డ్రైవర్‌ అన్నలకు బాబు బురిడీ | Chandrababu Naidu Govt Shock to Auto drivers financial assistance | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ అన్నలకు బాబు బురిడీ

Oct 5 2025 5:44 AM | Updated on Oct 5 2025 5:44 AM

Chandrababu Naidu Govt Shock to Auto drivers financial assistance

బ్యాడ్జి ఉన్న వారందరికీ ఆర్థిక సహాయమని మేనిఫెస్టోలో హామీ 

2023లోనే 13 లక్షల మంది అర్హులు ఉన్నారన్న నారా లోకేశ్‌

ఈ రెండేళ్లలో పెరిగిన మరో 2 లక్షల మంది అర్హులు 

ఆటో డ్రైవర్లతో పాటు లారీ, టిప్పర్‌ డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ  

అధికారంలోకి రాగానే టోకరా

చెప్పని హామీ అమలు చేస్తున్నామని గొప్పలు.. 

మొదటి ఏడాది పథకం పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు 

రెండో ఏడాదిలో 18 నిబంధనలతో అర్హుల్లో భారీగా కోత 

15 లక్షల మందికి ఇవ్వాల్సింది రూ.2,250 కోట్లు 

ఇచ్చింది కేవలం రూ.436 కోట్లే 

ఏకంగా 12 లక్షల మందికి ఎగవేత

ఇప్పటికే భారీగా తగ్గిన ఆటో డ్రైవర్ల ఆదాయం  

ఆర్థిక సహాయానికి ముఖం చాటేసిన కూటమి ప్రభుత్వం

సాక్షి, అమరావతి: ‘అంతన్నాడింతన్నాడే గంగరాజు...’ అని ఉత్తరాంధ్రలో ఓ జానపద గీతం బాగా పాపులర్‌. ప్రస్తుతం చంద్రబాబు పనితీరూ అలానే ఉంది. మేనిఫెస్టోలో అంత చేస్తాం.. ఇంత చేస్తాం.. అని హామీలు ఇచ్చిన ఆయన తీరా అధికారంలోకి రాగానే మరోసారి తన ట్రేడ్‌ మార్కు శైలిలో బురిడీ కొట్టిస్తున్నారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ అని చెప్పి తీరా అమలులోకి వచ్చేసరికి కొందరికే అంటూ టోకరా వేశారు. మేనిఫెస్టోను యథాతథంగా ఏనాడూ అమలు చేయని చంద్రబాబు మరోసారి తన ట్రాక్‌ రికార్డును కొనసాగించారు. 

ఈసారి ఆయన్ను నమ్మి మోసపోయిన బాధితుల జాబితాలో పేద డ్రైవర్లు కూడా చేరారు. మొదటి ఏడాది పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా ఎగవేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం.. రెండో ఏడాది సరికొత్త మోసానికి తెరతీసింది. దరఖాస్తు చేసేందుకే అవకాశం లేకుండా నిబంధనల చట్రం బిగించి, ఏకంగా 80 శాతం మందికి పథకం అందకుండా చేసింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్రైవర్లకు ఎంతో చేసిందని చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ ఎల్లో మీడియా ద్వారా సొంత డబ్బా కొట్టుకోవడం విస్మయ పరుస్తోంది. ఇవ్వని హామీ నెరవేరుస్తున్నామని గొప్పలు చెబుతుండటం నివ్వెరపోయేలా చేస్తోంది.

ఇద్దరూ బురిడీ బాబులే
ప్రతి ఎన్నికల ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే చంద్రబాబు.. 2024 ఎన్నికల ముందు అదే పన్నాగాన్ని అమలు చేశారు. బ్యాడ్జి ఉన్న ప్రతి డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మాటలతో బూరెలు వండటంలో తన తండ్రిని మించిపోయేలా లోకేశ్‌ హామీలు గుప్పించారు. తమ పార్టీ అధికా­రంలోకి వస్తే ఆర్థిక సహాయం పథకం లబ్ధిదారులయ్యేందుకు బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారని ఆయన 2023లోనే ప్రకటించారు. 

అంటే కనీసం 13 లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన చెప్పారు. ఈ రెండేళ్లలో మరో రెండు లక్షల మంది బ్యాడ్జి పొంది ఉంటారని రవాణా శాఖ వర్గాలే చెబుతున్నాయి. అంటే ప్రస్తు­తం 15 లక్షల మంది అర్హులు ఉన్నారని లెక్క తేలుతోంది. ఆ ప్రకారం 15 లక్షల మందికి రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.2,250 కోట్లు  ఆర్థిక సహాయం చేయాలి.

ఇదీ టీడీపీ మేనిఫెస్టో 

బ్యాడ్జీ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్‌ కలిగిన ప్రతి లారీ, టిప్పర్‌ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న భాగం 

ఏకంగా 80 శాతం ఎగవేత
మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేస్తామన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా... ‘డ్రైవర్‌ అన్నల సేవలో..’ అంటూ కేవలం రూ.436 కోట్లే ఇచ్చింది. అందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కింది. బ్యాడ్జి ఉంటే చాలు పథకం వర్తింపజేస్తామన్న చంద్రబాబు.. తీరా ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చే సరికి ఏకంగా 18 నిబంధనలు పెట్టారు. తద్వారా బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు. 

లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లు, రేషన్‌ సరుకులు డెలివరీ వాహనాలు.. ఇలా లక్షలాది మందికి పథకం అందకుండా ఆంక్షలు విధించారు. లోకేశ్‌ చెప్పినట్టు 2023లోనే 13 లక్షల మంది బ్యాడ్జి ఉన్న వారు ఉంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘డ్రైవర్‌ అన్నల సేవలో’ పథకాన్ని 2.9 లక్షల మందికే పరిమితం చేసి, ఏకంగా 12 లక్షల మందికి ఎగ్గొట్టారు. ఈ 2.9 లక్షల మందిలో కూడా తుదకు ఎంత మందికి ఎగ్గొడతారో అని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఇందుకు ఉదహరిస్తు­న్నారు. 

ఆటో డ్రైవర్ల సేవలో..  పథకానికి సంబంధించి అర్హత నిబంధనల పేరుతోనే ఏకంగా 10 లక్షల మందికి కోత విధించారు. ఇక దరఖాస్తు చేసిన 3,21,531 మందికి కూడా పథకాన్ని వర్తింప చేయలేదు. వారిలో కూడా 2,90,669 మందినే అర్హులుగా ప్రకటించారు. దాంతో ఈ పథకం కింద ఆర్థిక సహాయం రూ.436 కోట్లకే సరిపెట్టారు. ఇస్తామని ఎన్నికల్లో చెప్పింది రూ.2,250 కోట్లు కాగా, ఇచ్చింది కేవలం రూ.436 కోట్లే. అంటే ఇచ్చిన హామీలో 80 శాతం కోత విధించారన్నది స్పష్టమవుతోంది. అదీ చంద్రబాబు మార్కు బురిడీ అంటే అని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు. 

తొలి ఏడాది పూర్తిగా ఎగవేత 
మేనిఫెస్టోను అమలు చేయకుండా అడ్డదారులు వెతకడంలో తనది మాస్టర్‌ మైండ్‌ అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు అందరికీ ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్న ఆయన.. అధి­కారంలోకి వచ్చిన తొలి ఏడాది అంటే 2024లో ఆ పథకం ఊసే ఎత్త లేదు. తొలి ఏడాది డ్రైవర్లకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం చేయలేదు. ఆ విధంగా ఒక ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది పథకం అమలు చేస్తామంటూనే ఏకంగా 18 నిబంధనలు విధించి అర్హుల జాబితాలో భారీగా కోత విధించారు. మేని­ఫె­స్టోను సక్రమంగా అమలు చేయకుండా మోసం చేయడంలో చంద్రబాబు ట్రేడ్‌ మార్క్‌ అంటే ఇదే మరి. 

ఇప్పటికే భారీగా ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్లు
చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో ఆటో డ్రైవ­ర్లు ఆర్థిక ఇక్కట్లలో కూరుకుపోతున్నారు. రాష్ట్ర­ంలో ఆటో డ్రైవర్ల ఆదాయం భారీగా పడిపోయి­ంది. ఆటోల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకం ద్వారా అయినా కాస్త ఊరట లభిస్తుందని ఆశించిన డ్రైవర్లకు నిరాశే మిగిలింది. ఏకంగా 10 లక్షల మందిని ఈ పథకానికి అనర్హులుగా చేసి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పథకాన్ని సక్రమంగా అమలు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేయడం అంటే ఏమిటో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు చేతల్లో చూపించింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సి కేబ్, రేషన్‌ వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ‘వైఎస్సార్‌సీపీ వాహన మిత్ర’ పథకాన్ని అందించింది. మొదటి ఏడాది అని ఎగవేయలేదు. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అని సాకుతో తప్పించుకోలేదు. అధికారంలోకి రాగానే పథకం అమలు చేసింది. 

కోవిడ్‌ సమయంలోనూ క్రమం తప్పకుండా అందించింది. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అమలులోకి రావడానికి ముందే వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ఏమిటో వైఎస్‌ జగన్‌ చేతల్లో చూపించారని డ్రైవర్లు ప్రస్తుతం గుర్తు చేసుకుంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement