ఆటో డ్రైవర్‌ నిజాయితీ | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ నిజాయితీ

Feb 22 2026 7:04 AM | Updated on Feb 22 2026 7:04 AM

ఆటో డ్రైవర్‌ నిజాయితీ

ఆటో డ్రైవర్‌ నిజాయితీ

15 సవర్ల బంగారం,

రూ.10 వేల నగదు బ్యాగ్‌ అప్పగింత

ఆత్మకూరు: బంగారం, నగదు దొరికితే గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టుకునే రోజుల్లో సుమారు రూ.15 లక్షల విలువ గల బంగారు నగలు, రూ.10 వేల నగదుతో ఉన్న బ్యాగ్‌ను అప్పగించి ఓ ఆటో డ్రైవర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఎస్సైలు జిలానీ, బి.సాయిప్రసాద్‌లతో సీఐ జి.గంగాధర్‌ శనివారం వివరాలు వెల్లడించారు. మురగళ్లకు చెందిన ఆటో డ్రైవర్‌ రమణయ్య గ్రామం నుంచి పలువురు ప్రయాణికులతో ఆత్మకూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో శివాలయం వద్ద దాసరి అమృతలక్ష్మి ఆటోను ఎక్కి ఆత్మకూరులోని బస్టాండ్‌ వద్ద దిగింది. ఈ క్రమంలో నెల్లూరుకు అప్పుడే బస్సు బయలుదేరుతుండడంతో ఓ బ్యాగ్‌ను ఆటోలో మరిచి మిగిలిన రెండు బ్యాగ్‌లతో వెళ్లిపోయింది. కొద్దిసేపటికి రమణయ్య ఆటో సీటులో ఉన్న బ్యాగ్‌ను గమనించి పరిశీలించగా బంగారు నగలు, నగదు అందులో ఉన్నాయి. దీంతో కొద్దిసేపు ఎదురుచూడగా ఎవరూ రాకపోవడంతో తనకు మరో బాడుగ రావడంతో సమీపంలో ఉన్న తనకు తెలిసిన దుకాణంలో ఆ బ్యాగ్‌ను అప్పగించి ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని చెప్పి వెళ్లాడు. ఈ నేపథ్యంలో అమృతలక్ష్మి బస్సులో నెల్లూరుపాళెం దాటిన తర్వాత బ్యాగును పోగొట్టుకున్న విషయం తెలుసుకుని ఆత్మకూరుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఆటోను గుర్తించారు. అతని నంబర్‌ తెలుసుకుని ఫోన్‌ చేయగా తనకు బ్యాగ్‌ దొరికిందని, దుకాణంలో అప్పగించిన విషయం చెప్పి కొద్దిసేపట్లోనే ఆ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు. నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్‌ రమణయ్యను పోలీసులు అభినందించారు. కేసును గంటల వ్యవధిలో ఛేదించిన ఎస్సైలను, ఐడీ పార్టీ సిబ్బందిని ఎస్పీ అజితా, డీఎస్పీ వేణుగోపాల్‌లు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement