అధ్యాపకులు లేకుండా చదువులెలా?
● ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఆవేదన
● ఏడాది నుంచి భర్తీకాని పోస్టులు
● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
దేవరపల్లి: అధ్యాపకులు లేకుండా చదువు సాగెదెట్టా అని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు వాపోతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై తొమ్మిది నెలలు కావస్తున్నా అధ్యాపకులు లేక ఇబ్బంది పడుతున్నామని దేవరపల్లిలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు అధ్యాపకులు అవసరం కాగా, ఇద్దరు మాత్రమే బోధిస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే సంకల్పంతో ప్రతి మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం బాలుర, బాలికల జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా 2022–23 విద్యాసంవత్సరంలో గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేసింది. కళాశాలలను జిల్లా పరిషత్ హైస్కూళ్లు ప్రాంగణంలోని భవనాల్లో ఏర్పాటు చేసి అడ్మిషన్లు నిర్వహించారు. హైస్కూల్లోని కొంత మంది ఉపాధ్యాయులను కళాశాలలో అధ్యాపకులుగా నియమించి తరగతులు ప్రారంభించారు.
అధ్యాపకులు లేకుండానే
ముగుస్తున్న విద్యాసంవత్సరం
సత్సంకల్పంతో ప్రారంభించిన ఈ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ కళాశాలల ఆలనా పాలనా గాలికొదిలేసింది. పైగా, ఈ కళాశాలల్లో బోధిస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. ఇది జరిగి దాదాపు ఎనిమిది నెలలవుతున్నా కళాశాలల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయలేదు. దీంతో అధ్యాపకులు లేక ఈ కళాశాలల్లోని విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. జెడ్పీ హైస్కూలు నుంచి కళాశాలల్లో నియమితులైన ఉపాధ్యాయులకు అప్పట్లో ప్రభుత్వం ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఆ ఇంక్రిమెంటు పొందిన ఉపాధ్యాయులు వేరే ప్రాంతాలకు బదిలీ కావడంతో కళాశాలలో అధ్యాపక పోస్టులకు ఖాళీలు ఏర్పడ్డాయి. కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వేరే ప్రాంతాల్లో హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నప్పటికీ ఇంక్రిమెంట్ నేటికీ పొందుతున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే ఇంక్రిమెంట్ తీసుకోవలసి ఉంది. దీనిపై విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టి పనిచేసే ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్ ఇస్తే కళాశాలలో బోఽధించడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. అధ్యాపకులు లేకుండానే విద్యా సంవత్సరం ముగుస్తోంది.
ఇద్దరితోనే బోధన
దేవరపల్లిలో ఏర్పాటు చేసిన మహిళా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఏర్పాటు చేశారు. కశాశాలలో బోటనీ, జువాలజీ, ఇంగ్లిషు తెలుగు, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అధ్యాపకులు ఉండాలి. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ఇద్దరు ఇతర మండలానికి బదిలీపై వెళ్లారు. ఫిజిక్స్ అధ్యాపకురాలు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. దీంతో కళాశాలలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ నెల 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, అధ్యాపకులు లేకుండానే విద్యాసంవత్సరం పూర్తయిందని విద్యార్థులు అంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరానికై నా అధ్యాపకులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణను వివరణ కోరగా కళాశాలలో 45 మంది విద్యార్థినులు ఉండగా ఇద్దరు అధ్యాపకులే ఉన్నారన్నారు. మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు మాత్రమే బోధకులు ఉన్నట్టు చెప్పారు.


