
సాక్షి, అనంతపురం: టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లో లిక్కర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకులు సాకే శైలజానాథ్. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా? అని ప్రశ్నించారు. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి శైలజానాథ్ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ పాలనలో బెల్టు షాపులు లేవు. ప్రభుత్వమే నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరిపించింది. చంద్రబాబు ఓ అసమర్థ ముఖ్యమంత్రి. బాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోంది. కల్తీ మద్యం తయారు చేస్తూ పట్టుబడ్డ వారంతా టీడీపీ నేతలే. నాలుగు లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. ప్రజల ఆరోగ్యం నాశనం అవుతుంటే.. మీరు జేబులు నింపుకుంటున్నారా?. చంద్రబాబు అబద్దాల ముఖ్యమంత్రి. నకిలీ లిక్కర్ కుటీర పరిశ్రమను చంద్రబాబు రాష్ట్రమంతా నడిపిస్తున్నారు. కల్తీ మద్యం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.
ఏపీలో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. చంద్రబాబు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు. చాలా కాలం నుంచి లిక్కర్ దందాకు చంద్రబాబు ప్లాన్ చేశారు. చంద్రబాబు మనుషుల చేతుల్లోనే లిక్కర్ షాపులున్నాయి. లక్షలాది బెల్టు షాపులు టీడీపీ వారివే. చంద్రబాబు డర్డీ పాలిటిక్స్ చేస్తున్నారు. అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ లిక్కర్ అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. కల్తీ మద్యం అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే కేసును సీబీఐకి అప్పగించాలి. నకిలీ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ను ఇరికించే కుట్రలు జరుగుతున్నాయి. జోగి రమేష్ ఛాలెంజ్‌ను చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్వీకరించలేదు?.

రాష్ట్రంలో అన్యాయం, అరాచక పాలన సాగుతోంది. లోకేష్ మీ నాన్నలా రాజకీయాలు చేయకు.. మంచి రాజకీయాలు నేర్చుకో. చంద్రబాబు సిట్ అంటేనే రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. చంద్రబాబు వేసే సిట్.. ఆయన సిట్ అంటే సిట్, ఆయన స్టాండ్ అంటే స్టాండ్ . చంద్రబాబు ఓట్ చోరీ ద్వారా అధికారంలోకి వచ్చారు. విద్యాశాఖ మంత్రి గా నారా లోకేష్ పూర్తిగా విఫలమయ్యారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ శాఖలు సరిగా పనిచేయలేదని సాక్షాత్తూ మంత్రి సత్యకుమార్ అంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు ఇస్తే పేదల పరిస్థితి ఏంటి?. వైఎస్సార్‌సీపీ, ప్రజలు అడిగే ప్రశ్నలకు కూటమి నేతల దగ్గరా సమాధానాలు లేవు’ అని అన్నారు.