
చర్చల వేళ ప్రభుత్వం మొండి వైఖరితో విద్యుత్ సౌధ వద్ద పడిగాపులు కాస్తూ కూర్చున్న జేఏసీ నేతలు
మొక్కుబడి హామీలతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మె విరమణ
కాంట్రాక్టు కార్మికులను సంస్థల్లో విలీనం చేయడం కుదరదన్న సర్కార్
ముఖ్యమైనవి సాధించకుండా వెనక్కి తగ్గడంపై మండిపడ్డ సంఘాలు
కాంట్రాక్టు కార్మికులను సంస్థల్లో విలీనం చేయడం కుదరదు
విలీనం కోసం పట్టుబడితే ఉన్నవారిని తీసేస్తామని బెదిరింపు.. కొత్తవారి నియామకానికి సిద్ధమని హెచ్చరిక
డిమాండ్లలో కొన్నింటికి మాత్రమే సానుకూలత
దీంతో గత్యంతరంలేక సమ్మె నిర్ణయం వెనక్కి
ముఖ్యమైనవి సాధించకుండా వెనక్కి తగ్గడంపై మండిపడ్డ పలు సంఘాలు
దశలవారీ ఆందోళనలను కొనసాగిస్తామని వెల్లడించిన స్ట్రగుల్ కమిటీ
సాక్షి, అమరావతి: తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ వెల్లడించింది. ముఖ్యమైన డిమాండ్లకు సర్కారు ఏమాత్రం తలొగ్గకుండా మొక్కుబడి హామీలు మాత్రమే ఇచ్చినప్పటికీ జేఏసీ నేతలు చేసేదేంలేక సమ్మె నిర్ణయాన్ని, ఆందోళనలను విరమిస్తున్నట్లు ప్రకటించింది. గతనెల 15 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు స్పందించకపోవడంతో చివరి అస్ట్రంగా సమ్మె నోటీసు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో.. ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం, యాజమాన్యాల తరఫున సీఎస్ కె. విజయానంద్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. మూడు విడతల్లో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ చర్చలు జరిగాయి. అయినా ప్రధాన డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గలేదు. కారుణ్య నియామకాల్లో వయసు సడలింపును ఒకసారి కల్పించడం.. జీతాలు, సర్విస్ విషయాలపై వచ్చే పీఆర్సీతో చర్చిస్తామని చెప్పడం.. ఎనర్జీ అసిస్టెంట్లను జేఎల్‌ఎంలుగా గుర్తించడం.. 1999–2004 మధ్య విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారిని జీపీఎఫ్ పరిధిలోకి తేవాలన్న ప్రధాన డిమాండ్‌పై నిర్ణయానికి కమిటీని నియమించడం వంటి మొక్కుబడి హామీలతో ప్రభుత్వం చర్చలు ముగించింది.
కాంట్రాక్టు ఉద్యోగుల విలీనం కుదరదు
ఇక కాంట్రాక్టు ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌ను ఒప్పుకోవడం కుదరదని ప్రభుత్వం తెగేసి చెప్పింది. వారికి ఏజెన్సీ నుంచి కాకుండా విద్యుత్ సంస్థలే నేరుగా జీతాలివ్వాలనే ప్రతిపాదనను పట్టించుకోలేదు. అంతేకాక.. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై చర్చించడానికి కూడా ఇష్టపడలేదు. విలీనానికి పట్టుబడితే ప్రస్తుతమున్న కాంట్రాక్టు కార్మికులందరినీ తొలగిస్తామని బెదిరించింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడానికి ఇప్పటి ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసులు వచ్చాయని, పేర్లతో కూడిన జాబితా కూడా సిద్ధంగా ఉందని హెచ్చరించింది. మిగిలిన డిమాండ్లలో కొన్నింటికి సానుకూలత వ్యక్తంచేసింది. అది కూడా గతంలో అమలులో ఉన్న కొన్నింటికి మాత్రమే.
ఉద్యోగులు కోరుతున్న అనేక డిమాండ్లకు కమిటీలను నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో.. దాదాపు 23 విద్యుత్ సంఘాలతో కూడిన జేఏసీ నేతలు విద్యుత్ సౌధ వద్ద శుక్రవారం అర్ధరాత్రి వరకూ కూర్చుండిపోయారు. కాంట్రాక్టు కార్మికుల విషయంలో ఏదైనా హామీ ఇవ్వకపోతే సమ్మె విరమించడం కుదరదని స్టీరింగ్ కమిటీతో వాదించారు. దీంతో అర్ధరాత్రి దాటిన తరువాత మరోసారి చర్చలకు పిలిచి, కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తామని, అదే విధంగా వైద్యసేవలు, బీమా, ఉద్యోగ విరమణ సమయంలో కొంత ఆర్థిక ప్రయోజనం, సర్విస్ ఇంక్రిమెంట్లు వంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పింది.
దీంతో.. చేసేదిలేక జేఏసీ నేతలు సమ్మె నిర్ణయాన్ని, ఆందోళనలను విరమిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. పైగా.. చర్చల్లో అంగీకరించిన వాటిలోనూ కొన్నింటిని మినిట్స్‌లో చేర్చేందుకు స్టీరింగ్ కమిటీ నిరాకరించింది. కాంట్రాక్టు ఉద్యోగులను సంస్థల్లో విలీనంచేసే విషయంలో కమిటీ వేస్తామని చెప్పినా దానిని మినిట్స్‌లో చేర్చకపోవడంతో జేఏసీ సభ్యులు కాసేపు అక్కడే బైఠాయించి ధర్నాచేశారు. అయినా ఎలాంటి ఫలితం లభించలేదు. చివరివరకూ ప్రభుత్వం తాను అనుకున్నట్లుగానే చర్చలు జరిపి, ఉద్యోగులకు మొక్కుబడి హామీలను ఇచ్చి సరిపెట్టింది.
సమ్మె విరమించడం అన్యాయం..
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్లు అయిన సంస్థలో విలీనం, డైరెక్ట్ పేమెంట్, సమాన పనికి సమాన వేతనం లాంటి అంశాల మీద ఎలాంటి నిర్దిష్ట హామీలేకుండా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మెను విరమించడం చాలా అన్యాయమని స్ట్రగుల్ కమిటీ చైర్మన్ పోతులూరి సుదర్శన్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ వెన్నపూస సుబ్బిరెడ్డి మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికుల ఆశలు అడియాశలయ్యాయని.. చర్చల పేరుతో యాజమాన్యం, జేఏసీ కాంట్రాక్టు కార్మికులను మోసంచేశాయని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనంచేసి యాజమాన్యం నేరుగా వేతనం ఇవ్వాలనే డిమాండ్‌తో స్ట్రగుల్ కమిటీ దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తుందన్నారు. నవంబరులో ‘చలో విద్యుత్‌సౌధ’ ఉద్యమాన్ని చేపడతామని శనివారం ఒక ప్రకటనలో ప్రకటించారు.