోస్టు చేశారు.