బాతులను మేపేందుకు వెళ్లి మృత్యువాత
ముత్తుకూరు(పొదలకూరు): బాతులను మేపేందుకు వెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో చెరువులోకి దిగి మృతిచెందిన ఘటన మండలంలోని వల్లూరులో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. తోటపల్లిగూడూరు మండలం సౌత్‌ఆములూరు గ్రామానికి చెందిన ఉప్పు మస్తాన్(45) ముత్తుకూరు మండలం వల్లూరు చెరువు వద్ద బాతులను మేపేందుకు వచ్చారు. ఈ క్రమంలో మద్యం సేవించిన మస్తాన్ బాతులను తోలుకుని రావడానికి చెరువు నీళ్లలోకి దిగి ఊపిరాడక మృతి చెందాడు. తల్లి వెంకమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని మహిళ మృతి
నెల్లూరు (క్రైమ్): రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతిచెందిన ఘటన వేదాయపాళెం రైల్వేగేటు వద్ద శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. వేదాయపాళెం రైల్వేగేటు వద్ద రైలు రానున్న నేపథ్యంలో గేటు వేశారు. ఈ క్రమంలో ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించే సమయంలో రైలు రావడాన్ని గుర్తించలేదు. దీంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో కొంతదూరంలో ఆమె ఎగిరిపడింది. దీంతో తీవ్రగాయాలైన మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్సై ఎన్.హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో బోల్తా
● మహిళ మృతి
గూడూరురూరల్: మండలంలోని తిరువెంగళాయపల్లి సమీపంలో శనివారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ మృతిచెందింది. రూరల్ ఎస్సై తిరుపతయ్య వివరాల మేరకు.. మండలంలోని చెంబడిపాళెం గ్రామానికి చెందిన పొట్టేళ్ల కృష్ణమ్మ(34), మరికొంతమందితో కలిసి గొల్లపల్లి సమీపంలో పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణమ్మను గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కూలి పనులకెళ్లి జీవనం సాగిస్తున్న కృష్ణమ్మ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.
బాతులను మేపేందుకు వెళ్లి మృత్యువాత


