
సాక్షి, తూర్పుగోదావరి: వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు.. ఇదే మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి అని ఎద్దేవా చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్. డేటా సెంటర్‌పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్‌తో చర్చకు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. అలాగే, నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డికి వైఎస్సార్‌సీపీతో ఏం సంబంధమని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘హైదరాబాదు ఇంకా మేమే అభివృద్ధి చేశామని చంద్రబాబు, లోకేష్ డబ్బా కొట్టుకుంటున్నారు. అభివృద్ధి అంతా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది. చంద్రబాబు కాలంలో ఏపీలోనూ ఎటువంటి అభివృద్ధి లేదు. తొమ్మిది హార్బర్స్‌కు శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎంతో చేసినా ప్రచారం చేసుకోవడంలో వైఫల్యం చెందాం.. ఇది వాస్తవం. అప్పటి ఐటీ మంత్రి అమర్నాథ్‌ను డేటా సెంటర్ అంటే తెలుసా అని లోకేష్ ప్రశ్నించడం హాస్యాస్పదం.
డేటా సెంటర్ అంటే ఏమిటి లోకేష్?. డేటా సెంటర్‌పై మాజీ ఐటీ మంత్రి అమర్నాథ్‌తో చర్చకు లోకేష్ సిద్ధమా? దీనిపై సవాల్ చేస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ, విశాఖలో పెట్టుబడులు, గోదావరి జిల్లాలో ఆక్వా అభివృద్ధి, పోర్టుల అభివృద్ధి అన్ని గత ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలే. జిందాల్ సంస్థ తరిమివేస్తే మహారాష్ట్రకి వెళ్లి మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంది. ఇంత దారుణంగా రాష్ట్రాన్ని అమ్మేసే వ్యవహారం చేస్తున్నారు. పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రాపర్టీ ఏది?. రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం కాకుండా ఉంటాయి’ అని హితవు పలికారు.
ప్రజలు చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నారని అనుకుంటున్నారా?. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డి.. ఆయన వైఎస్సార్‌సీపీ కోవర్ట్ అంటున్నారు. మరి ఎమ్మెల్యే టికెట్ మీరెందుకు ఇచ్చారు?. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మీపై ఆరోపణలు వస్తే పక్కవారిపై బురద జల్లడం మీకు అలవాటు. చిన్నపాటి సోషల్ మీడియా కేసులకి దేశం దాటితే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి పాస్‌పోర్టు రద్దు చేస్తున్నారు. మరి జయచంద్రా రెడ్డి విషయంలో ఎందుకు చేయలేదు. ఆయన ఫోన్ సంభాషణలు ఎవరితో చేశారో స్పష్టం చేయండి. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేయించండి అన్ని అంశాలు వెలుగులోకి వస్తాయి.
సిట్ వేయడం వల్ల ఇటువంటి ఉపయోగం ఉండదు. టీడీపీ నేతలపై సిట్ కేసు నమోదు చేస్తుందా?. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీరే భాగస్వాములు కదా.. సీబీఐకి అప్పగించండి. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం మాత్రమే కాదు. పాలకొల్లు, అమలాపురం, ఎక్కడ చూసినా నకిలీ మద్యం కేంద్రాలు బయటపడ్డాయి. 16 నెలలుగా రాష్ట్ర ప్రజలతో నకిలీ మద్యం తాగిస్తున్నారు. ప్రతి నాలుగు బాటిల్లో ఒకటి నకిలీ మద్యమే. జోకర్లు ఎమ్మెల్యేలు అయితే రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే ఉంటుంది. రాజమండ్రిలో ప్రవీణ్ చౌదరి రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికుల సంఘం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 9000 రూపాయలు పెంచి వేతన సవరణ చేశారు. రాజమండ్రి ప్రస్తుత ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే 5400 మాత్రమే చేయించారు’ అని చెప్పుకొచ్చారు.