నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..? | Fake liquor Mafia gets organized after Chandrababu coalition comes to power | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..?

Oct 12 2025 5:19 AM | Updated on Oct 12 2025 5:22 AM

Fake liquor Mafia gets organized after Chandrababu coalition comes to power

కీలక నిందితుడు సురేంద్రనాయుడుకు ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు 

అందుకే జంట హత్యల కేసులో.. 2014 తర్వాత జీవిత ఖైదు నుంచి క్షమాభిక్ష

2024లో సీనియర్లను కాదని జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ ఇచ్చింది ఎవరు? 

తూతూమంత్రం సస్పెన్షన్‌ తప్ప ఇప్పటివరకు అరెస్టు చేయలేదు ఎందుకు?.. ఏ1 జనార్దన్‌రావు 

అంత ధీమాగా రాష్ట్రానికి రావడానికి కారణం ఎవరు? 

తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న జయచంద్రారెడ్డి 

ఆ ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం దోపిడీ డీల్‌తోనే టీడీపీ టికెట్‌.. ఎన్నికల సమయంలో టీడీపీ పంచింది పూర్తిగా నకిలీమద్యమే! 

కూటమి అధికారంలోకి రాగానే మాఫియా వ్యవస్థీకృతం 

ముఠా కట్టిన జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్‌రావు తదితరులు.. రాష్ట్రస్థాయిలో నెట్‌వర్క్‌.. 

ఐదేళ్లలో రూ.45 వేల కోట్లు దోపిడీ లక్ష్యంగా బరితెగింపు 

కరకట్ట బంగ్లా వాటానే 30 శాతం... అంటే రూ.13,500 కోట్లు 

టీడీపీ సీనియర్లు, సిండికేట్‌కు 50 శాతం... ఇదీ లెక్క 

జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్‌రావుకు 20%  

సాక్షి, అమరావతి: యావజ్జీవ ఖైదీకి క్షమాభిక్ష నుంచి... తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ జయచంద్రారెడ్డికి ఇవ్వడం వరకు... ఏ1 జనార్దనరావు అత్యంత ధీమాగా రాష్ట్రానికి తిరిగిరావడం దాక.. నకిలీ మద్యం కేసులో అనేక ప్రశ్నలు...! వీటికి సమాధానాలు వెదుక్కుంటూ పోతే... కీలక నిందితుడు, టీడీపీ నేత సురేంద్రనాయుడుకు ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు బయటపడుతున్నాయి... జంట హత్యల కేసులో 2014 తర్వాత ఆయనకు జీవిత ఖైదు నుంచి క్షమాభిక్ష దక్కిన విషయం విస్తుగొలుపుతోంది... 2024 ఎన్నికల్లో సీనియర్లను కాదని మరీ తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ను జయచంద్రారెడ్డికి ఇప్పించింది కూడా సురేంద్రనాయుడే అనే స్పష్టం అవుతోంది. ఇంత లోతైన సంబంధాలు ఉన్నందునే... నకిలీ మద్యం వ్యవహారం కుదిపేస్తున్నా... జయచంద్రారెడ్డిపై టీడీపీ నుంచి తూతూమంత్రం సస్పెన్షన్‌ తప్ప ఇప్పటివరకు అరెస్టు చేయలేదని స్పష్టమవుతోంది. వెరసి ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం డీల్‌ డొంక కదులుతోంది.  
...రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నకిలీ మద్యం మాఫియా దందాలో అన్ని వేళ్లూ ముఖ్యనేతవైపే చూపిస్తున్నాయి. భారీ దోపిడీకి తెగించిన ఈ ముఠాలో పాత్రధారులు జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడులు ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులన్నది బహిరంగ రహస్యం.  ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం రాకెట్‌లో జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడుతో ముఖ్యనేతకు ఉన్న ‘క్షమాభిక్ష’ బంధం వారి బాగోతం బయటపెడుతోంది. మొత్తం నకిలీ లిక్కర్‌ మాఫియాకే అది పునాదిగా నిలిచింది. ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లు దోపిడీకి పక్కాగా పన్నిన పన్నాగం అమలులో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేసేంతగా ఎదిగింది.  

ఆఫ్రికాలో డిస్టిలరీల... అవే పునాదిగా 
తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నట్లు జయచంద్రారెడ్డి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఎన్నికల నాటికే నకిలీ మద్యం దందాకు బీజం పడినట్లు స్పష్టమవుతోంది. ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం దోపిడీ డీల్‌తోనే ముఖ్య నేత నుంచి సురేంద్రనాయుడి ద్వారా టీడీపీ టికెట్‌ పొందినట్లు అర్థమవుతోంది. ఇక వీరు కూటమి అధికారంలోకి రాగానే ముఖ్య నేత పూర్తి అండతో మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి,  సురేంద్రనాయుడు, అద్దేపల్లి జనార్దన్‌రావు తదితరులు ముఠా కట్టి తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు నుంచి మొదలు రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం నెట్‌వర్క్‌ ఏర్పాటు చేశారు. అసలు మద్యం ఏదో నకిలీది ఏదో తెలియని స్థాయిలో నకిలీ మద్యం తయారు చేసి పేదలు, మధ్య తరగతి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.  
2024: ఆఫ్రికా నకిలీ మద్యం డీల్‌... జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్‌ 
ముఖ్య నేత ఇచ్చిన క్షమాభిక్షతో దర్జాగా బయటకు వచ్చిన సురేంద్రనాయుడు ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి వైఎస్సార్‌  కడప జిల్లాల్లో టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పారీ్టలో ఆయన చెప్పిందే చెల్లింది. ఈ ప్రభావం ఏస్థాయికి చేరిందంటే 2024 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శంకర్‌యాదవ్‌ను పక్కనపెట్టి మరీ జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ ఇప్పించేవరకు వెళ్లింది. తర్వాత జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, తమ అత్యంత సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్‌తో జట్టు కట్టి ముఖ్యనేతతో ఆఫ్రికా మోడల్‌నకిలీ మద్యం డీల్‌ను కుదిర్చారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేయడం ఐదేళ్లపాటు భారీ దోపిడీకి తెగబడటం... ఇదీ డీల్‌.  

నాడు సిండికేట్‌ దోపిడీ.. నేడు నకిలీ దందా 
2014–19లో టీడీపీ ప్రభుత్వం ఉండగా మద్యం సిండికేట్‌ ద్వారా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. 2024–29లో ఏకంగా నకిలీ మద్యాన్ని అధికారికంగా విక్రయించి అంతకుమించి భారీ దోపిడీకి ముఖ్యనేతలు పన్నాగం పన్నారు. అందుకే సురేంద్రనాయుడు చెప్పినట్టు జయచంద్రారెడ్డికి తొలి జాబితాలోనే తంబళ్లపల్లె టికెట్‌ కేటాయించారు. గమనించాల్సిన విషయం ఏమంటే.. రాయలసీమలో సీనియర్‌ టీడీపీ నేతలకూ మొదటి జాబి­తాలో టికెట్‌ రాలేదు. జయచంద్రారెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దని పలువురు నేతలు, కార్యకర్తలు ఉండవల్లిలో ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. అదీ ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం డీల్‌ పవర్‌..!

సురేంద్రనాయుడు ద్వారా కుదిరిన ఆఫ్రికా మోడల్‌ నకిలీ మాఫియా డీల్‌ను 2024 ఎన్నికలకు ముందే రుచి చూపించారు. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేసింది. మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలపై నియంత్రణ విధించింది. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు, విచ్చలవిడిగా పంపిణీకి  మద్యం అందుబాటులో లేదు. కానీ, టీడీపీ కూటమి మాత్రం తమ అభ్యర్థులకు భారీగా మద్యం సరఫరా చేయడం గమనార్హం. దీనివెనుక జయ­చంద్రారెడ్డి, సురేంద్రనాయుడుతో కూడిన తంబళ్లపల్లె టీడీపీ బ్యాచ్‌ ఉంది. వీరు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో మద్యం పంపిణీని పర్యవేక్షించారు. అప్పటికే సరిహద్దులకు అవతల కర్ణాటకలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారు. అక్కడినుంచి భారీగా నకిలీ మద్యాన్ని టీడీపీ అభ్యర్థులకు అందజేయగా వారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేశారు.  
 
ఆఫ్రికాలో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నాయని టీడీపీ తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్‌లో స్వయంగా పేర్కొన్న భాగం 

మనం నకిలీ మద్యం పంచామా? 
రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ కూటమి ఎన్నికల బాధ్యతలు చూసిన పలువురు సీనియర్‌ నేతలు ప్రస్తుతం నకిలీ మద్యం బాగోతాన్ని గుర్తుచేసుకుంటున్నారు.జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు బ్యాచ్‌ మా ద్వారా పంపిణీ చేయించింది నకిలీ మద్యమా? అని అవాక్కవుతున్నారు. ‘‘తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాజకీయంగా కనీసం పట్టు లేని జయచంద్రారెడ్డికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్‌ ఎందుకిచ్చారో... సురేంద్రనాయుడు కింగ్‌ మేకర్‌గా చక్రంతిప్పడం వెనుక ఉన్నది నకిలీ మద్యం డీల్‌ అని మాకు ఇప్పుడు తెలుస్తోంది’’ అని పేర్కొంటున్నారు.

2014: ముఖ్యనేత... సురేంద్రనాయుడు.. ఇది ‘క్షమాభిక్ష’ బంధం
కట్టా సురేంద్రనాయుడు... ముఖ్య నేతతో లోతైన బంధం ఉన్న నాయకుడు. 2002 నాటి దారుణ జంట హత్యల కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఈయనకు 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక క్షమాభిక్ష దక్కింది. జంట హత్యల కేసులో సురేంద్రనాయుడుకు జిల్లా న్యాయస్థానం 2006లో యావజ్జీవం విధించింది. ఈ తీర్పును సురేంద్ర హైకోర్టులో సవాల్‌ చేసినా, జిల్లా కోర్టు తీర్పునే సమరి్థంచింది. అయితే, ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో టీడీపీ సర్కారు క్షమాభిక్ష 
ప్రసాదించింది.  

ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేసి... టీడీపీ సిండికేట్‌కు మొత్తం కట్టబెట్టిన కూటమి
2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక  టీడీపీ సిండికేట్‌ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులిచ్చింది. 75 వేల బెల్ట్‌ దుకాణాలు ఏర్పాటు చేసినా ఉదాసీనంగా ఉంటోంది. 540 బార్లను (త్వరలో మరో 300 బార్లు కూడా) టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. ఇలా రాష్ట్రంలో మద్యం నెట్‌వర్క్‌ను టీడీపీ సిండికేట్‌ గుప్పిటపట్టింది. అనంతరం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్‌రావు ఆధ్వర్యంలో ఆఫ్రికా మోడల్‌ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. 

టీడీపీ సీనియర్‌ నేతలకు ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు అప్పగించింది. నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్‌ పొందిన ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బార్లు, బెల్ట్‌ షాపుల్లో దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏడాదిలోనే రూ.5,280కోట్లు కొల్లగొట్టిన ఈ మద్యం మాఫియా వచ్చే నాలుగేళ్లలో మరో రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడింది. అందులో 30 శాతం వాటా కరకట్ట బంగ్లాకే ముడుపులుగా చెల్లించాలన్నది డీల్‌. 

నకిలీ మద్యం కేసు నిందితుడు కట్టా సురేంద్రనాయుడు నేర చరిత్రకు సంబంధించిన పత్రాలు    

అంటే నకిలీ మద్యం మాఫియా ద్వారా సూత్రధారిగా ఉన్న ముఖ్య నేత కరకట్ట బంగ్లాకు దక్కేదే దాదాపు రూ.13,500 కోట్లు... ఇక ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు చూస్తున్న టీడీపీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులు, మద్యం సిండికేట్‌కు 50 శాతం, నకిలీ మద్యం రాకెట్‌ పాత్రధారులుగా జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్‌రావులకు 20 శాతం పంచుకోవాలన్నది డీల్‌. అందుకే ముఖ్యనేత అండతో రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా బరితెగించి దోపిడీకి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోంది.

ఎల్లో మీడియాలో అడ్డగోలు రాతలు 
దందా బయటపడడంతో డైవర్షన్‌ ప్లాన్‌ 
అడ్డంగా దొరికినా ఎదురుదాడి 
జయచంద్రారెడ్డికి టికెట్‌ ఇచ్చింది టీడీపీనే 
సురేంద్రనాయుడుకు క్షమాభిక్ష ఇచ్చింది ముఖ్యనేత 
బండారం బయటపడడంతో ఉక్కిరిబిక్కిరి  
నకిలీ మద్యం వ్యవహారంలో ముఖ్య నేత, టీడీపీ నాయకుల ప్రమేయం స్పష్టంగా బయటపడడంతో ఎల్లో మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. తిరుగులేని ఆధారాలతో అడ్డంగా పట్టుబడినా.. తూచ్‌ అదేమీ లేదంటూ ఎదురుదాడి చేస్తోంది. ఉక్కిరిబిక్కిరి అయి గుక్కతిప్పుకోలేక సంబంధంలేని విషయాలను తెరపైకి తెస్తోంది. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డి పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సురేంద్రనాయుడుకు క్షమాభిక్ష ఇచ్చింది ముఖ్యనేతనే అయినా... కొత్త కథలు అల్లుతోంది. అసలు విషయం తొక్కిపెట్టి బురదజల్లాలని చూస్తోంది. మొత్తం దందా బయటపడడంతో..  డైవర్షన్‌ ప్రణాళిక వేస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement