
నెల్లూరులో తనను చూసేందుకు తరలి వచ్చిన భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
మా పార్టీ వాళ్లను నేను కలవడానికి ఇన్ని ఆంక్షలెందుకు?
తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు
ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఇంత భయమా?
చంద్రబాబు తన పాలన చూసి తానే భయపడుతున్నారు
ప్రజలను ఆపడానికి రోడ్లు తవ్వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే
సూపర్ సిక్స్.. సూపర్ సెవన్ అమలు చేయలేకే ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు.. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు మామూలే
నెల్లూరు పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
దీనిని జీర్ణించుకోలేక హత్యల స్థాయికి దాడులను ప్రోత్సహించడం దుర్మార్గం
ప్రసన్న ఇంటిపై దాడి సమయంలో ఆయన ఇంట్లో ఉండింటే హతమార్చేవారు
ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేశారు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఏకంగా 14 కేసులు పెట్టారు
మహిళలపై మంత్రులు, ఎమ్మెల్యేలు దారుణమైన భాష వాడుతున్నారు.. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరి మార్చుకోవాలి
లేదంటే ఇవాళ మీరు విత్తిన విష బీజం రేపు వృక్షం అవుతుంది.. చంద్రబాబు, ఆయనకు కొమ్ముకాసిన అధికారులందరిపై చర్యలు తప్పవు
ఎక్కడున్నా సరే తెచ్చి చట్టం ముందు నిలబెడతాం
తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు
నా పర్యటనలో ఎందుకిన్ని ఆంక్షలు పెట్టారని చంద్రబాబును, ఆయన అడుగులకు మడుగులొత్తే పోలీసులను అడుగుతున్నా. ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వారిని కలవడం నేరమా? అలా కలవడం తప్పా? ఎందుకు ఇంతగా ఆంక్షలు విధిస్తున్నారు? నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వారొస్తే తప్పేమిటి? సందుల్లోంచి టూ వీలర్లు కూడా రాకుండా ఏకంగా రోడ్లు తవ్వేశారు. ఇంత అధ్వాన పరిస్థితిని సృష్టించిన ఘనత బహుశా ప్రపంచంలో ఒక్క చంద్రబాబునాయుడికి తప్ప మరే రాజకీయ నాయకుడికీ ఉండదేమో. తన పాలన చూసి తనే ఇంతగా భయపడుతున్నాడు. అందుకే ఈ నిర్బంధాలు, అక్రమ కేసులు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదు.
-వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, అందుకే తన పాలన చూసి తానే భయపడుతున్నాడని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదన్నారు.
ఎవరైనా బ్రహ్మాండమైన పాలన అందించి, ప్రజల మన్ననలు, ఆశీస్సులు పొందాల్సింది పోయి.. పాలన మొదలైనప్పటి నుంచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఎన్నడూ, ఎక్కడా చూడలేదని, పాలనంతా అబద్ధాలు మోసాలేనని నిప్పులు చెరిగారు.
తన పార్టీ వాళ్లను పరామర్శించడానికి వస్తే తప్పేముందని, ఇన్ని ఆంక్షలేంటని నిలదీశారు. గురువారం ఆయన నెల్లూరు పర్యటనలో తొలుత అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి, ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
వారింట్లో జరిగిన దారుణ విధ్వంసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితులు, అనేక ఘటనలు ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లకు కడుతున్నాయన్నారు. ‘నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఇంతగా భయపడుతున్నందుకు చంద్రబాబు బావిలో దూకాలి. ప్రతిపక్ష నాయకుడిని చూసేందుకు వస్తున్న ఆయన అభిమానులను ఆపడం కోసం, ప్రజలను ఆపడం కోసం రోడ్లను తవ్విన చరిత్ర ఒక్క చంద్రబాబునాయుడికే దక్కుతుంది.
ఈ రోజు 2 వేలకు పైగా పోలీసులు, లెక్కలేనంత మంది డీఎస్పీలను పెట్టారు. డీఐజీ కూడా ఇక్కడే తిష్ట వేశాడట. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు.. నా అభిమానులను ఆపడం కోసం వారంతా పని చేస్తున్నారు’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
గొంతు నొక్కేందుకే రెడ్‌బుక్
⇒ వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి. స్కూళ్లు నాశనం అయిపోయాయి. విద్యా దీవెన, వసతి దీవెన లేదు. ఆరు క్వార్టర్ల విద్యా దీవెన పెండింగ్. ఫీజులు అందడం లేదు. దాంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. నాడు–నేడు ఆగిపోయింది. నాడు గోరుముద్ద పేరుతో రోజుకో మెనూతో పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇచ్చాం. ఈ రోజు స్కూళ్లలో తిండి తినడానికి పిల్లలు భయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది.
⇒ మా ప్రభుత్వ హయాంలో ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ క్లాసులు పెడితే వాటిని ఎత్తేశారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెలకు రూ.300 కోట్లు కావాలి. దాదాపు రూ.4,200 కోట్లు బకాయి పెట్టాడు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులు వైద్య సేవలు అందించడం లేదు.
⇒ ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా లేదు. రైతులకు పెట్టుబడి సాయం లేదు. వారికి రైతు భరోసా అందడం లేదు. దాన్ని చంద్రబాబు ఖూనీ చేశారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అన్నట్లుగా వ్యవసాయం మారింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లూ మోసాలయ్యాయి. జగ¯Œ పథకాలన్నీ రద్దు చేయడంతో పేదలు అల్లాడుతున్నారు. ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోలేక, వారు ప్రశ్నిస్తే ఆ గొంతును నొక్కడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ రెడ్‌బుక్ రాజ్యాంగం.
వైఎస్సార్‌సీపీ అభిమానులపై లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు.. కిందపడిపోయిన మహిళ
వీటికేం చెబుతారు?
⇒ చంద్రబాబూ.. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడారో చూడండి. నిన్నగాక మొన్న నగరిలో మాజీ మంత్రి రోజమ్మ గురించి మీ ఎమ్మెల్యే ఎంత హేయంగా మాట్లాడారు? ఎంత నీచంగా మాట్లాడారు? చెప్పడానికి సిగ్గు పడేలా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారు?
⇒ మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కారుపై ఎంత దారుణంగా దాడి చేశారు? కారులో ఆమె, ఆమె భర్త ఉండగానే వారిని తిడుతూ దాడి చేయడాన్ని ఏమంటారు? కారు అద్దాలు పగలగొట్టారు. కర్రలతో దాడి చేసి, దుర్భాషలాడారు. అన్యాయంగా తిట్టారు. దానికి మీ డిక్షనరీలో అర్థం ఏమిటి? మా మాజీ మంత్రి రజినమ్మపై ఎంత దారుణంగా మాట్లాడారు? దానికి ఏం చెబుతారు?
అంతులేని అవినీతి, ఎక్కడికక్కడ దోపిడీ
⇒ రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలుసు. అంతటా లిక్కర్ మాఫియా. ఎక్కడ చూసినా, ఆ ప్రాంత ఎమ్మెల్యేలే అందులో ఉంటున్నారు. వారే అక్కడ లిక్కర్ మాఫియా బాస్‌గా ఉన్నారు. వేలం పాట పాడి మరీ బెల్టు షాప్‌లు కేటాయిస్తున్నారు. అక్కడ ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఇల్లీగల్ పర్మిట్ రూమ్‌లతో లిక్కర్ అమ్ముతున్నారు. డీఐజీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు.. ఇలా లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అంటూ పంచుకుంటున్నారు.
⇒ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇదే నెల్లూరు జిల్లాలో సిలికా, క్వార్ట్ ్జ యథేచ్చగా దోచుకుంటున్నారు. సిలికా ఓనర్లంతా కోర్టుకెళ్లారు. ఇక్కడ లోకల్ లీడర్ వీపీఆర్ (వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి) ద్వారానే సిలికా అమ్మాలంట! ఎవరికీ కూడా మైనింగ్ పర్మిట్ ఇవ్వడం లేదు. ఇందులో నారా లోకేశ్, చంద్రబాబుకు వీపీఆర్ లంచాలు పంపిస్తున్నాడు. ప్రతి మై¯Œన్‌లో కూడా ఎమ్మెల్యేను కలవాలి. కొంత పోలీసులకు ఇవ్వాలి.

⇒ ఏ నియోజకవర్గంలో చూసినా విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే పేకాట క్లబ్‌లకే కోటి రూపాయలు ఇస్తున్నారు. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఎమ్మెల్యేకు, పోలీసులకు డబ్బు ఇవ్వాల్సిందే. లేదంటే ఎమ్మెల్యే మనుషులను పంపించి పరిశ్రమల ఉత్పత్తి ఆపేస్తున్నారు. రాష్ట్రంలో ఈ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ఎవరూ మాట్లాడకూడదు.
ఇంకా విచ్చలవిడిగా భూములను పప్పు బెల్లాలకు అమ్మినట్లు.. ఏకంగా 30 ఏళ్లు, 40 ఏళ్లు కాంట్రాక్ట్ అంటూ రూపాయికే ఎకరం భూమి కట్టబెడుతున్నారు. మా హయాంలో యూనిట్ విద్యుత్‌ను రూ.2.47తో కొనుగోలు చేస్తే.. ఇదే మనుషులు నానా రచ్చ చేశారు. వీరేమో రూ.4.50తో కొనుగోలు చేస్తున్నారు.
మీ విత్తనమే రేపు వృక్షం అవుతుంది..
⇒ అయ్యా చంద్రబాబూ.. నీవు ఒక తప్పుడు సంప్రదాయానికి విత్తనం విత్తుతున్నావు. ఇదే విత్తనం రేపు పొద్దున వృక్షం అవుతుంది. నీవు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. ఎల్లకాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు. మరో మూడేళ్ల తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. అప్పుడు ఇదే చంద్రబాబు, ఆయన అడుగులకు మడుగులొత్తిన తప్పుడు అధికారులు.. ఎవరైతే అన్యాయాలు చేశారో, తప్పులు చేశారో అందరి లెక్కలు తీస్తాం. అందరినీ చట్టం ముందు నిలబెడతాం. మీరు విత్తిన విత్తనం మాదిరిగానే రెండింతలుగా మీకు రాబోయే రోజుల్లో జరుగుతుంది.
⇒ ఇప్పటికైనా మేలుకోమని చెబుతున్నా. మీ నైజం, మీ వైఖరి మార్చుకోమని కోరుతున్నా. అలా చేయకపోతే రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం కచ్చితంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చంద్రబాబుకు, ఆయన అడుగులకు మడుగులొత్తే అధికారులందరికీ చెబుతున్నాను.
⇒ కొంత మంది అధికారులు రిటైర్ అవుతాం.. లేదా వీఆర్‌ఎస్ తీసుకొని విదేశాలకు వెళ్తామని అనుకోవచ్చు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా వదలి పెట్టం. ప్రతి ఒక్కరినీ పిలిపించి, మీరు చేసిన ప్రతి పనికి సంబంధించి చట్టం ముందు నిలబెడతాం. తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడేలా అడుగులు పడతాయి.మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రసన్న ఇంటిపై దాడి చేసి.. ఆయనపైనే కేసా?
నా పక్కనే ఉన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే. రాష్ట్రంలో ఎవరైనా ప్రెస్ స్టేట్‌మెంట్లు ఇస్తారు. ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే ఎదుటి వారు విమర్శిస్తారు. ప్రజాస్వామ్యంలో అది ఎప్పుడూ చూస్తుంటాం. కానీ, గతంలో ఏనాడూ జరగని విధంగా, మనుషులను చంపడానికి ఏకంగా 80–100 మందిని ప్రసన్న ఇంటి మీదకు పంపించారు.
వారంతా తప్ప తాగి రాడ్లతో, కర్రలు, మారణాయుధాలతో ఇంటిపై దాడి చేశారు. కారును తిప్పి పడేశారు. ఇంట్లో మొత్తం ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి.. 83 ఏళ్ల మహిళనూ బెదిరించారు. ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో ఉండి ఉంటే, ఆయన్ను చంపేసి ఉండేవారు. ఇంతగా దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ చూడలేదు.
కాకాణిపై చిత్ర విచిత్ర కేసులు
⇒ నా పక్కనే గోవర్ధన్‌రెడ్డి కూతురు ఉంది. ఏం తప్పు చేశాడని గోవర్ధన్‌రెడ్డిని జైల్లో పెట్టారు. ఆయనపై ఏకంగా 14 కేసులు పెట్టారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెడుతున్నారు. ఆయన్ను 64 రోజులుగా జైల్లో ఉంచారు. ఆయన మీద ఎంత అన్యాయమైన కేసులు పెట్టారో ఒక్కసారి చూడండి. ఆయన ఇక్కడ పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టాడు. ఆయన న్యూస్ ఐటెమ్ మీడియాలో వస్తే, దాన్ని వాట్సప్‌లో ఫార్వార్డ్ చేస్తే, అది కేసు.
⇒ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెడితే, దానికి సంబంధించిన వీడియోను ఫార్వార్డ్ చేశాడని మరో కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీ ఉచిత ఇసుక అని చెప్పింది. కానీ ఉచితంగా ఎక్కడిస్తున్నారు? మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరో వైపు ఉచిత ఇసుక ఇవ్వడం లేదు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేస్తే, దానికి గోవర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపారని మరో కేసు పెట్టారు. ఎంత దారుణం?
⇒ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శేషయ్య మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే, దాన్ని నిరసిస్తూ గోవర్ధన్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే, పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడాడని కేసు పెట్టారు. ఇది ఎంత దారుణం? కావలి నియోజకవర్గం కోళ్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వారు దాడులు చేస్తే, బాధితులను పరామర్శించి, పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టితే దానిపైనా కేసు పెట్టారు.
⇒ 2024 ఎన్నికల సమయంలో లిక్కర్ పంచారని కేసు పెట్టారు. నిజానికి అప్పుడు రాష్ట్రం ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ఉంది. వారి ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. అప్పుడు పెట్టిన కేసుకు సంబంధించి, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక, దర్యాప్తు పూర్తి చేసి, చార్జ్‌షీట్ కూడా వేశారు. ఏడాది తర్వాత తప్పుడు వాంగ్మూలాలతో మళ్లీ చార్జ్‌షీట్‌లోకి వెళ్లి, గోవర్ధన్‌రెడ్డిని ఇరికిస్తున్నారు. ఎంత దారుణం? ఇది ప్రజాస్వామ్యమేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?
⇒ అక్రమంగా క్వార్ట్ ్జతవ్వకాలు జరిపారని కేసు పెట్టారు. ఆయన ఒక మంత్రిగా పని చేశారు. ఆ కేసులో పస లేదని కోర్టు నిర్ధారించి, ఆ కేసులో ఏ–1, ఏ–2, ఏ–3కి ముందస్తు బెయిల్ ఇచ్చారు. అలాంటి కేసులో గోవర్ధన్‌రెడ్డి ఏ–4. కానీ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వకుండా జైల్లో పెట్టారు. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ చూస్తే.. అందులో ఇక్కడ తాటిపర్తి అనే గ్రామంలో ఎలాంటి క్వారీ తవ్వకాలు గత నాలుగేళ్లుగా జరగడం లేదని వీఆర్వో సిద్ధం పుల్లయ్య చెప్పాడని ఆ రిపోర్టులో రాశారు. దీంతో ఆ కేసులో పస లేదని, ఏకంగా మైనింగ్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. చంద్రబాబునాయుడిలో శాడిజమ్ అనేది ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు.
⇒ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనే ఎంపీ.. ఆయనకు తెలియకుండా ఎవరో ఫోర్జరీ సంతకాలు పెట్టి, చట్టవిరుద్ధంగా మైనింగ్ చేశాడని మా ప్రభుత్వ హయాంలోనే కేసు పెట్టి, ఎఫ్‌ఐఆర్ చేశాం. ఆ ఫోర్జరీ చేసిన వ్యక్తి చవ్వా చంద్రబాబునాయుడు. ఆయన టీడీపీకి చెందిన వ్యక్తి. కానీ ఆయన మీద కేసు పెట్టకుండా, కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించారు. అప్పుడు మేము పెట్టిన కేసుకు సంబం«ధించి, మీరు వచ్చాక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి, చవ్వా చంద్రబాబునాయుడిపై కేసు పెట్టకుండా, ఆయన సాక్ష్యంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీద కేసు పెట్టడం ఏమిటి? ఎంత దారుణం?
⇒ గోవర్ధన్‌రెడ్డి అన్న ఇల్లు రూ.100 కోట్ల రాజ భవనం అని తప్పుడు ఆరోపణలు చేశారు. మరి అదే ఈ ప్రభుత్వంలో ఇచ్చిన విజిలెన్స్ రిపోర్టులో ఆ ఇంటి విలువ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఇలాంటివి మొత్తం 14 కేసులు పెట్టారు. ఒక కేసులో బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు పెడుతున్నారు.
మీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను కూడా పంపించి ఇప్పుడు మీరు చేస్తున్న మాదిరిగా దాడి చేయించే కార్యక్రమం మొదలు పెడితే రేప్పొద్దున రాజ్యాంగం బతుకుతుందా? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉంటుందా? చంద్రబాబూ.. నీవు చేస్తున్న పనులకు, నీవు వేస్తున్న బీజాలకు సిగ్గుతో తల దించుకోవాలి. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఇటు వైపు, అటు వైపు స్టేట్‌మెంట్లు ఇచ్చుకోవచ్చు. అవి నచ్చకపోతే, ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అత్యంత హేయం.
వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసుల పర్వం
⇒ ఇన్ని జరుగుతున్నా ప్రజల తరఫున ఏ గొంతూ వినిపించకూడదని ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకు పంపించారు. ఎంపీగా పని చేసిన దళిత నేత నందిగం సురేష్‌ను 190 రోజులు జైల్లో పెట్టారు. మంత్రిగా పని చేసిన బీసీ నాయకుడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను జైలుకు పంపించారు. వల్లభనేని వంశీని ఒక కేసు అయిన తర్వాత మరో కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు.
⇒ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కాలేజీలో కలిసి చదువుకున్నప్పుడు.. చంద్రబాబును చెప్పుతో కొట్టాడని చెప్పి, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డిని జైలుకు పంపించాడు. చిన్నప్పుడు జరిగిన ఘటనను గుర్తు పెట్టుకొని ఎంత శాడిస్ట్‌గా వ్యవహరించాడో గమనించాలి. ఇన్నేళ్ల తర్వాత పెద్దిరెడ్డన్న కొడుకును జైల్లో పెట్టించాడంటే ఈ మనిషిలో విషం, రాక్షసత్వం ఎంతగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
⇒ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చేసిన తప్పు ఏంటో తెలియదు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యే కావడమే ఆయన చేసిన పాపం అన్నట్లుగా జైల్లో పెట్టించారు. ఇదే చంద్రబాబు 1983లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి పోటీ చేసి 17 వేల మెజారిటీతో ఓడిపోయారు. మళ్లీ 1989లో మామ కాళ్లు పట్టుకొని టీడీపీలో చేరి కుప్పం నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి తన చేతుల్లో నుంచి జారిపోయిందని భాస్కర్‌ను వేధించడం మొదలు పెట్టాడు. చివరకు భాస్కర్ కొడుకు మొన్ననే లండన్ నుంచి వచ్చాడు. ఆ పిల్లోడిపై కూడా కేసు పెట్టాడు.
⇒ మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పేర్ని నాని భార్యపై కూడా కేసులు పెట్టి చిత్రహింసలే. అనిల్ కుమార్ యాదవ్‌ను కూడా దొంగ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే.. ఆ కేసుల్లో దొంగ స్టేట్‌మెంట్లు తీసుకున్నారని సాక్షి.. జడ్జి ముందు చెప్పాడంటే ఎంత దారుణంగా దొంగ కేసులు పెడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది.
⇒ మరో బీసీ నాయకుడు జోగి రమేష్, మా పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్‌రెడ్డిని కూడా వదలడం లేదు. వేధిస్తున్నారు. మా పార్టీ మరో సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఆయన కొడుకు విక్రాంత్రెడ్డినీ వదలడం లేదు. దేవినేని అవినాష్, తలశిల రఘురాం, అంబటి రాంబాబు, అంబటి మురళి, విడదల రజిని, దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్, మరో ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దాడిశెట్టి రాజా, అబ్బయ్య చౌదరి, గోరంట్ల మాధవ్, సుధీర్, లేళ్ల అప్పిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పాల రాము, మొండితోక అరుణ్, ఇలా నాయకులందరిపై తప్పుడు కేసులు పెట్టారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డిపైనా తప్పుడు కేసులు పెట్టారు. ఇవి కాకుండా తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వారినీ వదలకుండా వేల కేసులు పెట్టి వేధిస్తున్నారు.
ధైర్యంగా ఉండండి..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ములాఖత్ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. సుమారు అరగంట పాటు కాకాణితో ములాఖత్ అయ్యారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే 14 అక్రమ కేసులు నమోదు చేసిన విషయంపై చర్చించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని కాకాణికి సూచించారు. జగన్ వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిలు ఉన్నారు. అనంతరం సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి జగన్ చేరుకున్నారు.
మీకు మరో కొడుకుగా నేనున్నా..
‘అధికార కూటమి నేతల దాడులకు భయపడాల్సిన పని లేదు. మీకు మరో కొడుకు లాగా అండగా ఉంటాను. ధైర్యంగా ఉండండి’ అంటూ వైఎస్ జగన్.. ప్రసన్నకుమార్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా పలకరించారు. టీడీపీ రౌడీ మూకలు సాగించిన విధ్వంసంపై, ఆనాటి పరిస్థితులను ప్రసన్నను, ఆయన తల్లిని అడిగి తెలుసుకున్నారు.
ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. వారు ఆ రోజు జరిగిన ఘటనను పూసగుచ్చినట్లు వివరించడంతో వైఎస్ జగన్ చలించిపోయారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు.
కేవలం విమర్శలను తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన రౌడీలు ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికం అన్నారు. విధ్వంసం జరిగి ఇన్ని రోజులైనా పోలీసులు ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం సిగ్గు చేటన్నారు. రానున్న రోజుల్లో తప్పు చేసిన వారెవరినీ వదిలే ప్రసక్తే లేదని ప్రసన్న కుటుంబానికి భరోసా ఇచ్చారు.