పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలి

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

పూర్తి స్థాయిలో  పనులు ప్రారంభించాలి

పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలి

కలెక్టర్‌ కీర్తి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిధిలో గోదావరి నది తీర ప్రాంతాలు, హౌస్‌ బోటింగ్‌, కడియం నర్సరీ ఆధారిత పర్యాటక అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని కలెక్టర్‌ కీర్తి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులతో పాటు బోట్‌ వెండర్స్‌, హౌస్‌ బోటింగ్‌ ఆపరేటర్లు, ఎకో స్పోర్ట్స్‌ నిర్వాహకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ రాబోయే మూడు నెలల్లో పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హౌస్‌ బోట్స్‌ తయారు చేసే మరింత మంది తయారీదారులను గుర్తించి, వారి ద్వారా నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మార్చి 3న చంద్రగ్రహణం

సత్యదేవుని ఆలయం మూసివేత

అన్నవరం: చంద్రగ్రహణం కారణంగా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని మార్చి మూడో తేదీ ఉదయం 10 గంటల నుంచి మూసివేయనున్నట్లు ఈఓ వి.త్రినాథరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా ఆ రోజు మధ్యాహ్నం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సాయంత్రం 6.47 గంటల వరకూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేవస్థానంలో ఆ రోజు స్వామివారి వ్రతాలు ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారు. వ్రతాలు, ఆయుష్య హోమం, నిత్య కల్యాణం, కేశఖండన టికెట్లను ఉదయం 7 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. స్వామివారి ప్రసాదాలు కూడా ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. పౌర్ణమి సందర్భంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం, సత్యదేవునికి ప్రతి రోజూ చేసే ఆయుష్య హోమం, నిత్యకల్యాణాలను ఆ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభించి ఉదయం 9.30 గంటల్లోగా పూర్తి చేస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు స్వామివారి దర్శనాలు నిలిపివేసి, ఆలయం మూసివేస్తారు. గ్రహణానంతరం స్వామివారి ఆలయం, వ్రత మండపాలు, ప్రాంగణాన్ని శుద్ధి చేస్తారు. మార్చి నాలుగో తేదీ తెల్లవారుజామున ఆలయాన్ని తెరచి, యథావిధిగా స్వామివారి దర్శనం, వ్రతాలు, పూజలు, కల్యాణం, ఆయుష్య హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈఓ కోరారు.

చట్టం లక్ష్యాలను

ప్రజలకు చేరువ చేయాలి

రాష్ట్ర ఆహార భద్రత కమిషన్‌ సభ్యుడు కృష్ణ కిరణ్‌

అమలాపురం రూరల్‌: ఆహార భద్రత చట్టం లక్ష్యాలు ప్రజల వరకు సమర్థంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కృష్ణ కిరణ్‌ అధికారులకు పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేషన్‌ సరఫరా, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అంగన్‌వాడీ పోషకాహార పథకాల అమలులో లోపాలు ఉండకూడదన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలని సూచించారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని వండి వడ్డించాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్‌ మాట్లాడుతూ ఆహార కమిషన్‌ జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరును పర్యవేక్షిస్తుందన్నారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ పి.శ్రీనివాస్‌ ఏఎస్‌ఓ శరత్‌, జిల్లా విద్యాశాఖ అధికారి పి.నాగేశ్వరరావు, తూనికలు కొలతల నియంత్రణాధికారి విశ్వేశ్వరరావు, ఐసీడీఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

సమన్వయంతో వీరేశ్వరస్వామి ఉత్సవాలు

ఐ.పోలవరం: మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలలో అధికారుల సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని డీఆర్వో కె.మాధవి ఆదేశించారు. ఆలయ ఆవరణలో చైర్మన్‌ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగిన సమావేశంలో డీఆర్వో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ భక్తుల భద్రతకు పెద్ద పీట వేయాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ, మెడికల్‌ సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో పని చేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement