ఆకలి కేకలపై ఖాకీ దాష్టీకం | - | Sakshi
Sakshi News home page

ఆకలి కేకలపై ఖాకీ దాష్టీకం

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

ఆకలి

ఆకలి కేకలపై ఖాకీ దాష్టీకం

పెరవలి: పెండ్యాల పరిధిలో బూరుగు వద్ద ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంప్‌లో తమకూ పని కల్పించి ఉపాధినివ్వాలని కానూరు కార్మికులు ఆందోళన చేయగా పెరవలి ఎస్‌ఐ వారిపై చేయిచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మండలంలోని కానూరుకు చెందిన 700 మంది ఇసుక ర్యాంపునకు వెళ్లే రహదారిని దిగ్బంధించి రోడ్డుపైనే ధర్నా చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనతో ఇసుక ర్యాంపు కార్యకలాపాలు స్తంభించాయి. గ్రామానికి చెందిన 700మంది ఇసుక ర్యాంప్‌ కార్మికులు, పంచాయతీ మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా ముఠా కార్మిక సంఘం గౌరవ ప్రెసిడెంట్‌లు కాసుమల్ల రామకృష్ణ, జన్ని శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు చెందిన మూడు కార్మిక సంఘాలను రిజిస్టర్‌ చేయించామని చెప్పారు. బూరుగు ఇసుక ర్యాంపులో పని కల్పించమని ర్యాంప్‌ నిర్వాహకులు, పెండ్యాల కార్మిక సంఘాలకు, పెద్దలకు తెలిపామని అన్నారు. కానీ పని కల్పించకుండా రాజకీయ అండతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని, వ్యవసాయ పనులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంపు పెండ్యాల పరిధిలో ఉన్నా ఇసుక ర్యాంపు నుంచి వచ్చే లారీలు, ట్రాక్టర్లు మా గ్రామం మీదుగా వెళ్తున్నాయని, అయినా మా గ్రామస్తులకు పని కల్పించడం లేదని తెలిపారు. కార్మికుల డిమాండ్‌ న్యాయ సమ్మతంగా ఉండడంతో ఆందోళనకు మద్దతు తెలిపామని గ్రామ పంచాయతీ, సొసైటీ, ఎంపీటీసీ సభ్యులు చెప్పారు.

కార్మికులపై ఎస్‌ఐ దూకుడు

ఈ ఆందోళనతో ర్యాంపు నుంచే వచ్చే వందలాది లారీలు నిలిచిపోయాయి. పెరవలి ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వచ్చి వెంటనే రోడ్డు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా కార్మికులు ఆందోళన కొనసాగించడంతో ఆయన నిడదవోలు సీఐకి ఇక్కడి పరిస్థితిని వివరించడంతో అక్కడి నుంచి సమిశ్రగూడెం ఎస్‌ఐ బాలాజీని, సిబ్బందిని పంపించారు. రోడ్డుపై బైఠాయించిన వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించేయాలని పోలీసులు ప్రయత్నించడంతో పెనుగులాట చోటు చేసుకుంది. ఈ దశలో పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు కార్మికులపై చేయి చేసుకున్నారు. దీనితో గ్రామ పెద్దలు, కార్మికులు ఆగ్రహించటంతో పోలీసులు మరింత ఆగ్రహంతో కొందరు కార్మికులను బలవంతంగా జీప్‌ ఎక్కించారు. దీంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయం జరిగే వరకు ధర్నాను విరమించేది లేదని, లారీలను వెళ్లనివ్వబోమని కార్మిక సంఘ నాయకులు కరాఖండీగా చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులతో ఫోన్‌లో సంప్రదించిన తరువాత పోలీసులు ర్యాంప్‌ నిర్వాహకులతో మాట్లాడారు. పెండ్యాల, కానూరు కార్మికులకు సరి సమానంగా పనులు కల్పించాలని అధికారులు చెప్పగా ర్యాంప్‌ నిర్వాహకులు ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారం అయ్యింది. మాజీ సర్పంచ్‌లు, పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యురాలు కార్మికులు పాల్గొన్నారు.

నిలిచిపోయిన వందలాది వాహనాలు

తమకూ పని కల్పించాలని

కానూరు కార్మికుల ఆందోళన

కార్మికులపై చేయి చేసుకున్న

ఎస్‌ఐ– ఆగ్రహించిన గ్రామస్తులు

ర్యాంప్‌ నిర్వాహకులతో చర్చల

అనంతరం సమస్యకు పరిష్కారం

పెండ్యాల, కానూరు కార్మికులకు సమానంగా పని

కల్పించాలని నిర్ణయం

ఆకలి కేకలపై ఖాకీ దాష్టీకం1
1/1

ఆకలి కేకలపై ఖాకీ దాష్టీకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement