ఇదేంటి.. ఓం నమశ్శివాయ! | - | Sakshi
Sakshi News home page

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!

Feb 11 2026 7:40 AM | Updated on Feb 11 2026 7:40 AM

ఇదేంట

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!

అపరిశుభ్రంగా ఉన్న కోటిలింగాల ఘాట్‌

అస్తవ్యస్తంగా ఉన్న పుష్కరఘాట్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పవిత్ర గోదావరి తీరాన మహాశివరాత్రి పర్వదినాన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదు. శివరాత్రి రోజున జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వేలాదిమంది రాకతో గోదావరి తీరం ఆధ్యాత్మిక తీరంగా మారుతుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పది రోజుల ముందు నుంచే భారీగా తరలి వచ్చే భక్తుల కోసం అనేక సౌకర్యాలు కల్పించాలి. కానీ నేటి వరకు ఒక్క ఘాట్‌లోనూ ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం సౌకర్యాలతో సిద్ధంగా ఉండాల్సిన స్నాన ఘాట్లు పుష్కర పనులతో అస్తవ్యస్తంగా మారాయి. వీఐపీ ఘాట్‌, సరస్వతీ ఘాట్‌, గౌతమీ ఘాట్‌, చింతాలమ్మ ఘాట్‌లలో భక్తులు స్నానమాచరిస్తారు. కాని ఈ ఘాట్‌లలో సైతం ఏర్పాట్లు చేయలేదని భక్తులు అవేదన చెందుతున్నారు. కొవ్వురులోని గోష్పాద క్షేత్రంలో కూడా శివరాత్రికి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ ఘాట్‌ సైతం పూర్తిగా అందుబాటులో లేదు.

ఎక్కడి పనులు అక్కడే

కేంద్ర ప్రభుత్వ నిధులతో అఖండ గోదావరి పేరుతో రూ.97 కోట్లతో గోదావరి ఘాట్‌లను మోడల్‌ ఘాట్‌లుగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా కోటిలింగాల ఘాట్‌, పుష్కరఘాట్‌లతో పాటు అనేక ఘాట్‌లలో నిర్మాణాలు చేపట్టారు. కాని పుష్కర పనులు నత్తనడకన సాగుతుండటంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారాయి.

నిరుపయోగంగా పుష్కర ఘాట్‌,

కోటిలింగాల ఘాట్‌

ఆదివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి రానున్నారు. గౌతమీ మహర్షి తపో ఫలంగా, పరమ శివుని జటాజూటం నుంచి జాలు వారిన గోదావరి పరీవాహక ప్రాంతం శివరాత్రి రోజున శివనామ స్మరణతో మార్మోగనుంది. కాని భక్తుల మనోభావాలకు విలువివ్వని చంద్రబాబు సర్కార్‌ ఘాట్‌ల విషయంలో శ్రద్ధ చూపకపోవడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీభువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం గోదావరి తీరాన కోటిలింగాలపేటలో ఉంది. ఇది అతి ప్రాచీనమైన, పురాణ ప్రశస్తి ఉన్న ఆలయం. అటువంటి ఆలయం చెంత ఉన్న కోటిలింగాల ఘాట్‌లో ఏర్పాట్లు శూన్యంగా ఉన్నాయి. కోటిలింగాల ఘాట్‌నుంచి సుమారు వంద అడుగులు దూరం నడిచి వెళితేనే కాని నీరు అందుబాటులో లేకపోవడం విచిత్రం. కనీసం శివరాత్రి రోజునైనా గోదావరి చెంతన ఉన్న ఘాట్‌లను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేయకపోవడం దురదృష్టకరం.

తొలి ట్రయల్‌ రన్‌ మరీ నెమ్మది!

కలెక్టర్‌ కీర్తి ఘాట్‌లను పరిశీలించి శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రైల్‌ రన్‌గా భావించి, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. కాని కలెక్టర్‌ కీర్తి ఆదేశాలను మాత్రం కింది స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ప్రసిద్ధి గాంచిన ఘాట్‌లు అస్తవ్యస్థంగా ఉన్న నేపథ్యంలో మంత్రి దుర్గేష్‌ గోదావరి తీరంలో ఏ ఘాట్‌లో స్నానమాచరించినా పుణ్యఫలం దక్కుతుందని పేర్కొనడం గమనార్హం.

కోటిలింగాల రేవులో కలసిన ప్రొటోకాల్‌

దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి రోజున స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ స్థానిక ప్రజాప్రతినిధి తన అనుచరులతో పాలక మండలిని ఘనంగా ఏర్పాటు చేశారు. వీరి కనుసన్నులలో ఈ మహోత్సవాన్ని నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దీనికోసం ఒక ఆహ్వాన పత్రికను కూడా రూపొందించారు. ఈ ఆహ్వాన పత్రికలో కలెక్టర్‌, కమిషనర్‌ వంటి వారి పేర్లను చేర్చకపోవడం చర్చకి దారి తీస్తోంది. కనీసం వారు రాకపోవడానికి వీలు లేకపోయినా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం వారి పేర్లను ప్రచురిస్తారు. కానీ ఈ ఏడాది అది కొరవడింది. దేవాలయానికి సంబంధించి 30 మంది శాశ్వత దాతలు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా వీరి పేర్లను ప్రతి సంవత్సరం ఆహ్వాన పత్రికలో ప్రచురించడం అనవాయితీ. కాగా నేడు కూటమి నాయకులకు చెందిన వారి పేర్లతో ఆహ్వాన పత్రికను రూపొందించడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. దేవుడి దగ్గర కూడా టీడీపీ నాయకుల ప్రచార యావ తగ్గలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

మహాశివరాత్రికి కానరాని ఏర్పాట్లు

పుణ్యస్నానాలాచరించడానికి

వీలుకాని వైనం

వేలాదిగా రానున్న భక్తులు

నత్తనడకన పుష్కరాల పనులు

ప్రత్యామ్నాయం చూపించని

అధికారులు, ప్రజాప్రతినిధులు

ప్రొటోకాల్‌ మరచిన

కోటిలింగేశ్వరస్వామి పాలక మండలి

పుష్కరఘాట్‌లో నత్తనడకన పనులు

మరో ముఖ్యమైనది పుష్కరఘాట్‌. ఇది స్నానాలకి అందుబాటులో లేదు. పుష్కర పనులతో ఇక్కడ నూతన ఘాట్‌ని నిర్మించడానికి పనులు చేపట్టారు. ఇవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. దీంతో ఈ ఘాట్‌లో స్నానాలు చేయడం ఇబ్బందికరమే కాకుండా ప్రమాదభరితంగా ఉంది. ఘాట్‌ల మెట్లపై ఉన్న రాయిని తొలగించడంతో భక్తులు మెట్లపై నుంచి దిగితే ప్రమాదం బారిన పడే అవకాశాలున్నాయి. అక్కడే వేసిన ఇసుక వల్ల భక్తులు జారి పోయే ప్రమాదం కూడా ఉంది.

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!1
1/4

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!2
2/4

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!3
3/4

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!4
4/4

ఇదేంటి.. ఓం నమశ్శివాయ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement