
సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో ‘సుప్రీం’ కీలక తీర్పును దర్యాప్తు అధికారి పాటించారా? లేదా? పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశాలతో పోలీసుల్లో వణుకు
అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం తీర్పును గుర్తు చేసిన హైకోర్టు
మేజిస్ట్రేట్‌లు యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతుండటంపై విస్మయం
ఖాకీల అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై కన్నెర్ర
సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులకు తెర
ఏడాదిగా అక్రమ కేసులతో వేధించిన పోలీసులు
పౌరుల భావ ప్రకటనా హక్కును కాలరాస్తూ అణచివేతలు
ఏడాదిలో ఏకంగా 822 మందికి నోటీసులు
253 అక్రమ కేసులు.. 86 మంది అక్రమంగా అరెస్టు
హైకోర్టు ఆదేశాల పట్ల సర్వత్రా హర్షం.. జాతీయ స్థాయిలో చర్చ
పోస్టు పెడితే దాడులు.. కేసులు!
ముంపు సమస్యపై పోస్టు చేసినందుకు..
భారీ వర్షాలు కురవడంతో రాజమహేంద్రవరంలోని ప్రకాశ్ నగర్ కాలనీలో ముంపు సమస్యపై పులి సాగర్ అనే దళితుడు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే.. పోలీసులు ఆయన్ను ఓ ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు! స్టేషన్‌కు తరలించి అర్ధనగ్నంగా నిలబెట్టి పచ్చి బూతులు తిడుతూ... కొడుతూ చిత్రహింసలకు గురి చేశారు. ముక్కలుగా కోసి రైలు పట్టాలపై పడేస్తామని, శవం కూడా దొరకదని బెదిరించారు. పులిసాగర్‌ను అర్ధ నగ్నంగా లాకప్‌లో ఉంచిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ వేధింపులకు ఈ ఉదంతం ఓ నిదర్శనం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ.. హామీల ఎగవేతపై నిలదీస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుండటం... మేజిస్ట్రేట్‌లు వారిని యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతుండటంపై హైకోర్టు తీవ్రంగా స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసుల అరాచకాలకు హైకోర్టు చెక్ పెట్టిందని న్యాయకోవిదులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో సంబంధిత దర్యాప్తు అధికారి... అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు స్పష్టం చేయడంతో, ఇన్నాళ్లూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో చెలరేగిన పోలీసుల్లో వణుకు మొదలైందని వ్యాఖ్యానిస్తున్నారు.
తద్వారా రెడ్‌బుక్ పాశవిక విధానాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హైకోర్టు సంకేతాలిచ్చిందంటున్నారు. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేట్‌లకు తాజాగా హైకోర్టు పరిపాలనా మార్గదర్శకాలను నిర్దేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలను మేజిస్ట్రేట్‌లందరూ పాటించి తీరాల్సిందేనని, దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
భారత రాజ్యాంగాన్నిఅనుసరించి విధులు నిర్వహించాలి గానీ... లోకేశ్ విరచిత, చంద్రబాబు ప్రవచిత రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తే పోలీసులు ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేన్నది హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా సాగిస్తున్న ప్రభుత్వ స్పాన్సర్డ్... పోలీసు మార్కు వేధింపులకు హైకోర్టు ఆదేశాలతో అడ్డుకట్ట వేసినట్లైంది.
ప్రధానంగా పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో వేధింపులు... దర్యాప్తు ముసుగులో చిత్రహింసలకు పాల్పడుతూ రాష్ట్రంలో అరాచకం సృష్టించడంపై జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లకు అడ్డుకట్ట వేస్తూ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టు అంత క్రియాశీలంగా వ్యవహరించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేంతగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థ దిగజారిందన్నది యావత్ దేశానికి అవగతమైంది.
ప్రశ్నించే గొంతులపై దాష్టీకం
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ఏడాదిగా అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను అమలు చేయని వైనం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే వారిపై పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది.
ఎంతగా అంటే.. అన్నదాతా సుఖీభవ పథకం ఎప్పుడు ఇస్తారు? అని అడిగితే కేసు...! నిరుద్యోగ భృతి ఇవ్వరా..? అని ప్రశి్నస్తే కేసు...! వీధిలో లైట్లు వెలగడం లేదంటే కేసు...! సూపర్ సిక్స్ పథకాలను ప్రస్తావిస్తే చాలు కేసు..!! ఇలా ఎడాపెడా అక్రమ కేసులతో విరుచుకుపడింది. సూపర్ సిక్స్ హామీలు, ఎన్నికల మేనిఫెస్టో అమలులో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసులతో బెదిరింపులకు దిగింది.
ఏడాది వ్యవధిలో సోషల్ మీడియా కార్యకర్తలు ఏకంగా 822 మందికి నోటీసులు జారీ చేసింది. 253 అక్రమ కేసులు బనాయించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. 86 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను అక్రమంగా అరెస్టు చేసింది. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థాయిలో కేసులు నమోదు చేయలేదు.
హిట్లర్ దురాగతాలను గుర్తు చేసే రీతిలో చంద్రబాబు అణచివేతలకు పాల్పడ్డారు. అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తు పేరిట వేధించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, నిబంధనలను పాటించకుండా బరితెగించి వ్యవహరించారు.
వ్యవస్థీకృత నేరాల కింద కేసులు..
సోషల్ మీడియా పోస్టులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే 41 ఏ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలి. కానీ ఆ నిబంధనలను పోలీసులు నిర్భీతిగా ఉల్లంఘించారు. ఏకంగా వ్యవస్థీకృత నేరాల కింద కేసు నమోదు చేయడం ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనం. ఉగ్రవాదులు, స్మగ్లర్లపై నమోదు చేయాల్సిన కేసులను సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై బనాయించి కర్కశంగా వ్యవహరించారు.
రాత్రికి రాత్రి ఇళ్ల నుంచి లాక్కొచ్చి బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారు. ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్‌కు తిప్పుతూ.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతిక దాడులకు సైతం వెనుకాడలేదు!
కొమ్ముకాస్తే.. కఠిన చర్యలు..
చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా సాగిస్తున్న దమనకాండ, అరాచకాలకు హైకోర్టు అడ్డుకట్ట వేసింది. ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై అక్రమ కేసులు నమోదుకు చెక్ పెట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, మీడియా ప్రతినిధులు, కళాకారుల భావ వ్యక్తీకరణ హక్కుకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే పోలీసుల పట్ల కఠిన చర్యలు చేపడతామని తేల్చి చెప్పింది.
కేసుల దర్యాప్తు విషయంలో పాటించాల్సిన విధి విధానాలను పోలీసులకు గుర్తు చేసింది. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో రిమాండ్‌లు విధించడానికి వీల్లేదని మెజిస్ట్రేట్‌లకు స్పష్టం చేసింది. ఇకపై అటువంటి కేసుల్లో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అది కూడా.. సీఐ, ఎస్సై స్థాయి అధికారులు తమంతట తాముగా కేసులు నమోదు చేయకూడదని స్పష్టం చేసింది.
అటువంటి కేసుల నమోదుకు ముందు అన్ని విషయాలను పరిశీలించి డీఎస్పీ అనుమతి ఇవ్వాలని పేర్కొంది. తద్వారా అక్రమ కేసులు నమోదు చేస్తే ఇకపై డీఎస్పీనే ప్రధానంగా బాధ్యుడవుతారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఇక ఈ కేసుల దర్యాప్తు పేరిట పోలీసులు నెలల తరబడి కాలయాపన చేస్తూ నిందితులను వేధిస్తుండటాన్ని కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే అందుకు కారణాలను కచ్చితంగా చెప్పాలి. న్యాయస్థానాలు కూడా ఎడాపెడా రిమాండ్‌లు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు నిర్దేశించింది.
పోలీసులు ఆ కేసుల దర్యాప్తును 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దిష్ట కాలపరిమితి విధించింది. తద్వారా సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, మీడియా ప్రతినిధులు, సృజనాత్మక కళాకారులు, ఇతరుల భావ ప్రకటనా హక్కును హైకోర్టు పరిరక్షించింది. వాటికి విఘాతం కలిగించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
50 రోజుల పాటు జైల్లో..
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెద్దిరెడ్డి సుధారాణి, వెంకటరెడ్డి దంపతులపై కూటమి సర్కారు తప్పుడు కేసులు బనాయించింది. 50 రోజుల పాటు జైల్లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వారిపై పలు జిల్లాల్లో అక్రమ కేసులు నమోదు చేసింది.
పోస్టు పెట్టారని భర్తపై దాడి... భార్య అరెస్టు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన చిలకలూరిపేటకు చెందిన దంపతులు పాలేటి కృష్ణవేణి, రాజ్‌కుమార్‌పై పోలీసులు, టీడీపీ గూండాలు వేధింపులకు పాల్పడ్డారు. కృష్ణవేణిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆమెపై దాడికి పాల్పడ్డారు. రాజ్‌కుమార్‌ను చితకబాది నారా లోకేశ్ చిత్రపటం వద్ద మోకాళ్లపై నిలబెట్టి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు.
పోస్టు పెడితే దాడులు.. కేసులు!
సూపర్ సిక్స్‌పై పోస్టు పెట్టినందుకు..
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కె.హనుమంతరెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేసి మరీ చిత్రహింసలకు గురి చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడుకు చెందిన ఆయన్ను రెండు రోజులపాటు అక్రమంగా నిర్బంధించారు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు.
దివ్యాంగుడిపై పోలీసుల ప్రతాపం
టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నంద్యాల జిల్లా మహానందికి చెందిన తిరుమల కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి చేసి అక్రమంగా నిర్బంధించారు. దివ్యాంగుడైన కృష్ణను వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించారు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఒక్కడిపై 21 అక్రమ కేసులు..
టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలని డిమాండ్ చేసిన విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అక్రమ కేసులతో తీవ్రంగా వేధించారు. ఆయనపై వివిధ జిల్లాల్లో ఏకంగా 21 అక్రమ కేసులు నమోదు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్ వేధింపుల తీవ్రతకు నిదర్శనం. ఓ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చినా మరో కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగానే మరో 4 కేసులు బనాయించారు.
2018లో పోస్టు.. ఇప్పుడు అక్రమ కేసు
చంద్రబాబు సర్కారు అణచివేత విధానాలు, పాశవిక ధోరణి, మానవ హక్కుల ఉల్లంఘనకు తెనాలి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసు ఓ మచ్చు తునక. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ రాజకీయ విధానాలను ప్రశ్నిస్తూ 2018లో పోస్టు పెట్టిన ఆళ్ల జగదీశ్ అనే రైతుపై 2024లో అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన్ను అక్రమంగా అదుపులోకి తీసుకుని 2 రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించారు.
ఫొటో ఫార్వర్డ్ చేసినందుకు..
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓ సోషల్ మీడియా పోస్టును వాట్సాప్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేశారని ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రభావతి అనే మహిళతోపాటు 12 మందిపై కూటమి సర్కారు అక్రమ కేసు నమోదు చేసింది. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
పోసానిపై రెడ్‌బుక్ వేధింపులు
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని చంద్రబాబు ప్రభుత్వం వేధించిన తీరు అందరినీ నివ్వెరపరిచింది. ఆయనపై ఏకంగా 16 అక్రమ కేసులు నమోదు చేయడం సర్కారు అరాచకాలకు తార్కాణం. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌ను హైదరాబాద్‌లో బలవంతంగా అరెస్టు చేసి రాష్ట్రానికి తరలించి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పతూ వేధించారు. ఆయన కనీసం తన మందులను తెచ్చుకునేందుకు కూడా అనుమతించ లేదు. అక్రమ అభియోగాలతో రిమాండ్‌కు తరలించారు. 24 రోజులు జైల్లో ఉన్న అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.
కొమ్మినేనిపై కక్ష సాధింపు
ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావుపై చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కక్ష సాధింపులకు పాల్పడింది.
సాక్షి టీవీలో ఓ చర్చా గోష్టిలో ఆయన ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయకపోయినా అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. నిరాధార అభియోగాలతో రిమాండ్‌కు పంపించింది. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షి టీవీ, కొమ్మినేని శ్రీనివాసరావుపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.