రాయవరం: జిల్లాలో పదో తరగతి పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 17వ తేదీన ఇవి ప్రారంభమైన విషయం పాఠకులకు విదితమే. ఈ పరీక్షల నిర్వహణను విద్యాశాఖ సమర్థవంతంగా చేపట్టింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 391 కేంద్రాల్లో రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 72,797 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా, మొత్తం 99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ నిరంతరం తనిఖీలు నిర్వహించి, పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నాయి.
ఉభయులకు ఉపశమనం
పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటూ విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు, పరీక్షలు ముగియగానే సంతోషంగా ఇంటిబాట పట్టారు. అదే సమయంలో ఇన్నాళ్లూ తమతో చదువుకున్న విద్యార్థులు, పరీక్షా కేంద్రంలో పరిచయమైన విద్యార్థులు బాధగానే వీడ్కోలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు కరపత్రాలు పంచుతూ, వారి ఫోన్ నంబర్లు, చిరునామాలు సేకరించే పనిలో పడ్డాయి.
ఫలితాలపైనే దృష్టి
పరీక్షలు ముగియడంతో ఇక అందరి దృష్టి ఫలితాలపైనే కేంద్రీకరించారు. 2025 పది ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవగా, తూర్పుగోదావరి జిల్లా 87.99 శాతం ఉత్తీర్ణతతో 6వ స్థానంలో, కాకినాడ జిల్లా 82.44 శాతంతో 15వ స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది గతేడాది ఆ ఫలితాలకు మించి ఉత్తీర్ణతా శాతాన్ని మెరుగుపర్చుకుంటాయో, లేదో చూడాలి.
గతేడాది మెరుగైన ఫలితాలు
గతేడాది ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఉత్తీర్ణతా ఫలితాలను సాధించాయి. ఈ ఏడాది కూడా ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాణిస్తారనే నమ్మకాన్ని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫలితాల మాటెలా ఉన్నా జిల్లాలో పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా, సమర్థ వంతంగా నిర్వహించడంపై పాఠశాల విద్యా శాఖ ఆర్‌జేడీ జి.నాగమణి జిల్లాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. కాగా.. పది పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఈ నెల 6 నుంచి చేపట్టనున్నారు. పరీక్ష పేపర్ల వాల్యుయేషన్‌కు నియమించిన ఉపాధ్యాయులు విధిగా స్పాట్ వాల్యుయేషన్‌కు హాజరు కావాలని ఆర్‌జేడీ నాగమణి తెలిపారు.
ఫ ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు
ఫ ప్రశాంతంగా జరిగిన వైనం
ఫ గతేడాది ఆరో స్థానంలో
నిలిచిన ‘తూర్పు’
ఫ ఈసారి మెరుగవుతుందని ఆకాంక్ష


