'బాబు ష్యూరిటీ'.. ఇంటింటికీ వంచన | YS Jagan Starts Chandrababu Govt Cheating QR Code Campaign | Sakshi
Sakshi News home page

'బాబు ష్యూరిటీ'.. ఇంటింటికీ వంచన

Jun 26 2025 5:05 AM | Updated on Jun 26 2025 8:08 AM

YS Jagan Starts Chandrababu Govt Cheating QR Code Campaign

‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమం క్యూఆర్‌ కోడ్‌ను చూపిస్తున్న వైఎస్‌ జగన్‌

‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’పై గ్రామ గ్రామాన, ఇంటింటా ప్రచారం 

‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో 5 వారాల బృహత్తర కార్యక్రమం

పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పిలుపు

గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సింది ఎప్పుడిస్తారని టీడీపీ నేతలు వచ్చినప్పుడు అడగండి 

మీరు ఈ పథకాలకు అర్హత సాధించారు.. 

మీ కుటుంబానికి ఇంత వస్తుందని నాడు ఇంటింటికీ బాండ్లు 

2024 జూన్‌ నుంచే ఆ మేరకు మీ ఖాతాలో జమ అవుతుందని చెప్పారు

త్రికరణ శుద్ధిగా ఇస్తామంటూ సంతకాలతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణం 

హామీల్లో రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదు 

ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చంద్రబాబు మేనిఫెస్టో వస్తుంది 

ఇంటింటికీ సంతకాలతో పంపించిన బాండ్లూ కనిపిస్తాయి 

ఆ బాండ్లపై నాడు వారు చేసిన ప్రమాణం.. ప్రతిజ్ఞ కనిపిస్తుంది 

మీ కుటుంబానికి ఎంత రావాలో లెక్కేసుకుని సిద్ధంగా ఉండండి 

మేనిఫెస్టోలోని ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేయడంపై నిలదీయండి 

బాబు మోసాలపై గ్రామ గ్రామాన, ఇంటింటా విస్తృతంగా ప్రచారం జరగాలి

చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే.. ప్రజాగళం.. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి(పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్‌ పంపారు. ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే గత ఏడాది వడ్డీతో సహా బాకీ, ఈ ఏడాది ఇవ్వాల్సింది ఎప్పుడిస్తారని నిలదీయండి.

ఏడాది గడిచింది. హనీమూన్‌ పీరియడ్‌ ముగిసింది. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే. కాబట్టి అందరినీ కలుపుకొనిపోవాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వాటిపై పోరాడాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. అప్పుడే మనం సత్తా చూపగలం. ఎందుకంటే ఇది రాక్షస రాజ్యం. ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కలెక్టర్ల దగ్గరకు పోయినా, ప్రయోజనం ఉండడం లేదు. కాబట్టి, మనం ప్రతి చోటా, ప్రతి క్షణం ప్రజలతో కలిసి వారి కోసం పని చేయాలి.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఇంటింటికీ ఆ హామీలను అమలు చేస్తానంటూ సంతకాలతో పంపించిన బాండ్లు గుర్తు చేస్తూ.. వాటిని ఏ మాత్రం అమలు చేయని చంద్రబాబు మోసాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. దాని వల్ల ప్రతి కుటుంబం ఎంతెంత నష్టపోయింది? ఇంకా ఎంత నష్టపోతోంది? అన్న విషయాలపై అందరికీ అవగాహన కల్పించేలా ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ (చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..) పేరుతో ఐదు వారాల బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. 

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, పార్టీ జిల్లా అధ్యక్షులతోపాటు పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు పాల్గొన్నారు. 

‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ కార్యక్రమానికి సంబంధించి సమావేశంలో క్యూఆర్‌ కోడ్‌ను ఆవిష్కరించి.. రాష్ట్రంలో ఇంటింటికీ దాన్ని చేర్చే కార్యక్రమాన్ని వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై విస్తృతంగా చర్చించి, పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌. 

ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు
రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం పూర్తయింది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడూ లేదు. ఇంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా ప్యతిరేకత ఈ ప్రభుత్వంపై కనిపిస్తోంది. చంద్రబాబునాయుడు ఈ వ్యతిరేకత మ«ధ్య, ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో డైవర్షన్‌ పాలిటిక్స్‌తో పాటు, అణిచివేత చూస్తున్నాం. రెడ్‌బుక్‌ పాలన చూస్తున్నాం. 

ఈ నేపథ్యంలో రెండు ప్రభుత్వాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మన ఐదేళ్ల పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా పథకాలు అందించాం. ఎవరు, ఏ పార్టీ అని చూడకుండా మంచి చేశాం. కానీ, కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో కనిపిస్తోంది ఏమిటంటే.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తున్న పరిస్థితులు మాత్రమే. 

మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్‌ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చేసి చూపాం. కానీ, చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.  
 


చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యవంతం చేయండి 
ఈ సంవత్సరంలో చంద్రబాబు పాలనతో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతుంది. మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎంతెంత ప్రయోజనాలు అందేవి అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలి. చంద్రబాబు ఇచ్చిన హామీల రిబ్బన్‌ కూడా కట్‌ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నాడు. 

ఎవరైనా ప్రశ్నిస్తే, నాలుక మందం అంటున్నాడు. అసలు చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు? ఇంటింటికీ బాండ్లు పంపించి ఎలా నమ్మించాడు? ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు? వీటన్నింటిపై గ్రామ గ్రామాన తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు.. ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’. అదే తెలుగులో.. ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరణ జరిగింది.

చంద్రబాబు పచ్చి మోసాలను వివరించడమే లక్ష్యం
చంద్రబాబు పచ్చి మోసాలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే.. ప్రజాగళం.. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు వస్తాయి. చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత? ఇక ఈ ఏడాది రావాల్సిన మొత్తం ఎంత? అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి (పథకాల వారీగా) నెలకు ఎంతెంత చొప్పున, ఏడాదికి ఎంత వస్తుంది.. అలా ఐదేళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది.. అని చెబుతూ సంతకాలు చేసి మరీ ప్రతి ఇంటికి బాండ్‌ పంపారు. 

ఈ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, ఆ వివరాలన్నీ తీసి రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది బాకీ వడ్డీతో సహా.. ఈ ఏడాది ఇంకా ఎంత రావాలో.. అది ఎప్పుడు ఇస్తారో అడగండి. ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పారన్నది పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నారన్నది ప్రస్తావించాలి. 

ఇంకా రైతు భరోసా మొదలు ఉచిత బస్సు వరకు అమలు కాకపోవడంపై ఇటీవల నా ప్రెస్‌ కాన్ఫరె­న్స్‌లోని మాటలు.. పక్కనే చంద్రబాబు­నాయుడి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చంద్రబాబు దగా, మోసాలపై ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని మీరంతా బాగా పని చేసి విజయవంతం చేశారు. అందుకు మీ అందరికీ నా అభినందనలు. మొన్నటి యువత పోరు కార్యక్రమం కూడా బాగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేసిన వారికి కూడా నా అభినందనలు.  

జగన్‌ చేస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానన్నాడు
ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్‌ చేస్తున్నవే కాకుండా.. అంతకు మించి ఇస్తానన్నాడు. జగన్‌కన్నా ఎక్కువ చేస్తానన్నాడు. ఆ మాటలు చెప్పడమే కాకుండా, ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలను పంపించి.. ఆ కుటుంబం వద్దనే వారు కూర్చుని, మిస్డ్‌ కాల్‌ ఇప్పించారు. దాంతో ఓటీపీ కూడా ఇప్పించారు. 

దాన్ని ఎంటర్‌ చేయగానే, ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది. దాని వల్ల ఎంతెంత వస్తుంది? ఐదేళ్లలో మొత్తం ఎంత వస్తుంది? అన్న పూర్తి గణాంకాలతో కూడిన బాండ్‌ కూడా ఇప్పించారు. ఆ బాండ్‌పై ఏమని ఉందంటే.. ‘చంద్రబాబునాయుడు అనే నేను, మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాను. 

2024లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను..’ అని ఉంది. ఇంకా వాటిపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఫొటోలు, సంతకాలు కూడా ఉన్నాయి. ఏయే పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుంది.. అంటూ ఆ కుటుంబంలో సభ్యులు, పథకాల వల్ల వారికి ఏడాదికి, అయిదేళ్లకు అందే నగదు వివరాలను కూడా వివరించారు.
సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు  

ప్రలోభాలు.. పచ్చి మోసంపై నిలదీయండి
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి.. ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్‌ నుంచే ఆ మొత్తం అందుతుంది.. అంటూ బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్‌ చేయాలి. మాకు జూన్‌ 2024 నుంచి ఇస్తామన్నావు. కానీ ఇవ్వలేదు. మీరు చెప్పినదాని ప్రకారమే మాకు ఇంత బాకీ ఉన్నావు. మరి ఈ ఏడాది ఎప్పుడిస్తు­న్నావు?అంటూ ప్రజలు చంద్రబాబును నిలదీయాలి.

⇒ అలా బాండ్లు ఇచ్చి కూడా అన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు, మరో వైపు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఇప్పటికి ఆరు త్రైమాసికాలు పెండింగ్‌. ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.4,200 కోట్లు. కానీ ఇచ్చింది కేవలం రూ.750 కోట్లు. మరో వైపు వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు చొప్పున రెండేళ్లకు రూ.2,200 కోట్లు పెండింగ్‌. 

⇒ ఇంకా ఆరోగ్యశ్రీ. ఈ పథకం కోసం నెలకు రూ.300 కోట్లు అవసరం. అలా ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా, నేతన్న నేస్తం.. ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం మొత్తం తిరోగమనం. ఎక్కడా పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్‌పుట్‌ సబ్సిడీ లేనే లేదు.

ఐదు వారాల కార్యక్రమం
వీటన్నింటి మధ్య.. మనం రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో.. అదే తెలుగులో ‘చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ.. అనే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఐదు వారాల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తొలుత జిల్లా స్థాయిలో పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశంలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తారు. ఆ తర్వాత రెండు బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో, బాండ్లు వస్తాయి. 

మరో బటన్‌ నొక్కితే, ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. ఆ స్కాన్‌ ఎలా చేయాలో వారు చూపుతారు. రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరణ.. ఆ స్థాయి నాయకుల ప్రెస్‌ కాన్ఫరెన్స్‌. నాలుగో దశలో గ్రామ స్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్‌వాల్వ్‌ చేయాలి. ఈ ప్రక్రియలో ఎక్కడైనా మండల, గ్రామ కమిటీల ఏర్పాటు అప్పటికి పూర్తి కాకపోయి ఉంటే.. దాన్నీ పూర్తి చేయాలి.

అందమైన అబద్ధంతో దగా
– కురసాల కన్నబాబు, మాజీ మంత్రి
క్యూఆర్‌ కోడ్, ఆ స్కానింగ్‌.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం తదితర అంశాలను వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. గ్రామాల్లో రచ్చబండ నిర్వహించడం ద్వారా, ఇంటింటా ఈ కార్యక్రమం చేయాలన్నారు. ఈ రోజు ఇక్కడ మొదలైన ఈ కార్యక్రమం ఐదు వారాల్లోగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ చేరాలని కోరారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ.. అంటూ ఒక అందమైన అబద్ధాన్ని సృష్టించి, ప్రచారం చేసి, ప్రజలను పచ్చి దగా చేస్తూ, అందంగా మోసగించిన విధానాన్ని ఇంటింటా వివరించాలన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement