అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు | - | Sakshi
Sakshi News home page

అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు

Feb 22 2026 7:03 AM | Updated on Feb 22 2026 7:03 AM

అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు

అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు

ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మనుబోలు: ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలిన సోమిరెడ్డి.. అవినీతిలో మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని బద్దెవోలు, తోటపల్లిగూడూరు మండలం పేడూరులో శనివారం పర్యటించిన ఆయన మాట్లాడారు. ఓవైపు సాగునీరు, యూరియా అందక రైతులు అష్టకష్టాలు పడుతుంటే, సోమిరెడ్డి మాత్రం దొంగ బిల్లులు చేసుకుంటూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాగితాలపూరులో సాగునీరందక పంటలు ఎండిపోతుంటే, ఆయన మాత్రం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు లిఫ్ట్‌ ద్వారా అందిస్తామంటూ మరో రకంగా అవినీతికి పాల్పడేందుకు తెరలేపారని ఆరోపించారు. టీడీపీ పాలనలో కాలం చెల్లిన విత్తనాలను సరఫరా చేయడంతో అవి మొలకెత్తక కర్షకులు ఇక్కట్ల పాలయ్యారని విమర్శించారు. రైతులను పూర్తిగా గాలికొదిలిన సర్కార్‌.. వ్యవసాయమంటే దండగనే రీతిలో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జగనన్న పాలనలో రైతులకు అన్ని సమకూర్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మారిస్తే.. ప్రస్తుతం వారు ఘోర అవమానాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధాన్యానికి కనీస మద్దతు ధరను కల్పించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అన్నదాతలను మభ్యపెట్టాలని చూస్తే తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జగనన్న పాలనే కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలెప్పుడు జరిగినా తమ పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమని పేర్కొన్నారు. బద్దెవోలులో పార్టీ నేత, సర్పంచ్‌ ఉగ్గుమూడి శశికుమార్‌రెడ్డి తండ్రి రామిరెడ్డి మరణించడంతో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి వెంకటసుదీప్‌ కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, గుండాల ఆదినారాయణ, జానకిరామిరెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, ముంగర రవీంద్రరెడ్డి, గుంజి రమేష్‌, దాసరి భాస్కర్‌గౌడ్‌, గోపీనాథ్‌రెడ్డి, ఆవుల తులసీరామ్‌, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement