
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఏపీ ప్రభుత్వ అరాచకపాలన, దమనకాండపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. సాక్షిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలంటూ డిమాండ్ చేశారు. భావప్రకటనా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందంటూ జర్నలిస్ట్ సంఘాల నాయకులు మండిపడ్డారు.
నకిలీ మద్యం పై వార్తలు రాస్తే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే. భవిష్యత్తులో వార్తలు రాయాలంటేనే జర్నలిస్టులు భయపడే పరిస్థితి నెలకొంది. వార్తలు రాస్తే కేసులు పెట్టడం చాలా దారుణం. అన్ని వార్తా సంస్థలను ఒకేలా చూడాలి. నకిలీ మద్యం తాగితే మనుషులు చనిపోరా?. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే రిపోర్టర్లు, ఎడిటర్లను కేసులతో వేధిస్తున్నారు. నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చారని రాయడం తప్పా?. నకిలీ మద్యం తప్పని రాయడం కూడా మీకు తప్పేనా?. నకిలీ మద్యం మంచిదే అని ప్రభుత్వం చెబుతోందా?. ఇప్పటికైనా ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు మానుకోవాలి. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏకమై పోరాడతాయి’’ అంటూ జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరించాయి.

వైఎస్సార్ జిల్లా: సాక్షి జర్నలిస్టులపై ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే, వైఎస్సార్‌సీపీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, నెల్లూరు బ్యూరో మస్తాన్ రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షసాధింపునకు దిగుతుందన్న జర్నలిస్టు నాయకులు.. వార్తలు రాస్తే ఖండించడానికి అనేక మార్గాలున్నా ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేయడం కక్షసాధింపు చర్యలేనన్నారు. మీడియా, సోషల్ మీడియా విషయంలో పోలీసులు, ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులు వినతిపత్రం అందించారు.

అనంతపురం జిల్లా: సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో జర్నలిస్టు సంఘాలు నిరసన తెలిపాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాలు మద్దతు తెలిపాయి. కల్తీ మద్యం కథనాలు జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయించడం తగదని.. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కల్తీ మద్యం అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లా: కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు నిరసనలు చేపట్టాయి. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని జర్నలిస్టు నేతలు డిమాండ్ చేశారు.
కాకినాడ జిల్లా: సాక్షి మీడియాపై పోలీసుల వేధింపులను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. పత్రిక స్వేచ్చ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసులను భేషరతుగా ఉపసంహరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు.
జనగామ: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా: సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై జరిగిన దమనకాండను నిరసిస్తూ హుజుర్‌నగర్ ఆర్డీవో కార్యాలయం ముందు జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు.
నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్‌లో సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని జర్నలిస్టులు సంఘాలు నిరసన చేపట్టారు. సాక్షి మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల గళాన్ని అణచే చర్యలను తక్షణం ఆపాలని సంఘాలు డిమాండ్ చేశాయి.
పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వ కుట్రపూరిత చర్యలకు నిరసనగా జర్నలిస్టుల నిరసన చేపట్టారు. అమరుల స్తూపం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. పత్రిక స్వేచ్ఛను హరించడాన్ని జర్నలిస్టు, వామపక్ష నాయకులు ఖండించారు
మహబూబాబాద్ జిల్లా: నకిలీ మద్యం పై వరుస కథనాలు ప్రచురించిన సాక్షిపై కూటమి ప్రభుత్వం, పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల నేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో పట్టణ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్బంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. గత నాలుగు రోజుల్లో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం, బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాక్షిపై అక్రమ కేసులతో దాడి చేయడం హేయమైన చర్య అంటూ దుయ్యబట్టారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి సాక్షి దినపత్రికపై అక్రమ కేసులు ఎత్తివేయాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.