
2024లో చంద్రబాబు నుంచి తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిగా బి–ఫాం తీసుకుంటున్న జయచంద్రారెడ్డితో ప్రధాన నిందితుడు జనార్దన్‌రావు
నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు
తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జ్ జయచంద్రారెడ్డికి ‘కీలక’ నేత అండ
ఆఫ్రికాలో వ్యాపారం ద్వారా ‘మద్యం’పై అపార అనుభవం
ఎన్నికల ముంగిట మద్యం వ్యాపారంపై కీలక నేతతో చర్చలు
రాష్ట్రంలో, గోవాలో మద్యం ఫ్యాక్టరీ లీజుపై కీలక సమాచారం
భారీ స్థాయిలో డబ్బు ఆర్జించేలా స్కెచ్
అందువల్లే టీడీపీని ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న శంకర్ యాదవ్‌ను కాదని ఇతనికి టికెట్
ఎన్నికలయ్యాక ముందుగా అనుకున్న స్కెచ్ మేరకు నకిలీ లిక్కర్ దందా
రాష్ట్రంలో రెండు చోట్ల, పొరుగు రాష్ట్రంలో ఒక చోట నకిలీ మద్యం తయారీ ప్లాంట్
ములకలచెరువు ఘటన నేపథ్యంలో మిగతా 2 ప్లాంట్లు మూసివేత
అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతోనూ సాన్నిహిత్యం
కీలక నేత ఆదేశాలతో ఈ వ్యవహారం సద్దుమణిగేలా చక్రం తిప్పుతున్న ఈ ముఖ్య నేత
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఓ కీలక నేత అండతోనే నకిలీ మద్యం మాఫియా రాష్ట్రంలో రెక్కలు విప్పుకుందని తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డికి ఆ ‘కీలక’ నేతతో ఉన్న సంబంధం వల్లే ఇంత భారీ స్థాయిలో యథేచ్ఛగా ప్లాంట్ స్థాపించినట్లు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును ప్రకటించే వరకు ఆయనకు రాజకీయంగా పెద్ద గుర్తింపు లేదు.
అయితే అంతకు కొద్ది రోజుల ముందు ‘మద్యం’ వ్యాపారానికి సంబంధించిన పలు విషయాలను ఈయన ‘కీలక’ నేతతో చర్చించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే స్థానికంగా మద్యం తయారీతోపాటు గోవాలో ఖాయిలా పడిన మద్యం పరిశ్రమను లీజుకు తీసుకుని వ్యాపారం చేయొచ్చని.. భారీ స్థాయిలో డబ్బు ఆర్జించవచ్చని లెక్కలతో సహా చెప్పడంతోనే టికెట్ ఇచ్చారన్న ప్రచారం ఉంది. అందువల్లే టీడీపీని ఎంతో కాలం నమ్ముకుని ఉన్న, ఆ పార్టీలో గట్టి పట్టున్న నేతగా పేరున్న శంకర్ యాదవ్‌ను కాదని చివరి క్షణంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎన్నికల్లో పోటీ చేయక ముందు నుంచి సౌత్ ఆఫ్రికాలో జయచంద్రారెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు. ఆ అనుభవంతో రాష్ట్రంలో ‘మద్యం’ వ్యాపారం చేసే ‘స్కెచ్’ను ‘కీలక’ నేతకు ఇచ్చినట్లు సమాచారం. మొన్న ములకలచెరువులో బట్టబయలైన నకిలీ ప్లాంట్ తీరుతెన్నులు, ఇన్నాళ్లూ సాగించిన అక్రమ వ్యాపారం తీరు చూస్తుంటే ‘కీలక’ నేత అండదండలు లేకుండా ఇంత భారీగా దందా నడిపించడం అసాధ్యమని ఎక్సైజ్, పోలీసు వర్గాల్లో సైతం చర్చ జరుగుతోంది.
ఈ నకిలీ మద్యం దందా సవ్యంగా సాగేందుకు ‘కీలక’ నేత ఆదేశాలతో అన్నమయ్య జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతతో జయచంద్రారెడ్డి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా ములకలచెరువు తరహాలో విజయవాడ ప్రాంతంలో ఒకటి, కర్ణాటకలో కూడా మరో నకిలీ మద్యం ప్లాంట్ నడుస్తున్నట్లు సమాచారం. అయితే శనివారం నుంచి వీటిని తాత్కాలికంగా బంద్ చేసినట్లు తెలిసింది.
జనార్దనరావును ముందు పెట్టి దందా
కళ్లకు కనిపిస్తున్న ఆధారాలు, ఈమధ్య కాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ కేసులో ఏ–1గా కేసు నమోదైన అద్దేపల్లె జనార్దనరావును ముందు పెట్టి.. జయచంద్రారెడ్డి కథ నడిపించారని స్పష్టమవుతోంది. జయచంద్రారెడ్డిది ములకలచెరువు సొంత మండలం. విజయవాడకు చెందిన జనార్దనరావుతో జయచంద్రారెడ్డికి కాలేజీ రోజుల నుంచే స్నేహం ఉంది. తిరుపతిలో చదువుకుంటున్న రోజుల్లో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం జయచంద్రారెడ్డి సొంత మండలంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రారంభించే స్థాయికి వచ్చింది.
జయచంద్రారెడ్డి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరినప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. చంద్రబాబు చేతుల మీదుగా బి–ఫాంను స్వీకరించే సమయంలోనూ జనార్దనరావు పక్కనే ఉన్నాడు. పైగా ఆ సమయంలో జనార్దనరావు చంద్రబాబుతో చాలా సేపు మాట్లాడినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం రాకెట్‌పై ఆ పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
టీడీపీలో చేరిన రోజు జయచంద్రారెడ్డితో జనార్దనరావు (ఫైల్)
అధికారమే అండగా..
ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ నడిపేందుకు ఎక్కడో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తికి సాధ్యం అవుతుందా? ఒకవేళ సాధ్యమైనా ఇంతటి ప్రమాదకరౖమెన నకిలీ మద్యం తయారీకి బలమైన స్థానికుల సహకారం లేకుండా సాహసం చేయగలడా? ఇలాంటి పనికి స్థానికులు భవనాలను లీజుకు ఇస్తారా? జయచంద్రారెడ్డి అధికార టీడీపీ ఇన్‌చార్జి కావడం, ‘కీలక’ నేత అండతో, అధికార బలంతో, వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చని ఇక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఒకవేళ జయచంద్రారెడ్డికి సంబంధం లేకుంటే నకిలీ మద్యం వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా సాగడానికి సహకరించినదెవరో అధికారులు ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదు? నకిలీ మద్యం వ్యాపారం నిర్వహించడం కూలీలకో, అధికారం లేని వ్యక్తులకో సాధ్యమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే జయచంద్రారెడ్డి పీఏ రాజేష్ నకిలీ మద్యం కేసులో ఐదో నిందితుడు కావడం ఆయన పాత్ర ఉందని నిర్ధారిస్తోంది.
సాధారణ వ్యక్తి అయిన రాజేష్‌కు మద్యం దుకాణం నిర్వహించే స్థాయి లేదు. పాల వ్యాను కొనుగోలు చేసే ఆర్థిక స్థోమతా లేదు. ఈ లెక్కన కీలక సూత్రధారుల్లో జయచంద్రారెడ్డి కూడా ఒకరని స్పష్టమవుతోంది. అయితే ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని జయచంద్రారెడ్డి మాత్రం ఓ వీడియో విడుదల చేయడం తెలిసిందే.
ఆ మంత్రికి భయం పట్టుకుంది
నకిలీ మద్యం తయారీ రాకెట్‌లో టీడీపీ నేతల ప్రమేయం లేదని ఇంత వరకు ప్రభుత్వం కానీ, టీడీపీ వర్గాలు కాని ఖండించలేదు. శుక్రవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాయలసీమకు చెందిన ఓ మంత్రి ముందుండి పరిస్థితిని చక్కబెడుతున్నారని సమాచారం.
టీడీపీ నేతల ప్రమేయం బయటకు వస్తే దాని ప్రభావం తనపై పడుతుందన్న భయంతో ఆ మంత్రి మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ మంత్రి 2సార్లు ములకలచెరువులో జయచంద్రారెడ్డి ఇంటికి అనధికారికంగా వచ్చారని స్థానిక టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.