
సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ప్రయోజనాల్ని గాలి కొదిలేశారంటూ చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదా అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.
చంద్రబాబూ.. మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం మీకు చీమకుట్టినట్టైనా లేదు. అనేక ప్రాంతాలు సాగునీరు, తాగునీరు లేక ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉన్నాసరే మీరెందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన స్థానంలో ఉన్న మీరే, రాష్ట్రాన్ని ఈ రకంగా దెబ్బతీస్తుంటే ఎలా? రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు ఆ పదవి?
.@ncbn గారూ… మీరు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రానికి సంబంధించిన హక్కులను కాపాడే ఉద్దేశం ఏ కోశానా మీలో కనిపించడంలేదు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కర్ణాటక ప్రభుత్వం చకాచకా అడుగులేస్తుంటే, వారి కేబినెట్లో వారు ఎత్తు పెంచడానికి ఆమోదం తెలుపుకుంటే, కనీసం…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2025
గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణాజలాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. 1995లో ఆల్మట్టి ఎత్తు 509.016 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు నీటిని నిల్వ చేయడానికి అవసరమైన పనులు, స్పిల్‌వే సహా, గేట్ల నిర్మాణ పనులు జరుగుతుంటే అప్పట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నా, మీ ఎంపీల బలంమీదే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా, 1995-2004వరకూ కేంద్రంలో చక్రం తిప్పినట్టుగా మీకుమీరే గొప్పలు చెప్పుకున్న కాలంలో, మీకున్న రాజకీయబలాన్ని రాష్ట్ర ప్రయోజనాలకోసం వాడలేదన్నది నిజమే కదా? సుప్రీంకోర్టు ఆదేశాలతో 519 మీటర్లకు పరిమితం అయినా, చివరకు మీ హయాంలోనే తాను కోరుకున్న స్థాయిలో ఆల్మట్టి స్పిల్‌వే సహా గేట్లు పెట్టేందుకు అవసరమైన పనులు కర్ణాటక ప్రభుత్వం పూర్తిచేసిందనేది వాస్తవం కాదా?
గడచిన రెండున్నర దశాబ్దాలుగా, వర్షాభావం నెలకొన్న సంవత్సరాల్లో ఆల్మట్టి ఎత్తు పెంపు ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో కృష్ణాజలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎంతగా దెబ్బతింటున్నాయో, తాగునీరు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ మీ వైఫల్యాల పుణ్యమే కదా చంద్రబాబుగారూ? ఇప్పుడు మళ్లీ, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, మళ్లీ ఆల్మట్టి లో 519 మీటర్ల నుంచి 524.256 మీటర్ల కు పెంచి నీటిని నిల్వ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధమయ్యింది. నీటినిల్వ సామర్థ్యాన్ని 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెంచాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, దీనికోసం రానున్న 3 ఏళ్లలో రూ.70వేల కోట్లు ఖర్చు చేయాలని నిశ్చయించింది. ఇంత జరుగుతున్నా మీలో కదలిక కనిపించడంలేదు చంద్రబాబుగారూ?
..ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మీరు చక్రం తిప్పుతున్నారని మీరు, మీ ఎల్లోమీడియా రోజూ ప్రచారం చేసుకుంటున్నారు. పైగా మీ ఎంపీల బలంమీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందన్న మాటకూడా వాస్తవమే. మరి అలాంటప్పుడు మీకున్న రాజకీయ బలాన్ని ఉపయోగించి, ఒత్తిడి తెచ్చి తద్వారా పనుల నిలుపుదలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? కర్ణాటక మంత్రివర్గం సెప్టెంబరు 16న నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకూ మీరెందుకు స్పందించడంలేదు? అసలు రాష్ట్రం అంటే మీకు పట్టింపు ఉందా? లేదా?
..మరోవైపు జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన కృష్ణా జలవివాద ట్రైబ్యునల్ (KWDT-2) ముందు రాష్ట్రం తరఫున వినిపిస్తున్న వాదనలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. కృష్ణా నదిలో 75% నీటిలభ్యత ఆధారంగా చేసిన KWDT-2 తీర్పు అమల్లోకి వస్తే, రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. ఆ స్థాయిలో నీటి లభ్యత పరిగణలోకి తీసుకున్న పరిస్థితుల్లో, దాన్ని ప్రామాణికంగా తీసుకుని కేటాయింపులు చేయడం వల్ల రాష్ట్రానికి ఊహించని విధంగా నష్టం జరుగుతుంది. కరువు వస్తే రాష్ట్రమే భరించాలి, ఎలాగూ దిగువ రాష్ట్రం మనదే కాబట్టి వరద వచ్చినా రాష్ట్రమే ఆ నష్టాన్ని భరించేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి. దీన్ని గుర్తించి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 అక్టోబరులోనే పిటిషన్ దాఖలు చేసి, న్యాయపోరాటాన్ని ప్రారంభించింది. కాని మీరు ఇప్పుడు సమర్థవంతంగా వాదనలు వినిపించి, రాష్ట్ర హక్కులను కాపాడ్డంలో చిత్తశుద్ధి చూపడంలేదు.
..చంద్రబాబు మీరు ఇప్పటికైనా మేలుకోండి. కేంద్రంలో ఎంపీల సంఖ్యాపరంగా మీకున్న బలాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతోపాటు, KWDT-2 విచారణపై దృష్టిపెట్టి, సమర్థవంతమైన వాదనలు వినిపించండి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.