
సిట్ తనిఖీలు చేసిన కంపెనీల్లో ఆమె డైరెక్టర్ అంటూ అసత్య ప్రచారం
ఆ సంస్థల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి డైరెక్టర్‌గా ఎన్నడూ లేరు
స్పష్టం చేస్తున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డులు
చంద్రబాబు క్షుద్ర రాజకీయం.. ఈనాడు విష ప్రచారం
పచ్చ మూక కలిసి పన్నిన కుట్ర బట్టబయలు
ఈ అక్రమ కేసులో మొదటినుంచి సిట్ తీరు అంతే..
ఎంపీ మిథున్‌రెడ్డి నుంచి సునీల్‌రెడ్డి వరకు అదే కుట్ర..
అసలు మద్యం డాన్ చంద్రబాబే
ఆధారాలతో నిరూపించిన సీఐడీ
ఆ కేసులో ఇప్పటికీ బెయిల్ పైనే ఉన్న చంద్రబాబు
దానిని కప్పిపుచ్చేందుకు రెడ్‌బుక్ కేసు కుట్ర
చంద్రబాబు కుట్రల ముందు నక్క జిత్తులు ఎందుకూ పనికిరావు... ఈనాడు పత్రిక కట్టుకథలకైతే శకుని కుతంత్రాలు కూడా తీసికట్టే...అలాంటి ఇద్దరూ కుమ్మక్కై బరితెగిస్తే ఎలా ఉంటుందో తెలుసా...?అబద్ధానికి ప్రతిరూపంలా... దుర్మార్గానికి నిలువుటద్దంలా నిలుస్తుంది...అడ్డగోలుతనానికి అక్షర రూపంలా... ఓ నిలువెత్తు సాక్ష్యంలా కనిపిస్తుంది..మద్యం అక్రమ కేసులో చంద్రబాబు– ఈనాడు ఇలానే పన్నాగాలు పన్నుతున్నారు.. సిట్‌ను అడ్డం పెట్టుకుని... సిగ్గులేకుండా అవాస్తవాలు అచ్చోస్తున్నారు...
సాక్షి, అమరావతి: నక్కజిత్తులను తలదన్నే చంద్రబాబు, శకుని కుతంత్రాలను మించిన ఈనాడు పత్రిక తోడుదొంగల మాదిరి మద్యం అక్రమ కేసులో కట్టుకథలు వండివారుస్తున్నారు. చంద్రబాబు విషపు రాజకీయాలను కొమ్ముకాసే రామోజీ కుటుంబ విష పుత్రిక ఈనాడు అంతకంతకూ బరితెగిస్తోంది. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారే తమ ‘బాబు’కు గొడుగు పడుతూ అసలు నైజం చాటుకుంటోంది. నిత్యం ఉషోదయాన అసత్యాలను ప్రవచించడమే ఏకైక విధానంగా చేసుకున్న ఈనాడు... ఈ కోవలోనే ‘వైఎస్ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు’ శీర్షికన శనివారం ఓ అబద్ధపు కథనాన్ని అచ్చోసింది. పాత్రికేయ విలువలకు పాతరేస్తూ... అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది.
⇒ మద్యం అక్రమ కేసులో సిట్ సోదాలు నిర్వహించిన రెండు కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి గతంలో డైరెక్టర్‌గా ఉన్నారంటూ∙అసత్యాన్ని ఈనాడు నిస్సిగ్గుగా ప్రచురించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ భారతి ఏనాడూ డైరెక్టర్‌గా లేరని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) రికార్డులు స్పష్టం చేస్తున్నా... పచ్చ పత్రిక మాత్రం ఉద్దేశపూర్వకంగా అబద్ధపు కథనాన్ని వదిలింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలో ప్రధాన పాత్రధారిగా అసత్య కథనాలతో తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించింది.
వైఎస్ అనిల్‌రెడ్డి కంపెనీల్లో జగన్ సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్నారని మొదటి పేజీలో విషం చిమ్మిన ఈనాడు
బాబు, ఈనాడు క్షుద్ర రాజకీయానికి పరాకాష్ట
వైఎస్ జగన్ సతీమణి భారతిపై దుష్ప్రచారం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు, ఈనాడు సాగిస్తున్న కుట్ర పరాకాష్టకు చేరింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లేని మద్యం స్కాంను ఉన్నట్టుగా చూపించేందుకు సాగిస్తున్న వారి కుతంత్రాలు మరింత పదునెక్కాయి. ఈసారి ఏకంగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి దిగి కుట్రను పతాకస్థాయికి తీసుకెళ్లారు. మద్యం అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్‌రెడ్డికి చెందిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోలపాటు మరో ఆరు కంపెనీల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. అయితే, ఇదే అవకాశంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వ డైరెక్షన్‌లో... వైఎస్ భారతిపై దుష్ప్రచారం చేసేందుకు ఈనాడు బరితెగించింది.
⇒ షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ భారతి 2020 వరకు డైరెక్టర్‌గా ఉన్నారని ఈనాడు నిస్సిగ్గుగా అవాస్తవ కథనం ప్రచురించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అక్రమ నిధులు మళ్లించేందుకు 2019లో ఆ కంపెనీలను ఏర్పాటు చేశారని కూడా చెప్పుకొచ్చింది. అబద్ధాల విష పుత్రిక అయిన ఈనాడు... పాత్రికేయ విలువలు కాలరాస్తూ అసత్య కథనాన్ని శనివారం ప్రధాన ఎడిషన్ మొదటి పేజీ, రెండో పేజీ ప్రచురించింది. వైఎస్ జగన్ సతీమణి భారతి గతంలో డైరెక్టర్‌గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు అని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది.
ఆ కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఏనాడూ లేరు
స్పష్టం చేస్తున్న ఆర్‌వోసీ రికార్డులు
అసలు వాస్తవం ఏమిటంటే... వైఎస్ అనిల్‌రెడ్డికి చెందిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి ఏనాడూ డైరెక్టర్‌గా లేనే లేరు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) డిన్ (డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్)ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఓ వ్యక్తి గతంలో ఏయే కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారు...? ప్రస్తుతం ఏ కంపెనీల్లో ఉన్నారనే విషయాలు తెలుసుకోవచ్చు. ఆర్‌వోసీ రికార్డులు ఓపెన్ డాక్యుమెంట్లే. వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయి. అయినా సరే, ఈనాడు కుట్రపూరితంగా అబద్ధపు కథనాన్ని ప్రచురించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి 2020 వరకు డైరెక్టర్‌గా ఉన్నారని పచ్చి అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించింది.
పక్కా కుట్రతోనే దుష్ప్రచారం
చంద్రబాబు డైరెక్షన్‌లో ఈనాడు పక్కా పన్నాగంతోనే మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై అవాస్తవ కథనం ప్రచురించింది. ఆర్‌వోసీ కేటాయించే డిన్‌తో రికార్డులు పరిశీలిస్తే ఒక వ్యక్తి గతంలో, ప్రస్తుతం ఏఏ కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నారన్నది వెల్లడవుతుంది. ఒకే ఇంటి పేరు, ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల పట్ల కూడా సందేహం రాకుండా ఉండేందుకు అందరి పేర్లతో పాటు వారి తండ్రి, భర్త పేర్లు, వయసు వంటి వివరాలు అందులో పొందుపరుస్తారు. కానీ, షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉండేవారు అని దురుద్దేశపూర్వకంగానే ఈనాడు కథనం రాసింది.
ఆర్‌వోసీ రికార్డులను పరిశీలిస్తే ఆ రెండు కంపెనీల్లో గతంలో డైరెక్టర్ గా వ్యవహరించినది వైఎస్ అనిల్‌రెడ్డి తల్లి భారతి అని తెలుస్తుంది. ఆమె వయసు, ఆమె భర్త పేరు కూడా ఆ రికార్డుల్లో ఉన్నాయి. డైరెక్టర్‌గా వ్యవహరించింది వైఎస్ జగన్ సతీమణి భారతి కాదు వైఎస్ అనిల్‌రెడ్డి తల్లి వైఎస్ భారతి అని స్పష్టంగా ఉంటుంది. కానీ, ఈనాడు చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు కుట్రపూరితంగా వ్యవహరించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి 2020 వరకు డైరెక్టర్‌గా వ్యవహరించారని అవాస్తవ కథనం ప్రచురించింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసింది.
దుష్ప్రచారం... దుమ్మెత్తిపోయడం...
ప్రత్యర్థిని దొంగదెబ్బ తీసేందుకు దుష్ప్రచారం... విషం కక్కుతూ దుమ్మెత్తిపోయడం చంద్రబాబు, ఈనాడు సారథ్యంలోని పచ్చముఠాకు వెన్నతో పెట్టిన విద్య. వారం రోజుల వ్యవధిలోనే వారు చేసిన దుష్ప్రచారం చూస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. ఉమ్మడి ఏపీలో నమోదైన ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్ అసలు నిందితుడే కాకపోయినా.. ఆయనను ప్రధాన నిందితుడిగా(ఏ1) పేర్కొంటూ ఈ నెల 13న ఈనాడు అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించాలని చూసింది.
చంద్రబాబు కుట్రలో భాగంగా 2010–11 నాటి ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసును తెరపైకి తెచ్చింది. ఆ కేసులో వైఎస్ జగన్ నిందితుల జాబితాలోనే లేరు. కానీ, ప్రధాన నిందితుడు (ఏ1) అంటూ ప్రముఖంగా ప్రచురించింది. ఇదే కేసులో ఏ–7 హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, చిన్నాచితక వ్యాపారాలు చేసుకునే నర్రెడ్డి సునీల్‌రెడ్డి ఆయనకు అత్యంత సన్నిహితుడని కూడా చెప్పుకొచ్చింది. వైఎస్ జగన్ తరఫున సునీల్ రెడ్డి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, విదేశాలకు నిధులు తరలించారని అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచురించింది.
ఇలాంటి కథనాన్ని ప్రచురించే ముందు ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసు పూర్వాపరాలు తెలుసుకోవాలని అయినా ప్రయత్నించలేదు. కనీసం ఆ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించినా నిజాలు వెల్లడవుతాయి. అయితే, కేవలం చంద్రబాబు చెప్పినట్టు వైఎస్ జగన్‌పై బురదజల్లడమే లక్ష్యం అయిన ఈనాడు అవేమీ పట్టించుకోలేదు. ఇక ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో 14 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
ఈ జాబితాలో వైఎస్ జగన్ పేరు లేనే లేదు. తాజాగా మద్యం అక్రమ కేసులో సిట్ తనిఖీలు చేసిన కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్నారంటూ విషపు రాతలు కూడా ఈ తరహాలోనివే. గతంలో డైరెక్టర్‌గా ఉన్నారనే అసత్యాన్ని ఈనాడు అచ్చోసింది.ఇదంతా చూస్తుంటే ఈనాడు క్షుద్ర పాత్రికేయం స్పష్టం అవుతోంది. అబద్ధం అని తెలిసి కూడా దానిని ప్రజల్లోకి వదలడం దాని విష ప్రచారానికి అద్దంపడుతోంది.
ఈనాడుపై న్యాయపరమైన చర్యలు
సాక్షి, అమరావతి: తన ప్రతిష్ఠకు భంగకరంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. సిట్ సోదాలు నిర్వహించిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో తాను 2020 వరకు డైరెక్టర్‌గా ఉన్నట్లు ఈనాడు ఇచ్చిన కథనం పూర్తిగా అవాస్తవం అని వైఎస్ భారతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఈనాడు ప్రచురణ సంస్థ ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ పత్రిక ఏపీ ఎడిషన్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుకు తన న్యాయవాదుల ద్వారా శనివారం నోటీసులు పంపించారు.
⇒ భారతిరెడ్డి ఎడుగూరి సందింటి అనే పేరు గల మరో మహిళ ఆ కంపెనీల్లో డైరెక్టర్‌గా వ్యవహరించారని, తాను కాదని ఆమె వెల్లడించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ప్రకారం ఆమె గుర్తింపు నంబరు (డిన్–డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్) 02584220 కాగా, తన డిన్ 01580536 అని తెలిపారు. సిట్ సోదాలు నిర్వహించిన కంపెనీలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ భారతి తేల్చి చెప్పారు. కానీ, ఆ రెండు సంస్థల్లో తాను డైరెక్టర్‌గా ఉన్నట్లు, అక్రమ నిధులను మళ్లించినట్లు ఈనాడు దురద్దేశపూర్వకంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈనాడు కథనం తన ప్రతిష్ఠకు భంగం కలిగించేదిగా ఉంది అని వైఎస్ భారతి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై ఈనాడు పత్రిక తక్షణం వివరణను ప్రచురించాలని డిమాండ్ చేశారు. అవాస్తవ కథనాన్ని ప్రచురించినంత ప్రాముఖ్యతతో అదే (మొదటి) పేజీల్లో తన వివరణను రెండు రోజుల్లో ప్రచురించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే ఈనాడు ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించిందని భావించాల్సి వస్తుందన్నారు. అవాస్తవ కథనాన్ని ప్రచురించినందుకు న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు.
నిన్న.. ఎమ్మాఆర్ కేసులో అసలు నిందితుడే కాకపోయినా వైఎస్ జగన్ ఏ1 అంటూ ఈనాడు అచ్చోసిన అబద్ధం
చంద్రబాబు అవినీతి కేసులను కప్పిపుచ్చేందుకే...
టీడీపీ కూటమి ప్రభుత్వం ఇంతగా బరితెగించి వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై ఎందుకు దుష్ప్రచారం చేస్తోందంటే... చంద్రబాబు అవినీతి దందాను కప్పిపుచ్చేందుకే అనే సమాధానం ఠక్కున వస్తుంది. ఎందుకంటే మద్యం, ఇసుక, ఇతర ఖనిజాల దందాలో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. 2014–19 టీడీపీ హయాంలో మద్యం విధానం ముసుగులో టీడీపీ సిండికేట్ బరితెగించి దోపిడీ చేసింది. రెండు చీకటి జీవోలతో బార్లు, మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించింది. తద్వారా రూ.5,200 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది.
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగించి రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది. వెరసి రూ.25 వేల కోట్లు దోపిడీ చేసింది. ఈ వాస్తవాన్ని సీఐడీ గతంలోనే ఆధారాలతో సహా నిగ్గు తేల్చి... చంద్రబాబు, అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తదితరులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పైన ఉన్నారు. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్యం, ఇసుక, ఖనిజాల దందాకు చంద్రబాబు తెరతీశారు. టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా 4,700 మద్యం దుకాణాలు కేటాయించడంతో పాటు అంతే సంఖ్యలో పర్మిట్ రూమ్‌లకు అనుమతినిచ్చింది.
అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. 924 బార్లు ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు కట్టబెడుతున్నారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా దోపిడీ చేస్తున్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్ రాకెట్ రాష్ట్రంలో చెలరేగిపోతోంది. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ నేతల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఖజానాకు గండిపడి... టీడీపీ ప్రజాప్రతినిధులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల ద్వారా రూ.700 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం రాగా, టీడీపీ కూటమి ప్రభుత్వంలో రూపాయి కూడా రాలేదు. కానీ టీడీపీ ప్రజాప్రతినిధులు రోజూ వేల లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇలా చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా సాగిస్తున్న అవినీతి దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మద్యం విధానంపై అక్రమ కేసుతో వేధింపులకు పాల్పడుతోందన్నది సుస్పష్టం.
చంద్రబాబు, సిట్, ఎల్లో మీడియా తొలినుంచీ అదే కుట్ర
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి దర్యాప్తు పేరిట చంద్రబాబు సర్కారు తొలినుంచీ కుట్రపూరితంగానే వ్యవహరిస్తోంది. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో న్యాయస్థానాలను సైతం తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.
⇒ మద్యం విధానంతో గాని అసలు ఏపీ ప్రభుత్వ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల పేర్లను ఈ అక్రమ కేసులో ఇరికిస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతోంది. అక్రమ కేసు కాబట్టి ఎలానూ నిరూపించలేరు... ఈలోగా ఈనాడు, ఇతర ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేసి వారి పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీయొచ్చన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం.
⇒ రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, అంతర్జాతీయ సిమెంట్ దిగ్గజ సంస్థ వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పేర్లను మద్యం అక్రమ కేసుతో ముడిపెట్టింది. వారిని అక్రమంగా అరెస్టు చేసి జైలు పాల్జేసింది. తర్వాత వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపింది. అంతటితో చంద్రబాబు కుట్రలకు తెరపడలేదు. మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్లను తెరపైకి తెచ్చింది.
⇒ సిట్ కుట్రలు ఇంకా కొనసాగాయి... హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది నర్రెడ్డి సునీల్‌రెడ్డి, సజ్జల భార్గవ్ పేర్లను కూడా సిట్ కుట్రపూరితంగానే ఈ కేసుతో ముడిపెట్టింది. ఇక వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులను తీవ్రం చేసింది. ఇలా రోజుకో పేరును తెరపైకి తెస్తూ వైఎస్ జగన్ తరఫున వ్యవహారాలు చక్కబెడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రతి రోజూ అవాస్తవ కథనాలను వండి వారుస్తోంది.
⇒ మద్యం అక్రమ కేసులో ఒక్కో పాత్రను తెస్తూ కుతంత్రాలు పన్నుతోంది కూటమి ప్రభుత్వం. ముందుగా ఎవరో ఒకరిపై బురదజల్లడం, సోదాలు, అరెస్టులు చేయడం.. వారితో సంబంధాలు ఉన్నాయని 10 మందిని అరెస్టు చేయడం పనిగా పెట్టుకుంది. దొంగ డాక్యుమెంట్లు, నగదును చూపెడుతూ దుష్ప్రచారం సాగిస్తోంది. ఎవరిని అరెస్టు చేయాలనుకున్నా, ఎవరి కంపెనీలు, నివాసాల్లో తనిఖీలు చేయాలన్నా సరే... వారు వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు అంటూ ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడం, అనంతరం సిట్ అధికారులు రంగంలోకి దిగడం... ఇలా పక్కా పన్నాగంతో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
ఈ లెక్కన ఈనాడు రామోజీరావు కుటుంబం, టీడీపీ ఎంపీ భరత్ కుటుంబం యావత్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. మరి ఈనాడు–ఈటీవీ సంస్థలు, రామోజీ ఫిలింసిటీ, గీతం విద్యా సంస్థలు చంద్రబాబువే అవుతాయా...!? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు కూడా చంద్రబాబు పచ్చ తానులో ముక్కలే. మరి వారి ఆస్తులన్నీ కూడా చంద్రబాబువేనా!? టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈనాడుతో పాటు ఎల్లో మీడియా వైఎస్ జగన్ విషయంలో అదే రీతిలో వాదిస్తున్నాయి మరి.
ఇక రెడ్‌బుక్ కుతంత్రాలకు పరాకాష్టగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పేరును కూడా ఈ అక్రమ కేసు ఉచ్చులోకి లాగేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అందుకే వైఎస్ భారతికి ఏమాత్రం సంబంధం లేకపోయినా షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఆమె గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించారనే తప్పుడు కథనాన్ని కుట్రపూరితంగానే ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది.